Share News

CM Chandrababu Naidu: మన భాషను మరవొద్దు

ABN , Publish Date - Jan 06 , 2026 | 04:07 AM

సంక్రాంతి పండగకు ముందే అమ్మ భాషా పండగ వచ్చింది. ప్రపంచంలో తెలుగుజాతి నంబర్‌ వన్‌గా ఉండాలన్నదే నా జీవితాశయం’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

CM Chandrababu Naidu: మన భాషను మరవొద్దు

  • ఇజ్రాయెల్‌ యూదుల్లా శక్తిమంతం కావాలి

  • తెలుగు జాతి అగ్ర స్థానంలో నిలవాలి

  • టెక్నాలజీతో తెలుగుకు వచ్చిన ముప్పు లేదు

  • పైగా టెక్నాలజీతోనే మరింత పురోగతి సాధ్యం

  • ప్రపంచ తెలుగు మహాసభల్లో సీఎం ఉద్ఘాటన

గుంటూరు, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): ‘‘సంక్రాంతి పండగకు ముందే అమ్మ భాషా పండగ వచ్చింది. ప్రపంచంలో తెలుగుజాతి నంబర్‌ వన్‌గా ఉండాలన్నదే నా జీవితాశయం’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఇజ్రాయెల్‌ యూదుల్లా తెలుగు జాతి కూడా 2047 నాటికి ప్రపంచంలోనే శక్తివంతంగా తయారు కావాలని ఆయన ఆకాంక్షించారు. తెలుగు సారస్వత పరిషత్‌ ఆధ్వర్యంలో గుంటూరులో నిర్వహిస్తున్న మూడో ప్రపంచ తెలుగు మహాసభలకు ముఖ్య అతిథిగా సోమవారం ఆయన హాజరయ్యారు. హిందీ తరువాత ఎక్కువ రాష్ట్రాల్లో మాట్లాడే రెండో భాష తెలుగు అని, అంత గొప్ప భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఈ సందర్భంగా చంద్రబాబు తెలిపారు. అమ్మ భాష లేకపోతే జీవితానికి అర్థమే లేదని, ప్రతి ఒక్కరూ మాతృభాషను నేర్చుకోవాలని కోరారు. ‘‘మన దేశంలో ఆరు భాషలకు ప్రాచీన హోదా ఉంది. హిందీ, బెంగాలీ, మరాఠీ తర్వాతి స్థానం తెలుగుభాషదే. సామెతలు, పొడుపు కథలు, నానుడులు మన భాషలోనే చూస్తాం. దేశంలో ఒకరి భాషను మరొకరు గౌరవించుకోవాలి. ఏ భాషా ఎక్కువా, తక్కువా కాదు. మాతృ భాషలో అభ్యసించినవారే అత్యంత ప్రతిభావంతులు అవుతారు. కవిత్రయం నుంచి అష్టదిగ్గజాల వరకు, గురజాడ నుంచి శ్రీశ్రీ, దాశరఽథి వరకు ఎందరో మహానుభావులు తెలుగు భాష కోసం పని చేశారు.


వేమన, సుమతీ, భాస్కర పద్యాలను మరిచిపోలేం. అన్నమయ్య, వెంగమాంబ, మొల్ల వంటి వారు భక్తి మార్గంలో తెలుగుకు వెలుగు తెచ్చారు. తొలిభాషా ప్రయుక్త రాష్ట్రాన్ని తీసుకువచ్చిన అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాన్ని మరువలేం. తెలుగు జాతంటే మదరాసీలు కాదు.. తెలుగువారు అని ప్రపంచానికి చాటి చెప్పిన అన్న ఎన్టీఆర్‌, తెలుగు వ్యవహారిక భాషా పితామహుడు గిడుగు రామ్మూర్తి, ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలు కలిసే సమయంలో ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేసిన బూర్గుల రామకృష్ణారావు, దినపత్రికను నెలకొల్పి, తెలుగు భాషకు సేవలందించిన రామోజీరావు త్యాగాలను మరువలేం. జ్ఞానపీఠ అవార్డులతో తెలు గు సాహిత్య ఔన్నత్యాన్ని చాటిన విశ్వనాథ, సి.నారాయణరెడ్డి, రావూరి భరద్వాజ గొప్పవారు.’’ అని ఆయన తెలిపారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..


మాతృభాషను మర్చిపోవద్దు

‘‘ప్రస్తుత సమాజంలో ఇంగ్లీషు చాలా అవసరం. అలాగని మాతృ భాషను మర్చిపోవద్దు. అమెరికాలో ఉన్నా కేంద్ర మంత్రి పెమ్మసాని వారి పిల్లలను పెంచినట్లు పెంచితే తెలుగు భాషకు ఎలాంటి ప్రమాదం ఉండదు. టెక్నాలజీ వల్ల మాతృభాషకు ప్రమాదం ఏమీ ఉండదు. ఇంకా చెప్పాలంటే భాషలను కాపాడుకోవడం మరింత సులభం అవుతుంది. తెలుగు జాతి టెక్నాలజీలో ముందుండాలి..’’

అందుకే ఏటా నారావారి పల్లెకు..

‘‘తెలుగు సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణతోనే భాషా రక్షణ సాధ్యమవుతుంది. అందుకే ఎన్ని పనులు ఉన్నా ఏటా నారావారి పల్లెకు వెళ్లి అక్కడ గడపాలని నా భార్య భువనేశ్వరి కోరారు. ఆ సంప్రదాయాన్ని 20 ఏళ్లుగా కొనసాగిస్తున్నాం.’’ అని చంద్రబాబు తెలిపారు. సభా వేదికపైకి రాకముందు ఆయన అక్కడ ప్రాంగణంలోని పుస్తకశాలను సందర్శించారు. తెలుగు మహాసభల నేపథ్యంలో తపాలా శాఖ రూపొందించిన కవర్‌ను ఆవిష్కరించి, గోవా గవర్నర్‌ అశోక్‌ గజపతిరాజుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌, స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు, మంత్రి నిమ్మల రామానాయుడు, తెలుగు సారస్వత పరిషత్‌ అధ్యక్షుడు గజల్‌ శ్రీనివాస్‌, కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా తదితరులు పాల్గొన్నారు.


మారిషస్‌ అధ్యక్షుడితో భేటీ..

సభానంతరం మారిషస్‌ దేశాధ్యక్షుడు ధరమ్‌ బీర్‌ గోకుల్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. పుష్పగుచ్ఛం, జ్ఞాపికలతో మారిషస్‌ అధ్యక్షుణ్ణి సీఎం సత్కరించారు. మారిష్‌సలో నివసిస్తున్న తెలుగువారి యోగక్షేమాల గురించి సీఎం అడిగి తెలుసుకున్నారు..

మాతృభాషతోనే మానవ విలువలు వస్తాయి: గోవా గవర్నర్‌ అశోక్‌ గజపతి

మాతృ భాషతోనే మానవ విలువలు వస్తాయని గోవా గవర్నర్‌ పూసపాటి అశోక్‌ గజపతిరాజు తెలిపారు. సోమవారం గుంటూరులో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆయన పాల్గొన్నారు. ‘‘భావితరాలకు విలువలను అందించడం పెద్ద సమస్యగా మారింది. చక్కని కార్యాచరణ ప్రణాళిక ద్వారా దీనిని అధిగమించవచ్చు. ఈ కృషిలో ప్రతి ఒక్కరూ కీలక పాత్ర పోషించాలి. అప్పుడే తెలుగు భాషకు న్యాయం చేయగలం.’’ అని తెలిపారు.

పిల్లలకు తెలుగు నేర్పేబాధ్యత తల్లిదండ్రులదే : స్పీకర్‌

పిల్లలకు తెలుగు నేర్పించే బాధ్యత తల్లిదండ్రులు తీసుకోవాలని స్పీకర్‌ అయ్యన్న పాత్రుడు కోరారు. ‘గ్రాండ్‌ ఫా అని పిలిస్తే.. మాట్లాడనని నా మనవడితో చెప్పాను. అప్పటి నుంచి తాతయ్య అని పిలుస్తున్నాడు. తెలుగువారిలో 60 శాతం మందే శ్రీరామనవమి చేసుకుంటున్నారని నా సొంత పరిశోధనలో తెలుసుకుని ఆందోళనకు గురయ్యాను’’ అని ఆయన తెలిపారు.


2027లో మారిషస్‌... 2029లో విశాఖలో తెలుగు మహాసభలు

ప్రపంచ 4వ తెలుగు మహాసభలు 2027 జనవరి 8, 9, 10 తేదీల్లో మారిషస్‌ దేశంలో జరగనున్నాయి. ఐదో ప్రపంచ తెలుగు మహాసభలు 2029లో విశాఖపట్నంలో నిర్వహించనున్నారు. ఆంధ్ర సారస్వత పరిషత్తు మూడో ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు సందర్భంగా ఈ మేరకు తదుపరి సభలు జరిగే వేదికలను నిర్వాహకులు ప్రకటించారు. ప్రపంచ తెలుగు మహాసభల కోసం గుంటూరు నగర మేయర్‌, శ్రీ సత్యసాయి విద్యా సంస్థల చైర్మన్‌ కోవెలమూడి రవీంద్ర(నాని) సహకరించారంటూ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

ఇళ్లలో మాతృ భాషలో మాట్లాడాలి

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

ఉచిత పథకాలతో ప్రభుత్వంతో పాటు ప్రజలకు కూడా తీవ్ర నష్టం వాటిల్లుతుందని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. గుంటూరులో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభలలో సోమవారం సాయంత్రం జరిగిన ‘మన తెలుగు భాష-అమృత భాష’ సెషన్‌లో మాట్లాడారు. ‘‘ఉచితాలకు ప్రజలను అలవాటు చేస్తే ఆ వ్యవస్థ ఎక్కువ కాలం మనుగడ సాధించలేదు. ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉన్నాయనే భ్రమలోనే ప్రజలు ఉంటున్నారు. ఉచిత బస్సు మహిళలు అడగలేదు. ఏ కారణంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారో పాలకులు సమాధానం చెప్పాలి. ప్రభుత్వం వద్ద నిధులు అధికంగా ఉంటే విద్య, వైద్యం ఉచితంగా అందించాలి.’’ అని వెంకయ్య సూచించారు. భాష బతకాలంటే ప్రతిఒక్కరూ ఇళ్లలో మాతృ భాషాలో మాట్లాడటం అవసరమన్నారు. మాతృ భూమిని, మాతృ దేశాన్ని, మాతృమూర్తిని మరిచిన వారు ఎన్నటికీ పరిపూర్ణ వ్యక్తులు కాబోరని తెలిపారు. గుడిలో, బడిలో, అమ్మ ఒడిలో మాతృభాషనే మాట్లాడాలన్నారు. ఇంగ్లీ్‌ష వస్తేనే రాణిస్తామనేది అపోహ మాత్రమేనన్నారు. అనంతరం మహాసభల ఏర్పాటులో కృషి చేసిన నిర్వాహకులను వెంకయ్య ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నాటక పరిషత్‌ అకాడమీ చైర్మన్‌ గుమ్మడి గోపాలకృష్ణ, నటుడు సాయికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 06 , 2026 | 04:09 AM