Share News

భయం భయం!

ABN , Publish Date - Mar 03 , 2026 | 03:20 AM

పిడుగుల్లా విరుచుకుపడుతున్న క్షిపణుల మోత.. ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియని భయానక పరిస్థితి! విమానాల రద్దుతో గల్ఫ్‌ దేశాల్లో చిక్కుకుపోయిన ఎంతోమంది తెలుగువారు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని గడుపుతున్నారు.

భయం భయం!

  • విమానాల రద్దుతో గల్ఫ్‌ దేశాల్లో అగచాట్లు.. అబుధాబీలో చిక్కుకుపోయిన గుంటూరువాసులు

  • తల్లితో పాటు 9 నెలల పసికందు కూడా.. అక్కడ దాదాపు వంద మంది తెలుగువారు

  • భోజనం, వసతికి లోటు లేకుండా చూస్తున్న అధికారులు.. పరిస్థితులు సద్దుమణిగాక వెనక్కి

  • ఖతార్‌లో ఆగిపోయిన శ్రీకాకుళంవాసి.. కువైట్‌లో పాలకొల్లు యువకుడు గుండెపోటుతో మృతి

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

పిడుగుల్లా విరుచుకుపడుతున్న క్షిపణుల మోత.. ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియని భయానక పరిస్థితి! విమానాల రద్దుతో గల్ఫ్‌ దేశాల్లో చిక్కుకుపోయిన ఎంతోమంది తెలుగువారు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని గడుపుతున్నారు. ఇరాన్‌, అమెరికా-ఇజ్రాయెల్‌ యుద్ధం కారణంగా విమానాలు రద్దుకావడంతో తెలుగు రాష్ట్రాలకు చెందినవారు అబుధాబీ విమానాశ్రయంలో చిక్కుకుపోయారు. వందమందికిపైగా అక్కడే ఆగిపోయినట్టు సమాచారం. అమెరికా నుంచి వస్తున్న గుంటూరు జిల్లాకు చెందిన ఓ తల్లి తన 9 నెలల బిడ్డతో అబుధాబీ విమానాశ్రయంలో చిక్కుకుపోయారు. గుంటూరు జిల్లా వట్టి చెరుకూరు మండలం అనంతవరప్పాడుకు చెందిన సంగా లక్ష్మి, కోడలు నాగశ్రీ శశి, పసికందు అర్జున్‌ 48 గంటలుగా అబుధాబీలోనే ఉండిపోవాల్సి వచ్చింది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 2 గంటలకు అమెరికా నుంచి బయలుదేరి శనివారం మధ్యాహ్నం అబుదాబీ విమానాశ్రయానికి చేరుకున్నారు. అప్పటికే యుద్ధం ప్రారంభం కావడంతో విమానాలన్నీ రద్దయ్యాయి.


దిక్కుతోచని స్థితిలో వారు అక్కడే ఆగిపోవాల్సి వచ్చింది. శనివారం అర్ధరాత్రి 12 గంటల వరకూ వారు అబుదాబీ విమానాశ్రయంలోనే గడిపారు. ఆ తరువాత వారిని సమీపంలోని ఓ ఫైవ్‌స్టార్‌ హోటల్‌కు తరలించారు. వారు స్వస్థలానికి చేరేందుకు మరో రెండు రోజులు పట్టవచ్చని ఎయిర్‌లైన్స్‌ అథారిటీ అధికారుల చెబుతున్నారు. వారితోపాటు హైదరాబాద్‌కు చెందిన మరో తెలుగు కుటుంబం కూడా హోటల్‌లో అదే రూమ్‌లో వారికి తోడుగా ఉన్నారు. అబుదాబీలో కుటుంబ సభ్యులు చిక్కుకుపోయిన విషయం తెలియని నాగశ్రీ శశి తండ్రి కోటేశ్వరావు తన కుమార్తె, మనుమడు, వియ్యపురాలిని తీసుకురావడానికి శంషాబాద్‌ విమానాశ్రయానికి వెళ్లారు. వారు అబుదాబీలో చిక్కుకుపోయిన విషయం తెలియడంతో ఆందోళనకు గురయ్యారు. మరోవైపు అమెరికాలో విమానం ఎక్కించిన ఆ పసికందు తండ్రి.. తన కుమారుడు, భార్య, తల్లి మార్గమధ్యంలో చిక్కుకుపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు. ఇలా అబుదాబీలో చిక్కుకుపోయిన ఎన్నో కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. అయితే విమానాశ్రయంలో ఆగిపోయినవారికి విమానయాన సంస్థ అధికారులు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారని ప్రయాణికులు తమ కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో వారు కొంత ఊపిరి పీల్చుకున్నారు. పరిస్థితులు సద్దుమణిగాక స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు చేస్తామని ప్రయాణికులకు అధికారులు భరోసా కల్పించడంతో కొంతవరకు ఆందోళన తగ్గింది.


విషయం తెలుసుకున్న కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్‌నాయుడుతో సంప్రదించి వారు స్వస్థలానికి వీలైనంత త్వరగా చేరేలా ఏర్పాట్లు చేయాలని కోరారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఖతార్‌ రాజధాని దోహాలో చిక్కుకుపోయారు. శ్రీకాకుళం మండలం సింగుపురం గ్రామానికి చెందిన పీవీ వెంకటగౌతమ్‌ బెంగళూరులోని ఓ సాఫ్ట్‌వేర్‌ కెంపెనీలో పనిచేస్తున్నారు. కంపెనీ పనిపై వారం రోజుల కిందట దోహా వెళ్లారు. కాగా యుద్ధ వాతావరణానికి భయపడి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణం డామ్‌ పేటకు చెందిన కందికట్ల రాకేశ్‌(26) కువైట్‌లో గుండెపోటుతో చనిపోయారు. రాకేశ్‌ తల్లి రమణ కువైట్‌లోనే పనిచేస్తున్నారు. తండ్రి శ్రీనివాస్‌, సోదరుడు పాలకొల్లులో కూలి పనులు చేసుకుని జీవిస్తున్నారు. ఎనిమిది నెలల క్రితం రాకేశ్‌ ఉపాధి కోసం కువైట్‌ వెళ్లారు.

Updated Date - Mar 03 , 2026 | 03:23 AM