Organ Donation: చనిపోతూ.. ఐదుగురికి ప్రాణం!
ABN , Publish Date - Jan 04 , 2026 | 04:03 AM
రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్‌కు గురైన ఓ 15 ఏళ్ల బాలుడు.. తాను చనిపోతూ అవయవదానం ద్వారా మరో ఐదుగురికి ప్రాణం పోశాడు. వివరాల ప్రకారం..
రోడ్డు ప్రమాదంలో కర్నూలు జిల్లాకు చెందిన 15 ఏళ్ల బాలుడు బ్రెయిన్‌డెడ్
కుటుంబం అంగీకారంతో అవయవదానం
తిరుపతి శ్రీపద్మావతి హృదయాలయలో ఓ యువతికి బాలుడి గుండె అమర్చిన వైద్యులు
వివిధ ఆస్పత్రులకు ఇతర అవయవాల తరలింపు
కర్నూలు హాస్పిటల్/తిరుపతి(వైద్యం), జనవరి 3(ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్‌కు గురైన ఓ 15 ఏళ్ల బాలుడు.. తాను చనిపోతూ అవయవదానం ద్వారా మరో ఐదుగురికి ప్రాణం పోశాడు. వివరాల ప్రకారం.. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలానికి చెందిన ఓ ఇంటర్ విద్యార్థి గత నెల 31న రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తలకు తీవ్ర గాయం కావడంతో కర్నూలు కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఈ నెల 2వ తేదీన వైద్యులు బాలుడి బ్రెయిన్ డెడ్ అయినట్లు నిర్ధారించారు. జీవన్‌దాన్ ట్రస్టు సభ్యులు, కిమ్స్ వైద్యులు బాధిత కుటుంబసభ్యులతో మాట్లాడి, బాలుడి అవయవదానానికి అంగీకారం తీసుకున్నారు. విద్యార్థికి చెందిన ఒక కిడ్నీ, లివర్‌ను కర్నూలు కిమ్స్ హాస్పిటల్‌లో ఉంచారు. శనివారం గ్రీన్ చానల్ ద్వారా మరో కిడ్నీని నెల్లూరు అపోలో హాస్పిటల్‌కు, గుండెను తిరుపతి శ్రీపద్మావతి హృదయాలయ ఆస్పత్రికి తరలించారు. ఊపిరితిత్తులను సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్‌కు అంబులెన్స్‌ల ద్వారా తరలించారు.
20 ఏళ్ల యువతికి ఆ బాలుడి గుండె
తిరుపతి శ్రీపద్మావతి హృదయాలయ ఆస్పత్రి వైద్యులు శనివారం 20 ఏళ్ల యువతికి విజయవంతంగా గుండె మార్పిడి శస్త్రచికిత్స చేశారు! బ్రెయిన్ డెడ్‌కు గురైన కర్నూలు జిల్లా బాలుడి గుండెను ఆమెకు అమర్చారు. అంతకుముందు గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న కృష్ణా జిల్లాకు చెందిన ఆ యువతికి గుండె మార్పిడి శస్త్రచికిత్స చేయాలని శ్రీపద్మావతి హృదయాలయ ఆస్పత్రి వైద్యులు నిర్ధారించి, ఆమె వివరాలను జీవన్‌దాన్ పోర్టల్‌లో నమోదు చేశారు. ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథరెడ్డి శుక్రవారం తన బృందంతో కలిసి కర్నూలు చేరుకున్నారు. అక్కడ బ్రెయిన్‌డెడ్‌కు గురైన బాలుడి నుంచి గుండె సేకరించి, ప్రత్యేక హెలికాప్టర్‌లో శనివారం సాయంత్రం రేణిగుంటలోని విమానాశ్రయానికి చేరుకున్నారు. అప్పటికే సిద్ధంగా ఉన్న ప్రత్యేక అంబులెన్సులో గ్రీన్‌చానల్ ద్వారా 5.10 గంటలకు ఆస్పత్రికి తీసుకువచ్చారు. వెంటనే గుండె మార్పిడి శస్త్ర చికిత్సను ప్రారంభించారు.