Share News

నిరాశపరిచిన బడ్జెట్‌

ABN , Publish Date - Feb 15 , 2026 | 03:55 AM

రాష్ట్ర బడ్జెట్‌పై ఉపాధ్యాయ సంఘాలు అసంతృప్తి వ్యక్తంచేశాయి. ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఆర్థిక అంశాలను ప్రస్తావించకుండా బడ్జెట్‌ నిరాశపర్చిందని పేర్కొన్నాయి.

నిరాశపరిచిన బడ్జెట్‌

పీఆర్‌సీ, ఆర్థిక అంశాల ప్రస్తావన లేదు: ఉపాధ్యాయ సంఘాలు

అమరావతి/విజయవాడ, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర బడ్జెట్‌పై ఉపాధ్యాయ సంఘాలు అసంతృప్తి వ్యక్తంచేశాయి. ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఆర్థిక అంశాలను ప్రస్తావించకుండా బడ్జెట్‌ నిరాశపర్చిందని పేర్కొన్నాయి. 12వ పీఆర్‌సీ ఊసే లేదని, చెల్లించిన వాటి గురించి చెప్పిన ప్రభుత్వం, మిగిలిపోయిన బకాయిల గురించి చెప్పలేదని యూటీఎఫ్‌ అధ్యక్షుడు ఎన్‌.వెంకటేశ్వర్లు విమర్శించారు. బడ్జెట్‌లో ఉద్యోగుల సంక్షేమానికి కేటాయింపులులేవని, బకాయిల విడుదలపై ఎలాంటి ప్రకటనా చేయలేదని, పాఠశాలల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.1500 కోట్ల కేటాయింపులు సరిపోవని ఆపస్‌ అధ్యక్షుడు ఎస్‌.బాలాజీ పేర్కొన్నారు. బడ్జెట్‌ వేతన జీవులను నిరాశపర్చిందని, విద్యా రంగానికి కూడా కేటాయింపులు అరకొరగానే ఉన్నాయని, ఆశా, అంగన్‌వాడీ, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌, పార్ట్‌టైమ్‌, కంటిన్జెంట్‌ ఉద్యోగుల వేతనాల గురించీ ప్రస్తావించలేదని ఏపీటీఎఫ్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.హృదయరాజు, ఎస్‌.చిరంజీవి విమర్శించారు. ఈ బడ్జెట్‌ విద్యారంగ అభివృద్ధికి దోహదపడేలా లేదని, కొఠారి కమిషన్‌ సిఫారసులను ప్రభుత్వం పాటించలేదని, ఎస్‌ఎ్‌ఫఐ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.రామ్మోహన్‌, కె.ప్రసన్నకుమార్‌ పేర్కొన్నారు.

సమస్యల పరిష్కారానికి దశలవారీ పోరాటం: ఏపీటీఎఫ్‌

ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం దశలవారీ పోరాటం చేస్తామని ఏపీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు చెన్నుపాటి మంజుల, కె.బసవలింగరావు చెప్పారు. విజయవాడలోని ఏపీటీఎఫ్‌ రాష్ట్ర కార్యాయంలో శనివారం నిర్వహించిన రాష్ట్ర సబ్‌ కమిటీ సమావేశంలో వారు మాట్లాడుతూ 2010కి ముందు ఉపాధ్యాయ వృత్తిలో నియామకం పొందినవారికి టెట్‌ నుంచి మినహాయింపు కోరుతూ మార్చి 10న ఢిల్లోలో ఆందోళన నిర్వహిస్తామన్నారు.టెట్‌ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తాలని కోరుతూ ఈనెల 23-28 వరకు ఎంపీలకు వినతిపత్రాలు ఇస్తామని చెప్పారు. ఈనెల 26, 27 తేదీల్లో రాష్ట్రంలోని అన్ని పాతతాలూకా కేంద్రాల్లో ధర్నాలు నిర్వహిస్తామన్నారు.

Updated Date - Feb 15 , 2026 | 03:55 AM