5న టీచర్ల సమస్యలపై చలో ఢిల్లీ: ఏఐజేఏసీటీవో
ABN , Publish Date - Jan 08 , 2026 | 04:54 AM
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఫిబ్రవరి 5న చల్లో ఢిల్లీ కార్యక్రమం చేపడుతున్నట్లు అఖిల భారత జేఏసీ ఆఫ్ టీచర్స్ ఆర్గనైజేషన్(ఏఐజేఏసీటీవో) వెల్లడించింది.
అమరావతి, జనవరి 7(ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఫిబ్రవరి 5న చల్లో ఢిల్లీ కార్యక్రమం చేపడుతున్నట్లు అఖిల భారత జేఏసీ ఆఫ్ టీచర్స్ ఆర్గనైజేషన్(ఏఐజేఏసీటీవో) వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన సంఘాలతో ఏర్పాటైన ఏఐజేఏసీటీవో తరఫున రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాలు బుధవారం విజయవాడలో విలేకరులకు ఆ వివరాలు వెల్లడించాయి. ఏఐజేఏసీటీవో జాతీయ స్టీరింగ్ కమిటీ సభ్యుడు కత్తి నరసింహారెడ్డి, యూటీఎఫ్ అధ్యక్షుడు ఎన్.వెంకటేశ్వర్లు, ఎస్టీయూ ప్రధాన కార్యదర్శి ఎల్.సాయి శ్రీనివాస్, ఆప్టా ప్రధాన కార్యదర్శి ఎంజీ మెహది మాట్లాడుతూ 2010 కంటే ముందు నియామకమైన 30లక్షల మంది టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే కొన్ని రాష్ర్టాల ప్రభుత్వాలు దీనిపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశాయని, కేంద్రం చొరవ చూపి రివ్యూ పిటిషన్ వేయాలని లేదా టెట్ మినహాయింపునకు పార్లమెంటులో చట్టం చేయాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్నారు. ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్ అమలుచేయడం తగదని, రాష్ర్టాలకు స్వేచ్ఛనిచ్చి మాతృభాషలో బోధనకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. దేశంలో ఖాళీగా ఉన్న 10లక్షల టీచర్ ఉద్యోగాలను భర్తీచేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ఉపాధ్యాయులు పెద్దఎత్తున పాల్గొని చలో ఢిల్లీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.