Share News

మిల్లర్ల సంఘం నాయకత్వంపై చర్చ

ABN , Publish Date - Mar 29 , 2026 | 05:46 AM

రాష్ట్ర రైస్‌ మిల్లర్ల అసోసియేషన్‌కు కొత్త నాయకత్వం ఎన్నిక విషయంలో నడుస్తున్న ఆధిపత్య పోరుపై టీడీపీ పెద్దల దగ్గర చర్చ జరిగింది.

మిల్లర్ల సంఘం నాయకత్వంపై చర్చ

  • కాకినాడ జిల్లా అధ్యక్షుడికి టీడీపీ మద్దతు

  • ‘ఆంధ్రజ్యోతి’ కథనంతో రైస్‌ మిల్లర్లలో కలకలం

అమరావతి, మార్చి 28(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రైస్‌ మిల్లర్ల అసోసియేషన్‌కు కొత్త నాయకత్వం ఎన్నిక విషయంలో నడుస్తున్న ఆధిపత్య పోరుపై టీడీపీ పెద్దల దగ్గర చర్చ జరిగింది. ‘ద్వారంపూడి పెత్తనానికి చెక్‌’ శీర్షికన శనివారం ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన కథనంపై ఆ పార్టీ కీలక నేతలు ఆరా తీశారు. కొన్ని దశాబ్దాలుగా రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ వైసీపీకి చెందిన ద్వారంపూడి కుటుంబమే మిల్లర్లపై పెత్తనం చెలాయిస్తూ వస్తోంది. కాకినాడ పోర్టును గుప్పిట్లో పెట్టుకుని రేషన్‌ బియ్యం అక్రమ ఎగుమతులు, రాష్ట్రవ్యాప్తంగా మిల్లర్లకు ప్రభుత్వం నుంచి సీఎంఆర్‌ ధాన్యం కేటాయింపులు వంటి విషయాల్లో ద్వారంపూడి వర్గానికే ఎక్కువ ప్రయోజనాలు చేకూరుస్తున్నారనే ఆరోపణలున్నాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటంతో.. రాష్ట్ర రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌కు నూతన అధ్యక్షుడిని ఎన్నుకోవాలనే ప్రతిపాదనను మిల్లర్లలోని ఒక వర్గం తెరపైకి తీసుకొచ్చింది. ద్వారంపూడి కుటుంబ ఆగడాలు నిలువరించేందుకు కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న మిల్లర్‌ను అదే పదవిలో కొనసాగిస్తూ... రాష్ట్ర అధ్యక్షుడిగా చేయాలని పట్టుబడుతున్న వర్గానికి పార్టీ పరంగా మద్దతివ్వాలని టీడీపీ పెద్దలు నిర్ణయించినట్లు సమాచారం.

Updated Date - Mar 29 , 2026 | 05:46 AM