Share News

టీడీఆర్‌ బాండ్లను బలవంతంగా రుద్దొద్దు

ABN , Publish Date - Apr 15 , 2026 | 05:46 AM

రోడ్డు విస్తరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం అవసరమైన భూములు, ఆస్తులు సేకరించే సమయంలో వాటి యజమానులపై టీడీఆర్‌ బాండ్లను బలవంతంగా రుద్దడానికి వీల్లేనది హైకోర్టు తేల్చిచెప్పింది.

టీడీఆర్‌ బాండ్లను బలవంతంగా రుద్దొద్దు

  • బాండ్లు తీసుకోవాలా వద్దా అనేది..భూసేకరణలో ఆస్తులు కోల్పోతున్న వారిష్టం

  • వాళ్లు నిరాకరిస్తే నగదు పరిహారం చెల్లించాల్సిందే

  • పరిహారం లెక్కించి పిటిషనర్లకు చెల్లించండి

  • పురపాలక శాఖ అధికారులకు హైకోర్టు ఆదేశం

అమరావతి, ఏప్రిల్‌ 14 (ఆంధ్రజ్యోతి): రోడ్డు విస్తరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం అవసరమైన భూములు, ఆస్తులు సేకరించే సమయంలో వాటి యజమానులపై టీడీఆర్‌ బాండ్లను బలవంతంగా రుద్దడానికి వీల్లేనది హైకోర్టు తేల్చిచెప్పింది. టీడీఆర్‌ బాండ్లు అనేవి ఐచ్ఛికం మాత్రమేనని, వాటిని బలవంతంగా కట్టబెట్టడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఆస్తులు కోల్పోతున్నవారు టీడీఆర్‌ బాండ్లు తీసుకోవడానికి నిరాకరిస్తే.. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించడమే ఏకైక మార్గమని పేర్కొంది. ప్రస్తుత కేసులో రోడ్డు విస్తరణలో ఆస్తులు కోల్పోతున్న పిటిషనర్లు.. బాండ్లు తీసుకొనేందుకు నిరాకరిస్తూ కోర్టును ఆశ్రయించారని గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో వారు భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం కోరుతున్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని తెలిపింది. మార్కెట్‌ ధరను నిర్ణయించడంతో పాటు 2013 భూసేకరణ చట్టం నిబంధనల ప్రకారం పరిహారాన్ని లెక్కించి పిటిషనర్లకు చెల్లించాలని అధికారులను ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్‌ ఇటీవల తీర్పు ఇచ్చారు. ఒంగోలు నగరంలోని ట్రంక్‌ రోడ్డు విస్తరణ కోసం పలు ఆస్తులను సేకరించాలని నగరపాలక సంస్థ అధికారులు నిర్ణయించారు.


ఈ క్రమంలో పలువురికి నోటీసులు జారీ చేశారు. పరిహారం కింద అధికారులు ఇవ్వజూపిన టీడీఆర్‌ బాండ్లు స్వీకరించేందుకు తాము నిరాకరించామని, భూసేకరణ చట్టంలో నిర్దేశించిన విధంగా నగదు పరిహారం చెల్లించేవరకు తమ ఆస్తుల విషయంలో జోక్యం చేసుకోకుండా అధికారులను నిలువరించాలని కోరుతూ.. కొల్లిపల్లి సుస్మిత్‌కుమార్‌, మరికొందరు వేర్వేరుగా హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి ఇటీవల విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫున న్యాయవాది షేక్‌ ఆసిఫ్‌ వాదనలు వినిపిస్తూ... టీడీఆర్‌ బాండ్లు తీసుకోవాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నారన్నారు. వాదనలు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. బాండ్లు తీసుకోవాలని అధికారులు ఒత్తిడి చేయడాన్ని తప్పుబట్టారు. ఆస్తులు కోల్పోతున్నవారు టీడీఆర్‌ బాండ్లు తీసుకోవడానికి నిరాకరించినప్పుడు.. 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించి భూమిని సేకరించడం తప్ప మరో మార్గం లేదని అధికారులకు స్పష్టం చేశారు.

Updated Date - Apr 15 , 2026 | 05:46 AM