టీడీపీ లీగల్ సెల్ రాష్ట్ర నేత ఈడ్పుగంటి సస్పెన్షన్
ABN , Publish Date - Jun 16 , 2026 | 03:59 AM
టీడీపీ లీగల్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఈడ్పుగంటి శ్రీనివా్‌సబాబు పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే బడేటి ..
ఏలూరు, జూన్ 15(ఆంధ్రజ్యోతి): టీడీపీ లీగల్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఈడ్పుగంటి శ్రీనివా్‌సబాబు పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే బడేటి చంటి సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ‘ఏలూరు జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఆయన కుటుంబ సభ్యులపై ఈడ్పుగంటి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన వైసీపీతో కోవర్టు రాజకీయాలను నెరుపుతున్నట్లు మా దగ్గర ఆధారాలున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశాం’ అని బడేటి ప్రకటించారు. కాగా, సోమవారం ఉదయం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తన అనుచరులతో న్యాయవాది ఈడ్పుగంటి శ్రీనివాస బాబు ఇంటిపై దాడికి ప్రయత్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఎమ్మెల్యేలు కామినేని, చంటి సర్దిచెప్పడం, పార్టీ కేంద్ర కార్యాలయం జోక్యంతో ప్రభాకర్ శాంతించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, న్యాయవాది ఈడ్పుగంటిపై టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో బైండోవర్ కేసులు నమోదు చేశారు. న్యాయవాదిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మరోవైపు ఈడ్పుగంటి సతీమణి పద్మ సోమవారమే ఏలూరు సెకండ్ ఏజేఎ్‌ఫసీఎం కోర్టులో పిటిషన్ వేయడంతో ఈడ్పుగంటిని కోర్టులో హాజరు పరిచారు. ఆయనను విడుదల చేస్తూ జడ్జి ఆదేశాలు జారీ చేశారు.