Share News

Krishna District: బరుల వద్దకు తరలొచ్చిన ‘తెలంగాణ’

ABN , Publish Date - Jan 15 , 2026 | 04:26 AM

ఏలూరు జిల్లా నూజివీడు రూరల్‌ మండలం మీర్జాపురంలో పదెకరాల బరిలో ఏర్పాటు చేసిన కోడి పందేలను తిలకించడానికి తెలంగాణ నుంచి పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు....

Krishna District: బరుల వద్దకు తరలొచ్చిన ‘తెలంగాణ’

ఇంటర్నెట్ డెస్క్: ఏలూరు జిల్లా నూజివీడు రూరల్‌ మండలం మీర్జాపురంలో పదెకరాల బరిలో ఏర్పాటు చేసిన కోడి పందేలను తిలకించడానికి తెలంగాణ నుంచి పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు కార్లలో తరలివచ్చారు. వీరిలో తెలంగాణ ఇరిగేషన్‌ బోర్డు చైర్మన్‌ మువ్య విజయ్‌బాబు, ఎమ్మెల్యేలు కోరం కనకయ్య(ఇల్లెందు), జారే ఆదినారాయణ(అశ్వారావుపేట ) తదితరులు ఉన్నారు. తొలిరోజు కోడి పందేలను తిలకించేందుకు 35 ఎంఎం ఎల్‌ఈడీ స్ర్కీన్లు రెండు ఏర్పాటు చేశారు. బౌన్సర్లను నియమించారు. ఆరు టెంట్లు వేసి పేకాట శిబిరాలు నిర్వహించారు. నూజివీడులో నిర్వహించిన కోడి పందేల్లో సుమారు రూ.7 కోట్లు చేతులు మారినట్టు అంచనా. అలాగే, ఇక్కడ పేకాటల రూపంలో రూ.3 కోట్లకు పైనే చేతులు మారాయి. బారికేడ్లు, వీఐపీ గ్యాలరీలు, ఫ్లడ్‌లైట్లు, మైక్‌ అనౌన్స్‌మెంట్లు, స్టేజీలు తదితర సౌకర్యాలను కల్పించారు.

‘కృష్ణా’లో పండగ కేక..

సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో తొలిరోజున రూ.150 కోట్ల వరకు బెట్టింగ్‌లు జరిగినట్టు అంచనా. బుధవారం ఉదయం 7గంటల నుంచే పందేలు ప్రారంభమయ్యాయి. జగ్గయ్యపేట నుంచి మచిలీపట్నం వరకు బరులన్నీ జనంతో నిండిపోయాయి. కోడి పందేల శిబిరాల్లోనే పేకాట, గుండాట నిర్వహించారు. జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు నియోజకవర్గాల్లో బరుల వద్ద తెలంగాణ వాసులు ఎక్కువగా కనిపించారు. విజయవాడ రూరల్‌ మండలం నుంచి మచిలీపట్నం, గుడివాడ, గన్నవరం నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన బరుల వద్దకు మహిళలు, ఎన్‌ఆర్‌ఐలు ఎక్కువగా హాజరయ్యారు. పలు బరుల వద్ద మహిళల సైతం పందేలు కట్టారు.

Updated Date - Jan 15 , 2026 | 04:26 AM