హామీలు అమలు చేయకుంటే.. ‘చలో అసెంబ్లీ’
ABN , Publish Date - Feb 26 , 2026 | 05:17 AM
ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలతోపాటు దీర్ఘకాలం పెండింగ్‌లో ఉన్న సమస్యలపై ప్రభుత్వం మౌనం వీడి స్పష్టమైన ప్రకటన చేయాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం...
ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం మౌనం వీడాలి: ఎస్టీయూ
విజయవాడ(గాంధీనగర్), ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలతోపాటు దీర్ఘకాలం పెండింగ్‌లో ఉన్న సమస్యలపై ప్రభుత్వం మౌనం వీడి స్పష్టమైన ప్రకటన చేయాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం(ఎస్టీయూ) రాష్ట్ర అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు మల్లు రఘునాథరెడ్డి, ఎల్.సాయిశ్రీనివాస్ డిమాండ్ చేశారు. లేదంటే చలో అసెంబ్లీ చేపడతామని హెచ్చరించారు. విజయవాడలోని ధర్నాచౌక్‌లో బుధవారం ఎస్టీయూ ఆధ్వర్యంలో ‘సమర శంఖం’ కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి ఉద్యమించినప్పుడే ప్రభుత్వాలు స్పందిస్తాయన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలపై రాజీలేని పోరాటం చేసి 12వ పీఆర్సీ, మధ్యంతర భృతి, పెండింగ్ బకాయిలు, సీపీఎస్ రద్దు, హెల్త్‌కార్డులు తదితర డిమాండ్లను సాధించుకుందామని పిలుపునిచ్చారు. ఏఐఎ్‌సటీఎఫ్ జాతీయ నేతలు కత్తి నరసింహరెడ్డి, సీహెచ్ జోసెఫ్ సుధీర్‌బాబు తదితరులు ప్రసంగించారు. వివిధ సంఘాల నేతలు, అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.