Guntur: పందెం కోసం బాల్ పెన్ను మింగేశాడు
ABN , Publish Date - Jan 01 , 2026 | 05:58 AM
స్నేహితులతో సరదగా పందెం కాసిన ఓ బాలుడు మూడేళ్ల క్రితం బాల్ పెన్ను మింగేశాడు.
మూడేళ్ల క్రితం మింగిన గుంటూరు బాలుడు
ఎండోస్కోపీతో క్షణాల్లో బయటకు తీసిన వైద్యులు
గుంటూరు మెడికల్, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): స్నేహితులతో సరదగా పందెం కాసిన ఓ బాలుడు మూడేళ్ల క్రితం బాల్ పెన్ను మింగేశాడు. ఆ విషయాన్ని ఇంట్లో చెప్పకుండా దాచాడు. అయితే మూడేళ్ల తర్వాత గుంటూరు ప్రభుత్వ సమగ్రాస్పత్రి వైద్యులు ఆపరేషన్‌తో పనిలేకుండా ఎండోస్కోపీ ద్వారా క్షణాల్లో ఆ పెన్నును బయటకు తీశారు. గుంటూరుకు చెందిన ఎం రవి మురళీకృష్ణ (16) ఇంటర్ చదువుతున్నాడు. మూడేళ్ల క్రితం స్నేహితులతో సరదగా పందెం కాసి బాల్‌పాయింట్ పెన్నును మింగాడు. ఏడాది నుంచి తరచూ కడుపు నొప్పి వస్తుండటంతో తల్లిదండ్రులు వైద్యులకు చూపించారు. ఇటీవల గన్నవరంలో ప్రైవేటు ఆస్పత్రి వైద్యులు.. మురళీకృష్ణకు వైద్యపరీక్షలు నిర్వహించి పేగుల్లో ఉన్న పెన్నును గుర్తించారు. దాన్ని బయటకు తీసేందుకు గుంటూరు జీజీహెచ్‌కు రిఫర్ చేశారు. ఈ నెల 27న బాధితుడు గుంటూరు జీజీహెచ్‌కు వచ్చాడు. గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగాధిపతి డాక్టర్ ఏ కవిత, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ షేక్ నాగూర్ బాషా, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శివరామకృష్ణతో కూడిన వైద్య బృందం ఆపరేషన్‌తో పనిలేకుండా రెట్రోగ్రేడ్ ఎండోస్కోపీ విత్ ఓవర్ ట్యూబ్ సాయంతో క్షణాల్లో పేద్ద పేగులోని బాల్ పాయింట్ పెన్నును బయటకు తీశారు. ఈ బృందాన్ని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ యశస్వి అభినందించారు.