Teacher Eligibility Test: ఏమిటీ పరీక్ష?
ABN , Publish Date - Jan 12 , 2026 | 05:46 AM
కొత్తగా బీఈడీ, డీఎడ్ చేసిన విద్యార్థుల స్థాయిలో ఈ వయసులో మేం టెట్‌కు ప్రిపేర్ కాగలమా? దాదాపు 20ఏళ్ల ఉద్యోగం జీవితం తర్వాత ఇప్పుడు పరీక్షలు రాయమంటే ఎలా? 50ఏళ్లు దాటినవారు..
‘టెట్’పై ఉపాధ్యాయుల్లో ఆవేదన
ఎక్కువ మంది 50 ఏళ్లు దాటినవారే
విధులు నిర్వర్తిస్తూ సన్నద్ధమయ్యేదెలా?
గణితం, బయాలజీ, పీఎస్ టీచర్లకు మరీ అవస్థ
వారి సబ్జెక్టులో 20 మార్కులకే ప్రశ్నలు
మిగిలిన రెండు సబ్జెక్టుల నుంచి 40 మార్కులకు
ఇలాగైతే అర్హత ఎలా సాధించాలని ప్రశ్న
ఉత్తీర్ణత మార్కుల్లో తేడాపైనా అభ్యంతరాలు
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
‘‘కొత్తగా బీఈడీ, డీఎడ్ చేసిన విద్యార్థుల స్థాయిలో ఈ వయసులో మేం టెట్‌కు ప్రిపేర్ కాగలమా? దాదాపు 20ఏళ్ల ఉద్యోగం జీవితం తర్వాత ఇప్పుడు పరీక్షలు రాయమంటే ఎలా? 50ఏళ్లు దాటినవారు... కొత్తగా కోర్సులు చదివే విద్యార్థుల సన్నద్ధత ఒకేలా ఉంటుందా?’... టెట్‌పై ఉపాధ్యాయ వర్గాల్లో విస్తృతంగా సాగుతోన్న చర్చ ఇది! ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)పై కొద్ది నెలలుగా ఆందోళన వ్యక్తం చేస్తున్న టీచర్లలో తాజాగా విడుదలైన పరీక్ష ఫలితాలతో ఆందోళన మరింత పెరిగిపోయింది. టెట్‌లో ఇన్ సర్వీసు టీచర్లు 47.82 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇతర అభ్యర్థుల ఉత్తీర్ణత శాతం 39.27 శాతం మాత్రమే. దీంతో పోల్చితే ఉపాధ్యాయుల ఉత్తీర్ణత శాతం మెరుగ్గా ఉన్నట్లు. నిజానికి... మొత్తంగానే ఈసారి టెట్‌లో అర్హత సాధించిన వారి సంఖ్య తగ్గింది. టెట్ పేపర్లు కఠినంగా రావడమే దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. 2018 నుంచి ఇప్పటివరకూ ఐదుసార్లు టెట్ జరగ్గా 50 శాతం లోపు ఉత్తీర్ణత ఇప్పుడే నమోదైంది.
ఉపాధ్యాయుల్లో గుబులు.. సాధారణ అభ్యర్థులతో పోలిస్తే టీచర్లలో టెట్ ఆందోళన ఎక్కువగా ఉంది. 2011కు ముందు ఉద్యోగాలు పొందిన టీచర్లు అందరూ టెట్ అర్హత సాధించాలని గతేడాది సెప్టెంబరులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో తొలిసారి ఇన్‌సర్వీసు టీచర్లకు పరీక్ష రాసేందుకు అవకాశం ఇచ్చారు. అయితే... సైన్స్, గణితం టీచర్లకు ఈ పరీక్ష పెద్ద సమస్యగా మారింది. వీళ్లు సర్వీసులో చేరినప్పటి నుంచీ తమ సబ్జెక్టుల్లో బోధనకే పరిమితమై ఉంటారు. కానీ... టెట్ కోసం ఇతర సబ్జెక్టులూ ప్రిపేర్ కావాల్సిందే. 150 మార్కులకు జరిగే టెట్‌లో సంబంధిత సబ్జెక్టు నుంచి 60 మార్కులకు ప్రశ్నలుంటాయి. భాషా సబ్జెక్టులు, సోషల్ టీచర్లకు ఇది సులభమే కానీ గణితం, బయాలజీ, ఫిజికల్ సైన్స్ టీచర్లకు మాత్రం వారి సబ్జెక్టు నుంచి 20 మార్కులకు, మిగిలిన రెండు సబ్జెక్టుల నుంచి 20 మార్కులు చొప్పున 40 మార్కులకు ప్రశ్నలు ఇస్తారు. బయాలజీ, ఫిజిక్స్ రాసే టీచర్ల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. తమ సబ్జెక్టు ప్రశ్నలు తక్కువగా ఉండి, ఇతర అంశాలు ఎక్కువగా ఉంటే ఉత్తీర్ణత ఎలా సాధించాలని టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సామాజికవర్గాలు ఎందుకు?... సాధారణంగా అడ్మిషన్లు, ఉద్యోగాల్లోనే రిజర్వేషన్లు అమలు చేస్తారు. అయితే... టెట్‌లో సామాజికవర్గాలు, ప్రత్యేక కేటగిరీల ఆధారంగా అర్హత మార్కులను నిర్ణయించారు. 150 మార్కులకు జరిగే టెట్‌లో ఉత్తీర్ణత కోసం జనరల్ అభ్యర్థులు 60 శాతం (90 మార్కులు), బీసీలు 50 శాతం (75 మార్కులు), ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీ్‌స్‌మెన్ దివ్యాంగులు 40 శాతం (60 మార్కులు) సాధించాలి. ఇతర ఏ పరీక్షల్లోనూ ఇలాంటి విధానం లేదని, ఒక్క టెట్‌లోనే ఎందుకని టీచర్లు ప్రశ్నిస్తున్నారు.