‘కరెన్సీ’పై అంబేడ్కర్ ఫొటోను ముద్రించాల్సిందే
ABN , Publish Date - Mar 13 , 2026 | 05:04 AM
కరెన్సీ నోట్లపై రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఫొటోను ముద్రించాలని తెలుగు ఎంపీలు డిమాండ్ చేశారు.
పార్లమెంటు వేదికగా కొట్లాడతాం
జంతర్‌మంతర్ వద్ద తెలుగు ఎంపీల మహాధర్నా
న్యూఢిల్లీ, మార్చి 12(ఆంధ్రజ్యోతి): కరెన్సీ నోట్లపై రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఫొటోను ముద్రించాలని తెలుగు ఎంపీలు డిమాండ్ చేశారు. ఈ అంశంపై పార్లమెంటు వేదికగా కేంద్రంపై ఒత్తిడి తెస్తామని స్పష్టం చేశారు. కరెన్సీపై అంబేడ్కర్ ఫొటో సాధన సమితి(సీఏపీఎ్‌సఎస్) అధ్యక్షుడు జెర్రిపోతుల పరశురామ్ అధ్యక్షతన గురువారం, ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద.. ‘ఢిల్లీపై దండోరా మహాధర్నా’ నిర్వహించారు. తెలుగు ఎంపీలు ఆర్.కృష్ణయ్య, బీద మస్తాన్‌రావు, వెంకట సత్యనారాయణ, ఈటల రాజేందర్, కలిశెట్టి అప్పలనాయుడు, మల్లు రవి, ఓబీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం అధ్యక్షుడు ఆళ్ల రామకృష్ణ, అఖిల భారత ఓబీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు గౌడ్ కిరణ్‌కుమార్, సీఏపీఎ్‌సఎస్ ఏపీ అధ్యక్షుడు కంఠ వేణు, తైకొండ శీను హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయా నేతలు మాట్లాడుతూ.. అంబేడ్కర్ లేకుంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదని, ఆయన ఫొటో ముద్రించకపోవడం అంటే చరిత్రను విస్మరించడమేనని అన్నారు. ఈ అంశాన్ని పార్లమెంటులో ప్రస్తావించి ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్తామని ఎంపీలు స్పష్టం చేశారు.