ఏప్రిల్ 28న యూటీఎఫ్ చలో సెక్రటేరియట్
ABN , Publish Date - Mar 03 , 2026 | 04:22 AM
ఉపాధ్యాయుల ఆర్ధిక సమస్యలు పరిష్కారం, 12వ పీఆర్‌సీ చైర్మన్ నియామకంలో జాప్యాన్ని నిరసిస్తూ ఏప్రిల్ 28న చలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని...
విజయవాడ (గవర్నర్‌పేట), మార్చి 2 (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయుల ఆర్ధిక సమస్యలు పరిష్కారం, 12వ పీఆర్‌సీ చైర్మన్ నియామకంలో జాప్యాన్ని నిరసిస్తూ ఏప్రిల్ 28న చలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్.వెంకటేశ్వర్లు, కెఎస్ఎస్ ప్రసాద్ తెలిపారు. సోమవారం విజయవాడలోని యూటీఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో చలో సెక్రటేరియట్ కార్యక్రమ పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసేలోపు 12వ పీఆర్‌సీ చైర్మన్ నియామకంపై స్పష్టత ఇవ్వాలని, 29 శాతం ఐఆర్, 4 డీఏల చెల్లింపు, ఆర్థిక బకాయిలపై రోడ్ మ్యాప్, పాత పెన్షన్ అమలు, ఈహెచ్‌ఎన్ కార్డులపై స్పష్టం రాకుంటే యూటీఎఫ్ రణభేరి 3.0 పేరుతో దశల వారీ కార్యాచరణ చేపడతామని ప్రకటించారు. ఆందోళనలో భాగంగా ఈ నెల 24న అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ఒక రోజు నిరాహారదీక్ష, ఏప్రిల్ 1, 2 తేదీల్లో అన్ని జిల్లా కలెక్టరేట్‌ల వద్ద రెండు రోజుల రిలే నిరాహార దీక్షలు, ఏప్రిల్ 15-19 తేదీల్లో 5 రోజుల పాటు విజయవాడలో రాష్ట్ర స్థాయి రిలే నిరాహారదీక్షలు చేపడతామని తెలిపారు. ప్రభుత్వం స్పందించకుంటే ఏప్రిల్ 28న వేలాది మంది ఉపాధ్యాయ, ఉద్యోగులతో చలో సెక్రటేరియట్ నిర్వహిస్తామని హెచ్చరించారు.