Cultural Festival: తెలుగు వెలుగుతోంది
ABN , Publish Date - Jan 11 , 2026 | 03:13 AM
గడిచిన వెయ్యి ఏళ్లలోనే తెలుగు సాహిత్యం ఆద్భుతంగా విరాజిల్లిందని పలువురు రచయితలు అభిప్రాయపడ్డారు.
గత వెయ్యేళ్ల్లలోనే తెలుగు సాహిత్యం అభివృద్ధి చెందింది
భాష రూపం, ఉచ్ఛరణ, అక్షర నిర్మాణం అన్నీ అద్భుతమే
ప్రపంచ వ్యాప్తంగా తెలుగు మాట్లాడేవారి సంఖ్య 12కోట్లు
ఆవకాయ్-అమరావతి చర్చా వేదికలో ప్రముఖ రచయితలు
విజయవాడ సిటీ, జనవరి 10(ఆంధ్రజ్యోతి): గడిచిన వెయ్యి ఏళ్లలోనే తెలుగు సాహిత్యం ఆద్భుతంగా విరాజిల్లిందని పలువురు రచయితలు అభిప్రాయపడ్డారు. నేటి సోషల్ మీడియా యుగంలోనూ భాష దినాదినాభివృద్ధి చెందుతోందని తెలిపారు. ‘ఆవకాయ్-అమరావతి’ కార్యక్రమంలో ‘సుందరమైన తెలుగు- తెలుగు సాహిత్యం, సినిమా వైభవం’ అంశంపై శనివారం విజయవాడలోని భవానీ ద్వీపంలో జరిగిన చర్చలో ప్రముఖ రచయితలు కస్తూరి మురళీకృష్ణ, మామిడి హరికృష్ణ, మౌనశ్రీ మల్లిక్, శ్రీపతి శర్మ వేదాంతం పాల్గొన్నారు. స్పష్టత, వైవిద్యంతో కూడిన విశిష్టతను సొంతం చేసుకుని, రూపం, ఉచ్ఛరణ, అక్షర నిర్మాణం, భావార్థం, పదార్థం (పదం, అర్థం సమానంగా వ్యక్తీకరించడం) మేళవింపులతో సుందరీకరణ చెంది, పదాల పోహలింపు, అమరికతో తెలుగు రోజురోజుకు ఎంతో అందంగా తయారవుతోందని స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు మాట్లాడే వారి సంఖ్య 12 కోట్లకు చేరిందని వెల్లడించారు. భావాలకు పుట్టినిల్లుగా తెలుగును కీర్తించారు. ఎలా చదువుతున్నామో, ఎలా మాట్లాడుతున్నామో అనే విషయాలకు దూరమవుతున్న పరిస్థితుల్లోనూ తెలుగు వెలుగులు విరజిమ్ముతుండటం సంతోషించదగిన విషయమన్నారు. పదేళ్లకు ఒకసారి తరం మారుతుంటుందని, ప్రతి తరంలోనూ భాష ఉచ్ఛరణలో మార్పులు సంభవిస్తుంటాయని, ఈ తరుణంలోనే భాష దిగజారి పోతుందనే భావన పాత తరం వారిలో కలుగుతుండటం సర్వసాధారణమని వివరించారు. తరాలకు తగినట్లుగా పదాలు మారుతుంటాయని, కొన్ని అక్షరాలు, పదాలు మాయమై, కొత్తవి పుట్టుకువస్తాయని, దీన్ని రచయితలు ఆహ్వానించాలని హితవు పలికారు. మాండలికాలను గౌరవించుకుంటూ, నైతిక విలువలను అర్థం చేసుకుంటూ.. కొత్త తరం పుట్టించిన పదాలకు పాత తరం పదాలను జోడించి రచనలను కొనసాగిస్తూ భాషను ముందుకు నడిపించాలని సూచించారు.
పున్నమి ఘాట్‌లో..:
ఆవకాయ్-అమరావతి ఉత్సవాల్లో భాగంగా పున్నమి ఘాట్‌లో తెలుగు భాష యాసలు అన్నింటినీ కూర్చి చౌరస్తా బృందం చేసిన గానం ఆకట్టుకుంది. ఎన్.టి.రామారావు జీవిత ప్రస్థానంపై ఏవీ ప్రదర్శించారు. ఎన్టీఆర్ జీవిత వైభవాన్ని నేటి తరానికి వేదికలపై ఉన్న ప్రముఖులు గుర్తు చేశారు. 300కు పైగా సినిమాల్లో నటించి, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందమే కాకుండా తెలుగువారి ఆత్మగౌరవానికి చిరునామాగా మారారని కీర్తించారు. అనంతరం ప్రేమ కథా చిత్రమ్ అనే సంగీత నాటికను ప్రదర్శించారు. చివరిగా జావెద్ ఆలీ సంగీత కచేరీతో కార్యక్రమం ముగిసింది.
తెలుగు అనువాదాలకు ప్రాధాన్యం పెరగాలి
‘అనువాద కళ’ చర్చలో రచయితలు కె.శ్రీనివాసరావు, జయప్రద, విజయ్‌కుమార్, మరియా పూరి(పోలాండ్) మాట్లాడుతూ అనువాద రచనలకు ప్రాధాన్యం పెరగాలని అభిప్రాయపడ్డారు. బెంగాలీ నవలలే అధికంగా అనువాదం అవుతున్నాయని, ఆ ధోరణి తెలుగు నవలలకూ రావాలని ఆకాంక్షించారు. మన రచనలు ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లోకి వెళ్లాలని, ఇతర భాషల నుంచి తెలుగుకు అనువాదమైన రచనలకు ఆదరణ పెరగాలని, అందుకు పబ్లిషర్లు ముందుకు రావాలని కోరారు. ‘నీటిపై రాతలు-తెలుగులో కథ చెప్పే కళ’ అంశంపై రచయితలు బ్నిం, సున్నపురెడ్డి వెంకట్రామిరెడ్డి మధ్య, ‘శుక్రవారం విడుదల-సినిమా, పాత్రికేయ వృత్తి’ అనే అంశంపై రచయితలు చల్లా భాగ్యలక్ష్మి, వర ముళ్లపూడి, వడ్డి ఓంప్రకాశ్ నారాయణ మధ్య సంభాషణలు సాగాయి. స్టోరీ అవర్ యుకే బృందం ప్రదర్శించిన సార్వత్రిక కథలు ఆకట్టుకున్నాయి.
డిసెంబరులో మళ్లీ ఆవకాయ్ ఉత్సవాలు
నంది నాటకోత్సవాలను పునరుద్ధరిస్తాం: మంత్రి దుర్గేశ్
‘ఆవకాయ్- అమరావతి’ ఉత్సవాలను ఒక బ్రాండ్‌గా తీర్చిదిద్దుతామని పర్యాటక మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. ఈనెల 8 నుంచి 10 వరకు ఉత్సవాలను వైభవంగా నిర్వహించామని, తిరిగి డిసెంబరు 17, 18, 19 తేదీల్లో అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించారు. ముగి ంపు సభకు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమాలకు 45 వేల మంది వచ్చినట్లు తెలిపారు. నంది నాటకోత్సవాలను తిరిగి నిర్వహించి, ప్రతిభావంతులకు నంది అవార్డులు అందజేస్తామని ప్రకటించారు. కళాకారులకు కందుకూరి, ఉగాది పురస్కారాలను అందజేస్తామని తెలిపారు. ఉత్సవాలను విజయవంతం చేసిన అధికారులు, టీం వర్క్స్ ఆర్ట్స్ ప్రతినిధులను ఆయన అభినందించారు. ఎమ్మెల్యేలు బొండా ఉమామహేశ్వరరావు, వసంత కృష్ణప్రసాద్, షాజహాన్ బాషా పాల్గొన్నారు.