మాటే మంత్రము...మానసిక కుంగుబాటుకు టెలీ మానస్ మందు
ABN , Publish Date - May 07 , 2026 | 04:26 AM
మానసిక ఒత్తిడి, కుంగుబాటు, ఆందోళనతో ఉన్న వారు టెలీ మానస్ కేంద్రాల ద్వారా స్వాంతన పొందుతున్నారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల ఈ కేంద్రాల ద్వారా...
మూడున్నరేళ్లలో 67 వేల ఫోన్ కాల్స్
పరీక్షల వేళ తీవ్ర ఒత్తిళ్లలో విద్యార్థులు
ఆత్మహత్యల నివారణకు దోహదం చేస్తున్న కేంద్రాలు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
మానసిక ఒత్తిడి, కుంగుబాటు, ఆందోళనతో ఉన్న వారు టెలీ మానస్ కేంద్రాల ద్వారా స్వాంతన పొందుతున్నారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల ఈ కేంద్రాల ద్వారా నెలకు సుమారు 3000 మంది సలహాలు, సూచనలు పొందుతున్నారు. మానసిక కుంగుబాటు, తీవ్ర భావోద్వేగాల నుంచి బయటపడడానికి... ముఖ్యంగా ఆత్మహత్యా ప్రయత్నాలను విరమించుకోవడానికీ ఈ కేంద్రాలు దోహదపడుతున్నాయి. 14416 ఉచిత హెల్ప్ లైన్ ద్వారా 365 రోజులు, 24 గంటలూ సలహాలు, సూచనలు ఇచ్చేందుకు కౌన్సెలర్ల అందుబాటులో ఉంటున్నారు. ముఖ్యంగా పరీక్షల సమయంలో విద్యార్థుల నుంచి వచ్చే కాల్స్‌పై కౌన్సెలర్లు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఆందోళనతో ఫోను చేసే వారికి ధైర్యం చెబుతూ మార్పు తెస్తున్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా నడుస్తున్న ఈ టెలీ మానస్ కేంద్రాలకు ఇప్పటి వరకూ 67,573 కాల్స్ వచ్చాయి. అక్టోబరు 2022 నుంచి జూన్ 2024 మధ్య 31 వేల కాల్స్ వస్తే... జూలై 2024 నుంచి 2026 ఏప్రిల్ వరకూ 36 వేల కాల్స్ వచ్చాయి. హెల్ప్ లైన్‌కు అత్యధికంగా విశాఖ, కర్నూలు, గుంటూరు, నంద్యాల, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల నుంచి కాల్స్ వచ్చాయి. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, బాపట్ల, పల్నాడు జిల్లాల నుంచి కాల్స్ తక్కువగా వస్తున్నాయి. విజయవాడలోని బోధనాసుపత్రిలో, విశాఖలోని మానసిక చికిత్సాలయంలో ఉన్న టెలీ మానస్ కేంద్రాల పనితీరు, ఇతర అంశాలపై కొద్ది రోజుల క్రితం మంత్రి సత్యకుమార్ సమీక్షించారు. ఈ సందర్భంగా వాటి పనితీరుపై హర్షం వ్యక్తం చేశారు. ‘365 రోజులు, 24 గంటలూ అందుబాటులో ఉండే సిబ్బంది ద్వారా వేలాది మంది విలువైన సలహాలు, సూచనలు పొందారు. ఫోన్ చేసిన వారిలో అవసరమైన వారికి వైద్యులను సంప్రదించాలని కూడా సూచిసున్నారు’ అని మంత్రి తెలిపారు.