గ్రామీణ విద్యార్థులకూ సాంకేతిక విద్య
ABN , Publish Date - Jun 10 , 2026 | 05:40 AM
గ్రామీణ, తొలి తరం విద్యార్థులకు కూడా ఆర్టిషిఫియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), సైబర్ సెక్యూరిటీ వంటి ఆధునిక సాంకేతిక విద్యను అందించే లక్ష్యంలో భాగంగా గుంటూరుకు..
ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో ‘రీజనల్ టెక్నాలజీ సెంటర్లు’
ఐఐటీ మద్రా్‌సతో గుంటూరుకు చెందిన ‘టెక్‌సొరా’ ఒప్పందం
చెన్నై, హైదరాబాద్, జూన్ 9 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ, తొలి తరం విద్యార్థులకు కూడా ఆర్టిషిఫియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), సైబర్ సెక్యూరిటీ వంటి ఆధునిక సాంకేతిక విద్యను అందించే లక్ష్యంలో భాగంగా గుంటూరుకు చెందిన ‘టెక్‌సొరా’ సంస్థ ఐఐటీ మద్రాస్‌కు అనుబంధంగా పనిచేస్తున్న ‘ఐఐటీఎం ప్రవర్తక్’తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఐఐటీ మద్రాస్‌లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఈ మేరకు సంతకాలు చేశారు. దేశవ్యాప్తంగా అధునాతన సాంకేతిక విద్యను మరింత విస్తృత స్థాయిలో అందించాలనే లక్ష్యంతో ఈ భాగస్వామ్యానికి శ్రీకారం చుట్టినట్లు టెక్‌సొరా సీఈవో కొల్లా అశోక్‌బాబు తెలిపారు. ఈ ఒప్పందంలో భాగంగా రాష్ట్రంలోని ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోని యువతకు ఉద్యోగ నైపుణ్య విద్యను అందించాలన్న లక్ష్యంగా రీజనల్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఐఐటీఎం ప్రవర్తక్ సీఈవో డాక్టర్ ఎం.జె. శంకర్ రామన్, సీవోవో జి. వీరరాఘవన్, చీఫ్ నాలెడ్జ్ ఆఫీసర్ బాలమురళీ శంకర్, సీఎస్ఆర్ డైరెక్టర్ రమ్యా వాసుదేవన్ తదితరులు పాల్గొన్నారు. కృత్రిమ మేధ, మెషీన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాల్లో నైపుణ్యాలను పెంపొందించడంపై ఈ ఒప్పందం దృష్టి సారించనుంది. ఈ ఒప్పందంలో భాగంగా విద్యార్థులు, ఉద్యోగులు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను టెక్‌సొరా, ఐఐటీఎం ప్రవర్తక్ సంయుక్తంగా నిర్వహిస్తాయి.