Share News

ఉద్యమ బాటలో ఉపాధ్యాయులు

ABN , Publish Date - Jun 23 , 2026 | 04:30 AM

టెట్‌ రద్దు, ఆర్థిక సమస్యల పరిష్కారం కోరుతూ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) ఉద్యమానికి పిలుపునిచ్చింది. టెట్‌ రద్దు కోసం ఈ నెల 30 వరకు..

ఉద్యమ బాటలో ఉపాధ్యాయులు

  • టెట్‌ రద్దు కోసం ఎంపీ, ఎమ్మెల్యేలకు వినతులు

  • ఆర్థిక సమస్యలపై జూలై 14న ర్యాలీలు, పికెటింగ్‌

  • ఆతర్వాత చలో అసెంబ్లీ నిర్వహిస్తాం: ఫ్యాప్టో

అమరావతి, విజయవాడ, జూన్‌ 22(ఆంధ్రజ్యోతి): టెట్‌ రద్దు, ఆర్థిక సమస్యల పరిష్కారం కోరుతూ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) ఉద్యమానికి పిలుపునిచ్చింది. టెట్‌ రద్దు కోసం ఈ నెల 30 వరకు ఎంపీ, ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు ఇస్తామని, ఆతర్వాత విద్యారంగం, ఆర్థిక సమస్యలపై జూలై 14న అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, పికెటింగ్‌లు చేయాలని నిర్ణయించినట్లు తెలిపింది. ఫ్యాప్టో చైర్మన్‌ ఎల్‌.సాయిశ్రీనివాస్‌, సెక్రటరీ జనరల్‌ ఎస్‌.చిరంజీవి, కోచైర్మన్‌ చిట్టేటి రమేశ్‌, డిప్యూటీ సెక్రటరీ జనరల్‌ కె.బసవలింగారావు సోమవారం విజయవాడలో విలేకరుల సమావేశంలో ఈ విషయాలను వెల్లడించారు. విద్యాహక్కు చట్టానికి ముందు నియమితులైన టీచర్లు... ఇప్పుడు టెట్‌లో అర్హత సాధించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని, అయితే ఆ టీచర్లకు టెట్‌ మినహాయింపు కోసం పార్లమెంటులో విద్యాహక్కు చట్టానికి సవరణ చేయాలని, అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సిఫారసు లేఖ పంపాలని డిమాండ్‌ చేశారు. టెట్‌ నుంచి మినహాయింపు లభిస్తే రాష్ట్రంలో లక్ష మంది టీచర్లకు మేలు జరుగుతుందన్నారు. ఆర్థిక అంశాలపై ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో కొంత సమయం అడిగారని, ఇప్పుడు రెండేళ్లయినా స్పందించడం లేదని అన్నారు. ఇప్పటికైనా 12వ పీఆర్‌సీని నియమించాలని డిమాండ్‌ చేశారు. ఈలోగా ప్రత్యామ్నాయం కోసం తక్షణం 30శాతం మధ్యంతర భృతి ప్రకటించాలన్నారు. టీచర్లందరికీ ఒకే సర్వీస్‌ రూల్స్‌ ఉండాలని ఎప్పటినుంచో కోరుతున్నామని, జిల్లాల విభజన ద్వారా ఈ అవకాశం వచ్చినందున అందరినీ కలిపి లోకల్‌ క్యాడర్‌గా పరిగణించాలని కోరారు. సీపీఎస్‌ రద్దుచేసి పాత పెన్షల్‌ స్కీం పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. జూలై 14 కార్యక్రమం తర్వాత రాష్ట్ర ఉద్యోగ జేఏసీ నిర్ణయాన్ని చూసి, వారితో కలిసి లేదా ఫ్యాప్టో తరఫున చలో అసెంబ్లీ కార్యక్రమం చేపడతామని తెలిపారు. సమావేశంలో చైర్మన్‌ సాయి శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీల అమలులో కూటమి ప్రభుత్వం విఫలమైందని అన్నారు.

Updated Date - Jun 23 , 2026 | 04:31 AM