నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థినులపై వేధింపులు
ABN , Publish Date - Apr 13 , 2026 | 05:54 AM
ఏలూరు జిల్లా నూజివీడులోని ట్రిపుల్ ఐటీ పీయూసీ విద్యార్థినులపై అధ్యాపకులే వేధింపులకు పాల్పడ్డారు. వారిపై చర్యలకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
ముగ్గురు అధ్యాపకులపై విచారణకు ఆదేశాలు
నూజివీడు, ఏప్రిల్ 12(ఆంధ్రజ్యోతి): ఏలూరు జిల్లా నూజివీడులోని ట్రిపుల్ ఐటీ పీయూసీ విద్యార్థినులపై అధ్యాపకులే వేధింపులకు పాల్పడ్డారు. వారిపై చర్యలకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కొద్దిరోజుల కిందట ట్రిపుల్ ఐటీలో ఒక అధ్యాపకుడు ఓ విద్యార్థినికి వాట్సాప్‌లో ప్రేమ కవితలు పంపించడంతో క్యాంపస్‌లో కలకలం రేగింది. మరో ఇద్దరు అధ్యాపకులు కూడా ఇలా విద్యార్థినులకు ప్రేమపాఠాలు చెబుతున్నారు. వారి వేధింపులు శ్రుతి మించడంతో విద్యార్థినులు ఇటీవల ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ ఆచార్య గోపాలరాజుకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఆయన ఇంటర్నల్ కంప్లయింట్ కమిటీ(ఐసిస్)ని విచారణకు ఆదేశించారు. ఈనెల 9న ట్రిపుల్ ఐటీ పరిపాలనాధికారి లక్ష్మణ్.. అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందికి నోటీసులు జారీచేస్తూ క్యాంపస్‌లో ఉన్న అధ్యాపకుల క్వార్టర్స్‌కు విద్యార్థులెవరూ వెళ్లరాదని ఆదేశాలు జారీచేశారు. విచారణ గోప్యంగా జరగడం, ఆ ముగ్గురు అధ్యాపకులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఈ వ్యవహారంపై ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ గోపాలరాజును ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా ‘విద్యార్థినులను అధ్యాపకుల వేధించారన్న ఫిర్యాదుపై విచారణ కమిటీ నివేదిక రావాల్సి ఉంది’ అని చెప్పారు.