Nallamalla Sagar Project: న్యాయం మనవైపే!
ABN , Publish Date - Jan 12 , 2026 | 05:29 AM
పోలవరం-నల్లమలసాగర్ అనుసంధాన పథకం సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)ను కేంద్ర జలశక్తి శాఖకు సమర్పించాక.. అది అనుమతులు ఇచ్చాకే ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తామని...
అనుమతులొచ్చాకే నల్లమలసాగర్ పనులు: నిమ్మల
కడలిపాలయ్యే నీటిని వాడుకుంటే తప్పేంటి?
3 వేల టీఎంసీల్లో 200 టీఎంసీలే వాడుకునేలా అనుసంధాన ప్రాజెక్టుకు రూపకల్పన
వాటిని కరువుసీమకు తరలించాలన్నదే లక్ష్యం
సుప్రీంకోర్టుకు ఇదే విన్నవించండి
సీనియర్ న్యాయవాదులకు మంత్రి సూచన
తెలంగాణ పిటిషన్‌పై నేడు సుప్రీంలో విచారణ
అమరావతి, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): పోలవరం-నల్లమలసాగర్ అనుసంధాన పథకం సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)ను కేంద్ర జలశక్తి శాఖకు సమర్పించాక.. అది అనుమతులు ఇచ్చాకే ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తామని జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టంచేశారు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టుకు నివేదించాలని సీనియర్ న్యాయవాదుల బృందానికి సూచించారు. ఈ పథకంపై తెలంగాణ వేసిన పిటిషన్ సోమవారం సుప్రీంకోర్టు ముందుకు రానున్న నేపథ్యంలో ఆదివారం ఆయన విజయవాడలోని క్యాంపు కార్యాలయం నుంచి.. న్యాయకోవిదులు ముకుల్ రోహత్గీ, జైదీప్ గుప్తా, బల్బీర్‌సింగ్‌లతో వీడియో కాన్ఫరెన్స్‌లో చర్చించారు. న్యాయం మనపక్షానే ఉందన్నారు. ఇప్పటివరకూ రాష్ట్రం తరఫున బలమైన వాదనలు వినిపించారని వారిని ప్రశంసించారు. ఇకముందు కూడా పటిష్ఠ వాదనలు కొనసాగించాలని కోరారు. ‘గోదావరి పరీవాహక ప్రాంతంలో దిగువన ఉన్న రాష్ట్రంగా.. వరద జలాలు వృధాగా సముద్రంలో కలుస్తుంటే, వాటిని సద్వినియోగం చేసుకునేలా వాడుకుంటే తప్పేమిటి? ఏటా 3,000 టీఎంసీలు వృధాగా కడలిపాలవుతున్నాయి. వాటిలో కేవలం 200 టీఎంసీలను మాత్రమే వాడుకుంటే తప్పేంటి? నదీజలాల విషయంలో తోటి తెలుగు రాష్ట్రం తెలంగాణకు స్నేహ హస్తం అందించేందుకు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాం. ఇదే సమయంలో మన రాష్ట్ర హక్కుల సాధనలో రాజీపడం. ఏపీకి అన్యాయం చేస్తూ తెలంగాణ సుప్రీంకోర్టులో కేసు వేసింది. గోదావరి ట్రైబ్యునల్ ప్రకారం.. మిగులు జలాలను సంపూర్ణంగా వినియోగించుకునే స్వేచ్ఛ ఆంధ్రప్రదేశ్‌కు ఉంది. అయినప్పటికీ 200 టీఎంసీలను మాత్రమే ఉపయోగించుకునేలా నల్లమలసాగర్ పథకానికి రూపకల్పన చేశాం. వాటిని కరువుపీడిత రాయలసీమకు తరలించి సాగు, తాగు నీరందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటికే కేంద్రానికి పోలవరం-బనకచర్ల (నల్లమలసాగర్ ఆలోచనకు ముందు) స్కీం ముందస్తు సాధ్యాసాధ్యాల నివేదికను కేంద్రానికి సమర్పించాం. నల్లమలసాగర్ పథకం డీపీఆర్‌ను జలశక్తి శాఖకు సమర్పించి.. అన్ని అనుమతులూ వచ్చాకే ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తామని సుప్రీంకోర్టుకు విన్నవించండి’ అని అభ్యర్థించారు. రాష్ట్రప్రభుత్వం తరఫున బలమైన సాక్ష్యాలు, ఆధారాలను న్యాయవాదుల బృందానికి అందించాలని ఈ సందర్భంగా జలవనరుల శాఖ అధికారులకు మంత్రి సూచించారు.
నేడు సుప్రీంలో విచారణ: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదంగా మారిన పోలవరం-నల్లమల్ల సాగర్ అనుసంధాన ప్రాజెక్టు అంశంపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరపనుంది. తెలంగాణ దాఖలుచేసిన పిటిషన్‌పై గత సోమవారం విచారణ జరిపిన ధర్మాసనం.. దాని విచారణార్హతపై సందేహం వ్యక్తంచేసింది. రాజ్యాంగంలోని 32వ అధికరణ కింద రిట్ పిటిషన్‌గా కాకుండా, ఆర్టికల్ 131 ప్రకారం ‘సివిల్ సూట్’ దాఖలు చేసుకోవాలని పేర్కొంది. ఇదే సందర్భంగా సమస్య పరిష్కారానికి కొన్ని ప్రత్యామ్నాయాలను ప్రతిపాదించింది.