సమస్యలతో మాకు సంబంధం లేదు!
ABN , Publish Date - Jan 28 , 2026 | 05:43 AM
క్వాంటమ్ టెక్నాలజీస్ కోర్సుల్లో దూసుకుపోతున్న ఆంధ్రప్రదేశ్ యువతకు సాంకేతిక సమస్యలు అడ్డంకిగా మారుతున్నాయి.
క్వాంటమ్ కోర్సుల్లో సాంకేతిక సమస్యలు
స్పందించని వైజర్, క్యూబిటెక్ సంస్థలు
పట్టించుకోని ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ
అమరావతి, జనవరి 27(ఆంధ్రజ్యోతి): క్వాంటమ్ టెక్నాలజీస్ కోర్సుల్లో దూసుకుపోతున్న ఆంధ్రప్రదేశ్ యువతకు సాంకేతిక సమస్యలు అడ్డంకిగా మారుతున్నాయి. కోర్సు పూర్తిచేసినా తుది అసె్‌సమెంట్ సమర్పణలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అయితే వాటిని ఎవరు పరిష్కరిస్తారో తెలియక విద్యార్థులు అయోమయంలో పడిపోయారు. ‘అమరావతి క్వాంటమ్ వ్యాలీ’ కార్యక్రమంలో భాగంగా వైజర్, క్యూబిటెక్ అనే ప్రైవేటు కంపెనీలతో కలిసి ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ క్వాంటమ్ కోర్సును అందుబాటులోకి తీసుకొచ్చింది. దాదాపు 50వేల మంది విద్యార్థులు ఈ కోర్సు నేర్చుకుంటున్నారు. ‘క్వాంటమ్ ఫండమెంటల్స్ అండ్ అడ్వాన్స్‌డ్ ఆల్గరిథమ్స్- అమరావతి క్వాంటమ్ వ్యాలీ’ పేరుతో ఈ కోర్సు అందుబాటులో ఉంది. దీనికోసం వైజర్, క్యూబిటెక్ కంపెనీలతో నైపుణ్యాభివృద్ధి సంస్థ ఒప్పందం చేసుకుంది. నెల రోజుల ఈ కోర్సును ఇటీవల కొందరు విద్యార్థులు, నిరుద్యోగులు పూర్తిచేశారు. తుది అసె్‌సమెంట్‌లో క్విజ్, అసైన్‌మెంట్ రెండు పరీక్షలుంటాయి. క్విజ్ అసె్‌సమెంట్ పూర్తిచేస్తేనే అసైన్‌మెంట్ ఓపెన్ అవుతుంది. అయితే క్విజ్ అసె్‌సమెంట్ పరీక్ష రాసిన తర్వాత సబ్మిట్ చేసే సమయంలో సాంకేతిక సమస్య తలెత్తుతోంది. సబ్మిట్ చేసినప్పటికీ ‘నాట్ సబ్మిటెడ్’ అని వస్తోంది. ఆ తర్వాత ఎన్నిసార్లు చెక్ చేసినా మళ్లీ పరీక్ష రాయాలని వైజర్ వెబ్‌సైట్ సూచిస్తోంది. కాగా.. ఇలాంటి సాంకేతిక సమస్యల పరిష్కారం కోసం క్యూబిటెట్ సపోర్ట్‌కు మెయిల్ చేసినా సమాధానం రావట్లేదు. మరోవైపు నైపుణ్యాభివృద్ధి సంస్థ తమకు సంబంధం లేదని చెబుతోంది. దీంతో ఈ సమస్యను ఎవరు పరిష్కరిస్తారో అర్థంకాని పరిస్థితి నెలకొంది.
ఇప్పుడు స్పందించరా సార్
వైజర్, క్యూబిటెక్ అందిస్తున్న కోర్సులకు ముఖ్యమంత్రి కార్యాలయంలోని ఓ ఉన్నతాధికారి విస్తృత ప్రచారం కల్పించారు. దరఖాస్తులు పెరిగేలా చేశారు. అయితే దీన్ని సమన్వయం చేస్తున్న నైపుణ్యాభివృద్ధి సంస్థ ఈ కోర్సుపై మొదటినుంచీ తమకే పట్టదన్నట్టుగా వ్యవహరించింది. అసలు క్వాంటమ్ కోర్సు ఒకటుందని కూడా విద్యార్థులకు చెప్పలేదంటే ఆ సంస్థ అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఫలితంగా దరఖాస్తులు రాకపోవడంతో సీఎంవోలోని ఆ ఉన్నతాధికారి రంగంలోకి దిగి విస్తృత ప్రచారం కల్పించేలా చేశారు. తీరా ఇప్పుడు సాంకేతిక సమస్యలు తలెత్తితే పట్టించుకునేవారు లేకుండా పోయారు. చివరికి ఈ కోర్సు ఎందుకు చేశామా అని అభ్యర్థులు విసిగిపోయే పరిస్థితి వచ్చింది. ఓవైపు క్వాంటమ్ టెక్నాలజీ్‌సకు పెద్దపీట వేయాలని సీఎం చంద్రబాబు ప్రచారం చేస్తుంటే.. మధ్యలో అధికారులు, కంపెనీలు ఇలా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.