ఎంత ఎదిగినా మూలాలు మరవొద్దు
ABN , Publish Date - Jan 25 , 2026 | 04:26 AM
ఎంత ఎత్తు ఎదిగినా, ఎంత ఉన్నత స్థాయికి చేరినా మన మూలాలను మరువకూడదని తెలంగాణ సీఎస్ కె.రామకృష్ణారావు సూచించారు.
తెలంగాణ సీఎస్ రామకృష్ణారావు సూచన
ఆయన సహా 21 మందికి ‘అనంత ఆణిముత్యాలు’ పురస్కారాల ప్రదానం
హిందూపురం, జనవరి 24(ఆంధ్రజ్యోతి): ఎంత ఎత్తు ఎదిగినా, ఎంత ఉన్నత స్థాయికి చేరినా మన మూలాలను మరువకూడదని తెలంగాణ సీఎస్ కె.రామకృష్ణారావు సూచించారు. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలో సాహితీ గగన్ మహల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం 21 మంది ప్రముఖులను ‘అనంత ఆణిముత్యాలు’ పురస్కారాలతో సత్కరించారు. పురస్కారాలు అందుకున్నవారిలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.సురేశ్‌రెడ్డి, మాజీ డీజీపీ కె.అరవిందరావు, తెలంగాణ సీఎస్ రామకృష్ణారావు తదితరులున్నారు. సినీ నటుడు బ్రహ్మానందం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రామకృష్ణారావు మాట్లాడుతూ మనం ఎంత ఎత్తుకు ఎదిగినా, జన్మభూమిని మరువకూడదన్నారు. తాను కుగ్రామంలో జన్మించానని, 16ఏళ్ల వయసు వచ్చేవరకు కరెంటు చూడలేదని మాజీ డీజీపీ అరవిందరావు పేర్కొన్నారు. గోడకు ఉన్న ల్యాంపునకు ఒకవైపు చెల్లెలు, మరోవైపు తాను నిలబడి చదువుకున్నామని తెలిపారు. గ్రంథాలయంలో రూపాయి కట్టి, పుస్తకాలు చదివి ఐపీఎస్ అయ్యానన్నారు. పిల్లలకు ఏ రంగంలో ఉత్సాహం ఉంటే దానివైపు ప్రోత్సహించాలని సూచించారు. బెంగళూరు ఐఐఎ్‌ససీ శాస్త్రవేత్త యాదాటి నరహరి, టెక్ కంపెనీ సంస్థాపకుడు విశ్వనాథ్ ఏల్లూరి, హైదరాబాద్‌కు చెందిన జేజే ఆస్పత్రి వ్యవస్థాపకుడు జయంత్‌రెడ్డి తదితరులు పురస్కారాలు అందుకుని ప్రసంగించారు.