Share News

తెలంగాణ నా మాతృభూమి

ABN , Publish Date - Jun 11 , 2026 | 05:17 AM

తెలంగాణ ఎవరీ జాగీర్‌ కాదని, తన మాతృభూమి అని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ స్పష్టం చేశారు. తాను హైదరాబాద్‌కు రావడాన్ని, రాజకీయ కార్యకలపాలు నిర్వహించడాన్ని కొన్ని..

తెలంగాణ నా మాతృభూమి

  • అక్కడికెళ్లేందుకు అనుమతి అక్కర్లేదు

  • రానివ్వబోమని కొందరు అనడంతో తెలంగాణ ఎవరి జాగీరూ కాదని చెప్పా

  • సీఎంలే ఉత్తరం-దక్షిణం అనడం సబబా?

  • దేశ ఐక్యత కోసం అందరూ పనిచేయాలి

  • పొరుగు రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేస్తా

  • ఏపీకి హోదా రాకుండా చేసింది కాంగ్రెస్‌ పార్టీనే

  • విభజన వేళ విచ్ఛిన్నకర ధోరణి అవలంబించింది

  • ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం పోరాడడం వ్యర్థం

  • రాష్ట్రంలో సమగ్రాభివృద్ధి దిశగా కూటమి ప్రభుత్వం

  • సమాజంలో అవసరమైన వారికే ‘ఉచితాలు’ ఇవ్వాలి

  • ఏఎన్‌ఐ ఇంటర్వ్యూలో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌

న్యూఢిల్లీ/అమరావతి, జూన్‌ 10(ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఎవరీ జాగీర్‌ కాదని, తన మాతృభూమి అని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ స్పష్టం చేశారు. తాను హైదరాబాద్‌కు రావడాన్ని, రాజకీయ కార్యకలపాలు నిర్వహించడాన్ని కొన్ని చిన్నచితకా శక్తులు సవాల్‌ చేస్తున్నాయని ఆయన తీవ్రంగా విమర్శించారు. తెలంగాణలో ఉండటం అనేది తన ప్రాథమిక హక్కు అని, ఎవరూ తనను తన మాతృభూమి నుంచి దూరంగా ఉండాలని చెప్పలేరని వ్యాఖ్యానించారు. బుధవారం ఢిల్లీలో ఏఎన్‌ఐ వార్తసంస్థకు ఇచ్చిన ఇంటార్వ్యులో పలు అంశాలపై ఆయన స్పందించారు. ‘‘తెలంగాణ ఎవరి సొంత జాగిరు కాదు. ఇది నా మాతృభూమి. ఇక్కడికి రావడానికి, రాజకీయాలు చేయడానికి నాకు పూర్తి హక్కు ఉంది. కొందరు రాజకీయ నాయకులు నన్ను బయటి వ్యక్తిగా చిత్రీకరించడం హాస్యాస్పదం.’’ అని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ మద్దతుదారులు కూడా ప్రాంతీయ దృష్టితో తనపై విమర్శలు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. తెలంగాణకు వచ్చేందుకు తనకు ఎవరి అనుమతి అవసరం లేదని, తాను రావాలో లేదో చెప్పేందుకు ఎవరికీ హక్కు లేదని అన్నారు. తాను సర్జరీ నుంచి కోలుకుంటున్నప్పడు కూడా కొన్ని చిన్నచితకా శక్తులు.. ‘‘నువ్వు హైదరాబాద్‌కు ఎందుకు వస్తున్నావు. ఇది నీ గడ్డ కాదు.’’ అని అన్నట్టు చెప్పారు. వారిలో కాంగ్రెస్‌ మద్దతుదారులు కూడా ఉన్నారన్నారు. అందుకే.. ‘‘ఇది ఎవరి జాగీర్‌ కాదు. నా మాతృభూమి’’ అని చెప్పాల్సి వచ్చిందని వివరించారు.


కాంగ్రెస్‌ వంటి జాతీయ పార్టీ ఇలాంటి విచ్ఛిన్నకర ఊకదంపుడు వ్యాఖ్యలను చేయడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ పదేళ్లు అధికారంలో ఉన్నా ఇలాంటి వేర్పాటు వాద ధోరణని ప్రదర్శించలేదన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాతే ఇలాంటి విమర్శలు మొదలయ్యాయని విమర్శించారు. బీఆర్‌ఎ్‌సగా మారిన టీఆర్‌ఎస్‌ ఇలాంటి మాటలు అంటే అర్థం చేసుకోవచ్చని, కానీ కాంగ్రెస్‌ వాదులు ఈ వ్యాఖ్యలు చేయడం విచిత్రంగా ఉందని అన్నారు. తెలంగాణతో తన సంబంధాలు ఎంతో లోతుగా ఉన్నాయని, తాను యుక్తవయసులో క్రియాశీలకంగా ఉన్న రోజుల నుంచి తెలంగాణతో బంధం పెనవేసుకుందని చెప్పారు. 2007-08 నుంచి తాను రాజకీయాల్లో ఉన్నానని, 2014లో జనసేన పార్టీని ప్రారంభించకముందే తన సైద్ధాంతిక పునాదిని తెలంగాణ యువకులు సమర్థించారని ఆయన తెలిపారు.


సినిమాల్లో నటిస్తున్నా..

సరిహద్దులకు అతీతంగా తన తొలి ఎన్‌జీవో కార్యకలపాలు, ప్రజారాజ్యం పార్టీ కార్యకలాపాలు జరిగాయని పవన్‌ గుర్తుచేశారు. 2004 నుంచి తెలంగాణ యువకులతో తనకు బంధం ఏర్పడిందని, సినిమాల్లో నటిస్తున్నా కూడా వారితో సైద్ధాంతిక సంబంధాలు కొనసాగాయన్నారు. తన ప్రాధాన్యతలు ప్రస్తుతం నిర్వహిస్తున్న పరిపాలన బాధ్యతలపై కేంద్రీకృతమైయ్యాయని, నిజానికి తెలంగాణపై తాను దృష్టి పెట్టలేదని చెప్పారు. జనసేన తెలంగాణలో ప్రారంభమైనప్పటికీ తన ప్రధాన దృష్టి ఏపీపైనే ఉందన్నారు. తన ప్రయాణం తొలి రోజుల్లో గమ్యం లేకుండా సాగిందని, సమాజంలో మార్పు కావాలని తపించానని చెప్పారు. ‘‘టీనేజ్‌లో ఉన్నప్పుడు వ్యవస్థల్లో జరుగుతున్న అన్యాయంపై నాకు ఎంత ఆగ్రహం కలిగిందంటే.. ఒక దశలో నక్సలైట్‌ ఉద్యమంలో చేరాలనుకున్నా. ఇవాళ దేశంపట్ల అదే భావోద్వేగంతో నిర్మాణాత్మక దృష్టితో రాజకీయాలు చేస్తున్నా. సమాజం పట్ల ఆందోళనతో నిరాశా నిస్పృహలకు లోనయ్యా. భావోద్వేగంతో విప్లవ పంథాలను కూడా అన్వేషించా.’’ అని పవన్‌ అన్నారు.


‘హోదా’ సమస్యకు కాంగ్రెస్‌ కారణం

ఆంధ్రప్రదేశ్‌కు హోదా రాకపోవడానికి ప్రధాని మోదీ బాధ్యత ఏమీ లేదని, కాంగ్రెస్‌ పార్టీయే హోదా సమస్యగా మారడానికి కారణమని పవన్‌కల్యాణ్‌ విమర్శించారు. రాష్ట్ర విభజన సమయంలో విచ్ఛిన్నకర ధోరణిని కాంగ్రెస్‌ పార్టీ అవలంభించిందని ఆరోపించారు. ఆర్థిక అసమానతలకు, విభజనలో భాగంగా సుసంపన్నమైన హైదరాబాద్‌ను కోల్పోవడమే కారణమని చెప్పారు. అప్పటి యూపీఏ ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణ ఇచ్చినప్పుడు ఏపీని తీవ్ర ఆర్థిక సంక్షోభంలో నెట్టివేసిందన్నారు. ప్రత్యేక హోదాను అమలు చేయలేదని విమర్శించారు. గతం నుంచి ఎంతో ముందుకు వెళ్లిన తర్వాత హోదా కోసం ప్రయత్నించడం వ్యర్థ పోరాటమన్నారు.ఉచిత పథకాలపై మాట్లాడుతూ, ‘‘కేవలం ఓట్ల కోసం ఇచ్చే వాటిని వ్యతిరేకిస్తా. కానీ, సమాజంలోని వెనుకబడిన వర్గాలకు అవసరమైన కనీస సదుపాయాలు, సంక్షేమ పథకాలు అమలు చేయడం తప్పనిసరి.’’ అని పవన్‌ విశ్లేషించారు.


ఉత్తరం-దక్షిణం అంటే..

ప్రాంతీయ లేదా భాషాపరమైన విభజనల కంటే దేశ ఐక్యత ముఖ్యమని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. రాజకీయ నేతలు ఉత్తర-దక్షిణ విభేదాలను ప్రోత్సహించేలా మాట్లాడడం సరికాదన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ గుజారాత్‌కు చెందిన వారని, దేశాన్ని ఏకీకృతం చేసిన సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ కూడా గుజరాత్‌కు చెందినవారేనని తెలిపారు. గుజరాత్‌ భారతదేశం పశ్చిమభాగంలో ఉందని, హిందీ ప్రాంతంలో కాదన్నారు. ఉత్తరం-దక్షిణం అనే కోణంలో మాట్లాడితే.. ఈ దేశంలో ఎవరూ కలిసి జీవించలేరన్నారు. సైన్యం కూడా సక్రమంగా పనిచేయలేదన్నారు. ‘‘ఒక సాధారణ వ్యక్తి లేదా.. ఈ విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోని వ్యక్తి ఇలా మాట్లాడితే అర్థం చేసుకోవచ్చు. సీఎంలే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే, వాటికి తప్పకుండా సమాధానం చెప్పాలి. ఎవరి వాదన వారికి ఉంటుంది. దానిని వేరే విధంగా చెప్పవచ్చు. దానిని ఉత్తరం-దక్షిణం అనే కోణంలో చూడకూడదు.’’ అని వ్యాఖ్యానించారు. రెండు తెలుగు రాష్ట్రాలు పరస్పర గౌరవం, సహకారంతో ముందుకెళ్లాలని పేర్కొన్నారు. రాజకీయ సరిహద్దులున్నా ప్రజల మద్య సంబంధాలను విడదీయలేరని వ్యాఖ్యానించారు.

Updated Date - Jun 11 , 2026 | 05:20 AM