మనవి వద్దు.. తెలంగాణవి ముద్దు
ABN , Publish Date - Apr 29 , 2026 | 04:56 AM
రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రభుత్వ హాస్టళ్లలో లక్షలాది మంది విద్యార్థులు ఉంటున్నారు. వారికి సంక్షేమ శాఖలు సరఫరా చేయాల్సిన దుప్పట్లు, బెడ్‌షీట్లు, టవళ్లను రాష్ట్రంలోని చేనేత సహకార సంఘాల నుంచి కొనుగోలు చేయాలని...
చేనేత కొనుగోళ్లలో సంక్షేమ అధికారుల కమీషన్ల కక్కుర్తి
రూ.270కి వచ్చే టవల్... రూ.810కి కొనుగోలు
రూ.170 విలువైన బెడ్‌షీట్‌కు రూ.556 చెల్లింపు
నేతన్న నోట్లో మట్టి కొట్టి.. రూ.కోట్లు కొల్లగొట్టారు
తెలంగాణలో కోర్టుకెళ్లి ఆర్డర్ సాధించుకున్న ‘టెస్కో’
‘ఆప్కోకు’ ఇవ్వాలన్న ఉత్తర్వు పట్టని అధికారులు
సంక్షేమ హాస్టళ్లలో చేరే ప్రతి విద్యార్థికీ బెడ్‌షీట్, టవల్ అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయల నిధులు విడుదల చేసింది. వీటిని సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్రంలోని చేనేత సహకార సంఘాలు ముందుకొస్తున్నాయి. అయినప్పటికీ కమీషన్లకు అలవాటు పడిన సంక్షేమ శాఖల అధికారులు ప్రభుత్వ ఉత్తర్వులను పట్టించుకోకుండా తెలంగాణలోని ప్రైవేటు వస్త్ర వ్యాపారుల నుంచి లక్షలాది టవళ్లు, బెడ్‌షీట్లు, దుప్పట్లు భారీ ధరకు కొనుగోలు చేసి ఇక్కడ పంపిణీ చేస్తున్నారు. అయితే అవి నాసిరకంగా ఉన్నాయని విద్యార్థులు వాపోతున్నారు. సంక్షేమ శాఖలు, చేనేత వర్గాల్లో ఈ అవినీతి బాగోతం చర్చనీయాంశంగా మారింది.
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రభుత్వ హాస్టళ్లలో లక్షలాది మంది విద్యార్థులు ఉంటున్నారు. వారికి సంక్షేమ శాఖలు సరఫరా చేయాల్సిన దుప్పట్లు, బెడ్‌షీట్లు, టవళ్లను రాష్ట్రంలోని చేనేత సహకార సంఘాల నుంచి కొనుగోలు చేయాలని స్పష్టం చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం గతంలోనే జీవో.1 జారీ చేసింది. అయినప్పటికీ పొరుగు రాష్ట్రంలోని ప్రైవేటు వస్త్ర వ్యాపారులతో సంక్షేమ శాఖల అధికారులు కుమ్మక్కయ్యారు. 4 లక్షల టవళ్లు కావాలని కబురు పెట్టడంతో పొరుగు రాష్ట్రానికి చెందిన ఓ వ్యాపారి ముందుకొచ్చాడు. అక్కడ సరఫరా చేద్దామని టర్కీ టవళ్లు తీసుకొస్తే ‘టెస్కో’ కోర్టుకు వెళ్లి ఆర్డర్ తెచ్చుకుందని, వాటిని కొనుగోలు చేస్తే భారీగా ముట్టజెబుతానని ఆఫర్ ఇచ్చాడు. దీంతో పొరుగు టవళ్లను ఒక్కోటీ రూ.810 (టర్కీ రకం) చొప్పున కొనుగోలు చేశారు. ఇదే సమయంలో మన రాష్ట్రంలో రూ.270కే టవళ్లు (హనికుమ్ రకం) సరఫరా చేస్తామని ఆప్కో ముందుకొచ్చింది.
జీవో.1 గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిందేనని గుర్తుచేస్తూ, చేనేతలకు పని కల్పించాలని చేనేత సంఘాల నేత వెంకన్న లేఖ ద్వారా వేడుకున్నారు. అయితే పట్టించుకోకుండా ఎస్సీ సంక్షేమ హాస్టళ్లలో 2 లక్షల టవళ్లు పంపిణీ కూడా చేశారు. మరో 4 లక్షల టవళ్లు త్వరలోనే సరఫరా చేస్తానంటూ రూ.40 అధికంగా ఒక్కో టవల్ రూ.850 చొప్పున ఆర్డర్ దక్కించుకున్న వ్యాపారి.. కార్పెట్లు, దుప్పట్ల టెండర్‌ను కూడా భారీ ధరకు దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నాడు. ఇదిలా ఉండగా ప్రభుత్వం పంపిణీ చేసిన టర్కీ టవళ్లు నీరు సరిగా పీల్చడం లేదని విద్యార్థులు ఫిర్యాదు చేస్తున్నారు. అందులో పాలిస్టర్ దారం ఉందని, తడిసిన తర్వాత ఆరకుండా వాసన వస్తున్నాయని వాపోతున్నారు. పంపిణీ చేసిన వాటిలో నాసిరకం, పాడైన టవళ్లు ఉన్నాయని ఆరోపిస్తున్నారు. చేనేత మగ్గాలపై తయారయ్యే హనికుమ్ రకం టవళ్లు తక్కువ ధరకు లభిస్తాయి. నీటిని పీల్చుకోవడంతో పాటు. తొందరగా ఆరిపోతాయి. అధికారుల అవినీతి కారణంగా ఇటు ప్రభుత్వ ఖజానాకు రూ.కోట్లల్లో నష్టం వాటిల్లడంతో పాటు అటు విద్యార్థులకూ ప్రయోజనం లేకుండా పోయిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
బెడ్‌షీట్ల కొనుగోలులోనూ మాయ
ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థులకు సరఫరా చేసేందుకు దుప్పట్ల కొనుగోలు ప్రక్రియ ప్రారంభించిన సంక్షేమశాఖ.. మార్కెట్లో రూ.170 మాత్రమే విలువజేసే ఒక్కో బెడ్‌షీట్ (పొలారీ ప్రెస్సీ రకం)ను ఏకంగా రూ.556తో కొనుగోలు చేసింది. ప్రైవేటు వ్యాపారులతో నేరుగా కొనుగోలు చేస్తే ఆరోపణలు వచ్చే అవకాశం ఉందని, కేంద్రీయ భండార్‌కు ఆర్డర్ ఇచ్చింది. ఆదే ఆర్డర్ తమకు ఇస్తే సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చేనేత సంఘాలు కోరినా వినిపించుకోలేదు. తక్కువ ధరకు సరఫరా చేసేందుకు కేంద్రీయ భండార్‌ను సంప్రదించగా అక్కడా సదరు పొరుగు వ్యాపారి ప్రత్యక్షమయ్యారు. నేరుగా కొనుగోలు చేస్తే దొరికిపోతామని ఇలా జాగ్రత్త తీసుకుని అవినీతి అధికారులు చేనేత వర్గాలకు అన్యాయం చేసినట్లు తేలింది. ఈ మొత్తం వ్యవహారంలో రూ.కోట్లు ఖర్చు చేయగా అందులో సగానికి పైగా చేతులు మారినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై విజిలెన్స్ విచారణ జరిపిస్తే అసలు గుట్టు బయటపడుతుందని చేనేత వర్గాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయనున్నాయి.