Rewards: ‘తెలంగాణ’ సందడి.. బహుమతులుగా కార్లు, బుల్లెట్లు
ABN , Publish Date - Jan 17 , 2026 | 03:56 AM
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తెలంగాణ వాసుల హవానే ఎక్కువగా కనిపించింది. వారి కార్లతోనే రోడ్లన్నీ నిండిపోయాయి. అలాగే ఎక్కువ కోడి పందేలు గెలిచిన వారికి కార్లు, బుల్లెట్లు బహుమతిగా అందజేశారు.
కృష్ణాజిల్లా కేసరపల్లి బరులకు హాజరైన జనం, పార్కింగ్‌లో కారులు, మోటార్‌సైకిళ్లు
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తెలంగాణ వాసుల హవానే ఎక్కువగా కనిపించింది. వారి కార్లతోనే రోడ్లన్నీ నిండిపోయాయి. అలాగే ఎక్కువ కోడి పందేలు గెలిచిన వారికి కార్లు, బుల్లెట్లు బహుమతిగా అందజేశారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలంలో కార్లు బహుమతులు ఇవ్వడం గమనార్హం. క్యాసినో నిర్వాహకుడు చీకోటి ప్రవీణ్ వంటి వాళ్లు కూడా జిల్లాలోని పలుచోట్ల హల్‌చల్ చేశారు. అలాగే కాకినాడ జిల్లాలోని కాకినాడ రూరల్, కరప, జగ్గంపేట, పెద్దాపురం బరుల వద్ద పెద్దఎత్తున తెలంగాణ నుంచి వచ్చిన పందెంరాయుళ్లు పందేలు కాశారు. తెలంగాణ నుంచి వచ్చిన కొందరు మహిళలు, సాఫ్ట్‌వేర్ యువతులు సైతం గుండాట ఆడారు. తాళ్లరేవులో తెలంగాణకు చెందిన ఓ జంట కోడి పందేల్లో బుల్లెట్ గెల్చుకుంది. ఇక డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో అత్యధిక పందేల్లో గెలుపొందిన విజేతలకు ఆత్రేయపురం మండలం, రావులపాలెం మండలాల్లో పలు గ్రామాల్లో బుల్లెట్లను కానుకగా అందించారు. ఆత్రేయపురం మండలం లొల్ల బరి వద్ద అత్యధిక పందేలు గెలిచిన వ్యక్తికి శుక్రవారం రాత్రి క్రెటా కారును అందజేశారు.
‘సినిమా’ సందడి..
పందేలను వీక్షించేందుకు పశ్చిమగోదావరి జిల్లాకు ఈ సారి తెలంగాణ, తమిళనాడు రాష్ర్టాల నుంచి యువత పెద్ద ఎత్తున వచ్చారు. పెదఅమిరం బరిలో సినీ నిర్మాత దగ్గుబాటి సురేశ్, సినీ నటులు బెల్లంకొండ సురేశ్, రోషన్, హీరోయిన్ డింపుల్ హయాతి పందేలను తిలకించి సందడి చేశారు. భీమవరం రూరల్ మండలం గొల్లవాని తిప్ప, తాడేరు బరుల్లో బుల్లితెర నటులు పందెం రాయుళ్లలో జోష్ నింపారు. యలమంచిలిలో సంక్రాంతి రోజున విందు భోజనాలకు జనం పోటెత్తారు. పాలకొల్లు నియోజకవర్గంలో యలమంచిలి, కలగంపూడి, పూళ్లలో ప్రతి పందెం రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు పలికింది. గుండాటలో ఈ ఏడాది మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.