సామాజిక బాధ్యతతోనే మహానాడును కుదించాం
ABN , Publish Date - May 18 , 2026 | 04:55 AM
తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే మహానాడు కార్యక్రమాన్ని ఈసారి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి హైబ్రిడ్ విధానంలో నిర్వహిస్తామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు చెప్పారు.
హైబ్రిడ్ విధానంలో నిర్వహిస్తాం: పల్లా
గాజువాక, మే 17(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే మహానాడు కార్యక్రమాన్ని ఈసారి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి హైబ్రిడ్ విధానంలో నిర్వహిస్తామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు చెప్పారు. గాజువాకలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఇంధన సంరక్షణ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రధానమంత్రి మోదీ పిలుపు మేరకు మహానాడు నిర్వహణపై కీలక నిర్ణయాలు తీసుకున్నామన్నారు. ఏటా నిర్వహించే మహానాడుకు లక్షలాది మంది కార్యకర్తలు, అభిమానులు హాజరవుతుంటారని, ఈ ఏడాది అదేస్థాయిలో నెల్లూరులో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినా, ప్రధాని పిలుపు మేరకు సామాజిక బాధ్యతగా ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని హైబ్రిడ్ విధానంలో మహానాడు నిర్వహిస్తున్నామన్నారు. కార్యకర్తల భాగస్వామ్యాన్ని తగ్గించకుండా, రాష్ట్రంలోని 1,848 క్లస్టర్లలో భారీ ఎల్‌ఈడీ స్ర్కీన్‌లు ఏర్పాటుచేసి, అమరావతిలోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగే మహానాడు కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తామన్నారు. మహానాడులో పార్టీ భవిష్యత్తు కార్యాచరణ, అభివృద్ధి, దేశ ప్రగతి, యువతకు ఉపాధి అవకాశాలు, రాష్ట్ర పునర్నిర్మాణం వంటి ముఖ్య అంశాలపై నేతల ప్రసంగాలు ఉంటాయన్నారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆలోచన మేరకు పార్టీ నిర్మాణంలో 40 శాతం యువ నాయకత్వానికి అవకాశాలు కల్పిస్తామన్నారు.