ట్విట్టర్ కాదు.. మీడియా ముందుకు రండి: ఉమ
ABN , Publish Date - May 18 , 2026 | 06:17 AM
తాడేపల్లి ప్యాలెస్‌లో కూర్చుని ట్విట్టర్ రాజకీయాలు చేయడం వైసీపీ నేతలకు అలవాటైందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు.
గొల్లపూడి(విజయవాడ), మే 17(ఆంధ్రజ్యోతి): తాడేపల్లి ప్యాలెస్‌లో కూర్చుని ట్విట్టర్ రాజకీయాలు చేయడం వైసీపీ నేతలకు అలవాటైందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. విజయవాడ శివారు గొల్లపూడిలోని టీడీపీ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా అబద్ధాలు, అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఐసీయూలో పెట్టారన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టిస్తుంటే వాస్తవాలను అంగీకరించే పరిస్థితిలో ఆ పార్టీ లేదని విమర్శించారు. కేవలం 23 నెలల్లోనే రాష్ట్రానికి రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురావడమే కాకుండా, 24 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. పేదల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం ప్రారంభించిన అన్న క్యాంటీన్లు 8.6 కోట్ల మందికి భోజనం అందించాయని తెలిపారు. ఐదేళ్లపాటు గుంతలు కూడా పూడ్చలేని వైసీపీ నేతలు ఇప్పుడు మాట్లాడటం హాస్యాస్పదమన్నారు.