108 ఓ మినీ ఆస్పత్రి!
ABN , Publish Date - Mar 04 , 2026 | 03:10 AM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 108 అంబులెన్సులు ఎమర్జెన్సీ రోగుల పాలిట సంజీవనిగా నిలుస్తున్నాయి. ఈ ప్రభుత్వంలో దాదాపు 10 లక్షల మందికిపైగా బాధితులు 108 అంబులెన్సు సేవలు పొందితే...
రూపురేఖలు మార్చేసిన కూటమి ప్రభుత్వం
అంబులెన్సుల్లో కొత్తగా టెలీమెడిసిన్ విధానం
మార్గం మధ్యలోనే బాధితులకు ప్రాథమిక చికిత్స
2.5 లక్షల మందికి ఆస్పత్రికి చేరకుండానే నయం
టెక్నాలజీ ద్వారా 20 శాతం మరణాల నివారణ
బాధితులకు పకడ్బందీగా ‘గోల్డెన్ అవర్’ అమలు
ఎమర్జెన్సీ రోగుల పాలిట సంజీవనిగా అంబులెన్సులు
ఫోన్ చేస్తే ఎప్పుడొస్తుందో తెలీదు.. వచ్చినా ఎంత సేపటికి ఆస్పత్రికి చేరుస్తుందో తెలీదు.. ఆస్పత్రికి వెళ్లినా బాధితుల ప్రాణాలు నిలుస్తాయన్న గ్యారెంటీ లేదు..! ఇలాంటి దారుణ పరిస్థితుల నుంచి కూటమి ప్రభుత్వం 108 అంబులెన్సుల రూపురేఖలనే మార్చేసింది..! అంబులెన్సులకు టెక్నాలజీని జోడించి బాధితులను ‘‘గోల్డెన్ అవర్’’లోనే ఆస్పత్రులకు చేరుస్తోంది. అంబులెన్సుల్లోనే టెలీమెడిసిన్ విధానాన్ని ప్రవేశపెట్టి దారిలోనే బాధితులకు ప్రాథమిక చికిత్స అందిస్తూ.. వారి ప్రాణాలకు భరోసానిస్తోంది.
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 108 అంబులెన్సులు ఎమర్జెన్సీ రోగుల పాలిట సంజీవనిగా నిలుస్తున్నాయి. ఈ ప్రభుత్వంలో దాదాపు 10 లక్షల మందికిపైగా బాధితులు 108 అంబులెన్సు సేవలు పొందితే... అందులో 7.50 లక్షల మంది మాత్రమే ఈ వాహనాల ద్వారా ఆస్పత్రుల్లో చేరి చికిత్స తీసుకున్నారు. మిగిలిన 2.50 లక్షల మందికి టెలీమెడిసిన్ ద్వారా అక్కడికక్కడే వైద్యం అందించి ఇంటికి పంపించేసిన ఈ అంబులెన్సులు ‘‘మినీ ఆస్పత్రి’’ పాత్ర పోషిస్తున్నాయి. రాష్ట్రం మొత్తం 1.75 లక్షల కిలోమీటర్ల మేర రోడ్డు కనెక్టివిటీ ఉంటే.. కూటమి ప్రభుత్వంలో అంబులెన్సులు 1.15లక్షల కి.మీ. అంటే దాదాపు 60 శాతం కనెక్టివిటీని కవర్ చేశాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అరబిందో నిర్వహణలో ఉన్న 108 అంబులెన్సులు 40శాతం రోడ్డు కనెక్టివిటీని మాత్రమే కవర్ చేశాయి. మొత్తంగా గత ప్రభుత్వంలో అస్తవ్యస్తంగా ఉన్న 108 అంబులెన్సుల నిర్వహణను కూటమి ప్రభుత్వం మెరుగుపరిచి ప్రజలకు సమయానికి నాణ్యమైన సేవలందేలా చూస్తోంది. టెక్నాలజీ సాయంతో ప్రతి పల్లెకూ సేవలు విస్తరిస్తూ ప్రజారోగ్య పరిక్షణకు పెద్దపీట వేస్తోంది.
అంబులెన్సుల్లో టెలీమెడిసిన్...
కూటమి ప్రభుత్వం 108 అంబులెన్సుల్లో ప్రత్యేకంగా టెలీమెడిసిన్ సేవలు అందుబాటులోకి తెచ్చింది. ఈఆర్సీ (ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్) నుంచి ఈ సేవలందిస్తోంది. అంబులెన్సుల్లో ప్రత్యేకంగా ఎండీటీ (మొబైల్ డేటా టెర్మినల్), సీసీ కెమెరాలతో పాటు స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉంచారు. దీంతో పాటు ఈఆర్సీలో ప్రత్యేకంగా 18 మంది వైద్యులను నియమించారు. అంబులెన్సులు ప్రమాదస్థలం లేదా బాధితులున్న ప్రదేశానికి వెళ్లిన వెంటనే ఈఆర్సీలో ఉన్న వైద్యులు అంబులెన్సుల్లో ఉన్న ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ (ఈఎంటీ)తో మాట్లాడి బాధితుల ఆరోగ్య పరిస్థితి, వారి పల్స్, ఆక్సిజన్ లెవల్స్, బీపీ ఎలా ఉన్నాయో తెలుసుకుంటారు. బాధితుడి పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటే వీడియో కాల్ ద్వారా లైవ్‌లోకి వచ్చి బాధితులకు ఎలాంటి వైద్యం అందించాలి, ఏఏ ముందులు ఇవ్వాలో సూచిస్తారు. వారి సూచన మేరకు ఈఎంటీ బాధితులకు ప్రాథమిక చికిత్స అందిస్తారు. అలాగే గుండెపోటు, రోడ్డు ప్రమాద బాధితులకు కూడా రన్నింగ్‌లో ఉండగానే టెలీమెడిసిన్ ద్వారా ప్రాథమిక చికిత్స అందిస్తారు. ఈ విధానం ద్వారా దాదాపు 20 శాతం మంది ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. కూటమి ప్రభుత్వంలో 108 అంబులెన్సుల్లో ఎండీటీ (మొబైల్ డేటా టెర్మినల్) పరికరాన్ని అమర్చారు. ఈ పరికరం ఇటు ఈఆర్సీ సిబ్బందితో పాటు 108 అంబులెన్సు డ్రైవర్, ఈఎంటీని అలెర్ట్ చేస్తుంది. ఏదైనా ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు.. అక్కడ నుంచి ఎవరైనా 108కు ఫోన్ చేసినప్పుడు ఈఆర్సీకీ సిబ్బంది కాల్ రీసీవ్ చేసుకున్న వెంటనే లోకేషన్ రిజిస్టర్ అవుతుంది. తర్వాత ఆరీస్సీ సిబ్బంది బాధితుల వివరాలను నమోదు చేసుకున్న క్షణాల్లో లోకేషన్‌తో సహా ఈ డేటా మొత్తం ఎండీటీ ద్వారా 108 అంబులెన్స్‌కు చేరుతుంది. అంబులెన్సులోని సిబ్బంది వాహనానికి దూరంగా ఉన్నా, నిర్లక్ష్యంగా ఉన్నా, నిద్రావస్థలో ఉన్నా.... ఈఆర్సీ పెద్దగా సైరన్ చేసి పైలట్ (డ్రైవర్), ఈఎంటీని అలర్ట్ చేస్తుంది. ఎండీటీ డేటా ఆధారంగా వారు లోకేషన్‌కు చేరుకుంటారు. బాధితులను ఎక్కించుకుని బయల్దేరాక మార్గ మధ్యలోనే ప్రాథమిక చికిత్స అందిస్తారు.
మూడేళ్లకే మూలకు చేర్చారు..
అరబిందో సంస్థ 2020 జూన్‌లో 108 వాహనాల నిర్వహణ బాధ్యతలు స్వీకరించింది. ఈ సంస్థ కోసం గత వైసీపీ ప్రభుత్వం భారీగా నిధులు ఖర్చు చేసింది. సాధారణంగా 108 అంబులెన్సులు నిర్వహించే సంస్థ కొత్త వాహనాలు కొనుగోలు చేసుకోవాలి. కానీ వైసీపీ ప్రభుత్వం రూ.104 కోట్లు ఖర్చు పెట్టి మూడేళ్లలో 581 కొత్త వాహనాలను అరబిందోకు అందించింది. ఒకవైపు ఆ సంస్థ కొత్త వాహనాలను కొనుగోలు చేయకపోగా ప్రభుత్వం ఇచ్చిన వాహనాలను మూడేళ్లల్లో తుక్కు తుక్కు చేసింది. కనీసం ఇంజన్ ఆయిల్ కూడా మార్చకుండా వాడడంతో మూడేళ్లకే మూలనపడ్డాయి. కూటమి ప్రభుత్వం అరబిందో నుంచి కొత్త నిర్వహణ సంస్థ 768 వాహనాలను తీసుకుంది. అందులో 300 వాహనాలు పనికి రాకుండాపోయాయి. వైసీపీ ప్రభుత్వం అందించిన కొత్త వాహనాలను కూడా షెడ్‌కు చేర్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో వాటి రిపేర్లకే కూటమి ప్రభుత్వం దాదాపు రూ.15 కోట్ల వరకూ ఖర్చు చేయాల్సి వచ్చింది. 227 అంబులెన్సులను పూర్తిగా తొలగించాల్సి వచ్చింది. వీటి విలువ రూ.20 కోట్ల వరకూ ఉంటుంది.
గోల్డెన్ అవర్ చాలా కీలకం
గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వంటి అత్యవసర వైద్య పరిస్థితి ఎదురైనప్పుడు మొదటి 60 నిమిషాలు ఎంతో కీలకం. ఆలోగా ఆస్పత్రికి చేర్చితే రోగి బతికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే దీన్ని గోల్డెన్ అవర్ అంటారు. అందుకే కూటమి ప్రభుత్వం 108 అంబులెన్సు సేవల్లో ఈ గోల్డెన్ అవర్ విధానాన్ని పక్కాగా అమలు చేస్తూ సత్ఫలితాలు సాధిస్తోంది. నిబంధనల ప్రకారం పట్టణ ప్రాంతాల్లో ఫోన్ కాల్ వచ్చిన 18 నిమిషాల్లోనే అంబులెన్సు రోగి వద్దకు చేరాల్సి ఉండగా... ప్రస్తుతం సగటున 37 సెకన్ల ఆలస్యంతోనే చేరుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో 23 నిమిషాల్లో చేరాల్సి ఉండగా.. సగటున 23.13 నిమిషాలకు, గిరిజన ప్రాంతాల్లో 33 నిమిషాల్లో చేరాల్సి ఉండగా సగటున 31.30 నిమిషాల్లోనే చేరుతున్నాయి. గత ప్రభుత్వంలో పట్టణ ప్రాంతాల్లో సగటున 12.45 నిమిషాలు, గ్రామీణ ప్రాంతాల్లో 12.39 నిమిుషాలు గిరిజన ప్రాంతాల్లో 9.30 నిమిషాలు ఆలస్యంగా చేరేవి. ఈ ఆలస్యం కారణంగా బాధితులకు జరగాల్సిన నష్టం జరిగిపోయేది. కూటమి ప్రభుత్వం రూపొందించిన నిబంధనల మేరకు ప్రస్తుతం 108 అంబులెన్సుల ద్వారా 95.58 శాతం రోగులు సగటున 1.05 గంటల్లోనే ఆస్పత్రులకు చేరుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 731 అంబులెన్సులను భవ్య హెల్త్ సంస్థ విజయవంతంగా నిర్వహిస్తోంది. ఇవి కాకుండా అదనంగా 37 బ్యాకప్ వాహనాలను సిద్ధంగా ఉంచుతోంది. గతంలో అరబిందో సంస్థ పేరుకు 768 వాహనాలను నిర్వహించేది. కానీ రోడ్డు మీద 300 వాహనాలు మాత్రమే కనిపించేవి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాహనాలకు ప్రత్యేక ట్రాకింగ్ విధానం పెట్టి, ఏ వాహనం ఎక్కడుంది..? సిబ్బంది అలెర్టుగా ఉన్నారా.. లేదా.. అన్న విషయాన్ని కూడా ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు.
అరబిందోపై కాగ్ కన్నెర్ర...
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 108 అంబులెన్సుల పనితీరుపై కాగ్ తీవ్ర ఆరోపణలు చేసింది. అంబులెన్స్ కోసం ఫోన్ కాల్ వచ్చినప్పటి నుంచి నిర్దేశించిన సమయంలోగా అవి రోగులకు చేరలేదని, ఈ అంబులెన్సుల్లో వివిధ పరికరాలు ప్రమాణాల మేరకు పనిచేయలేదని, సిబ్బంది కొరత ఉందని, ఏసీలు పని చేయలేదని, క్రిటికల్ కేసులకు అడ్వాన్స్‌డ్ లైఫ్ సిస్టమ్‌తో కూడిన అంబులెన్సులు కాకుండా.. కనీస సౌకర్యాలున్న వాహనాలను కేటాయించారని గతేడాది జూన్‌లో విడుదల చేసిన నివేదికలో కాగ్ పేర్కొంది. ప్రతి రోజూ సగటున 200 ఎమర్జెన్సీ ఫోన్ కాల్స్‌కు అరబిందో సంస్థ స్పందించేది కాదని స్పష్టం చేసింది. అరబిందో సంస్థ వాహనాలకు సరైన సమయంలో నిర్వహణ చేపట్టకపోవడం వలన 42 వాహనాలు రిపేరుకు కూడా పనికిరాకుండా పోయాయని, 615 అంబులెన్సులకు మేజర్, 103 వాహనాలకు మైనర్ రిపేర్లు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపింది. కాగా, 2025 జూన్‌లో మొత్తం 768 వాహనాల్లో 67 శాతం మాత్రమే వర్కింగ్ కండిషన్‌లో ఉన్నాయి. అయితే కూటమి ప్రభుత్వం పనిచేసే అంబులెన్స్‌ల సంఖ్యను క్రమేణా పెంచుతూ గతేడాది నవంబరు నాటికి 731 అంబులెన్సులను భవ్య సంస్థ ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చింది.