Share News

మాపైనే పోస్టులు పెడతావా!.. చంపేస్తాం!

ABN , Publish Date - Apr 10 , 2026 | 04:24 AM

మాపైనే సోషల్‌ మీడియాలో పోస్టులు పెడతావా!.. నిన్ను చంపేస్తాం’ అని టీడీపీ సోషల్‌ మీడియా కార్యకర్తను వైసీపీ నాయకులు బెదిరించారు.

మాపైనే పోస్టులు పెడతావా!.. చంపేస్తాం!

  • టీడీపీ సోషల్‌ మీడియా కార్యకర్తకు వైసీపీ బెదిరింపులు

  • పోలీసులకు ఫిర్యాదు చేసిన టీడీపీ నాయకులు

ఎర్రగొండపాలెం, ఏప్రిల్‌ 9(ఆన్‌లైన్‌): ‘మాపైనే సోషల్‌ మీడియాలో పోస్టులు పెడతావా!.. నిన్ను చంపేస్తాం’ అని టీడీపీ సోషల్‌ మీడియా కార్యకర్తను వైసీపీ నాయకులు బెదిరించారు. దీనిపై టీడీపీ నాయకులు గురువారం మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈనెల 7వ తేదీన హైదరాబాద్‌లోని ‘ఆంధ్రజ్యోతి’ ప్రధాన కార్యాలయం ఎదుట వైసీపీ నాయకుల ఆందోళన సందర్భంగా ఎర్రగొండపాలెం ఎమ్యెల్యే చంద్రశేఖర్‌ను పోలీసులు తోసివేస్తున్నట్లు సామాజిక మాద్యమాల్లో వచ్చిన వీడియోను ఎర్రగొండపాలెంకు చెందిన టీడీపీ సోషల్‌ మీడియా కార్యకర్త హజారుద్దీన్‌ షేర్‌ చేశారు. దీంతో ఎమ్మెల్యే చంద్రశేఖర్‌ అనుచరులు దొండేటి నాగేశ్వరరెడ్డి, ఒద్దుల లక్ష్మిరెడ్డి, చెట్టె వెంకటేశ్వరరెడ్డి ఫోన్‌ చేసి ‘ఎమ్మెల్యేపై పోస్టులు పెడతావా!.. నిన్ను చంపేస్తాం’ అని బెదిరించారని హజారుద్దీన్‌ గురువారం సీఐ కె.అజయ్‌కుమార్‌, ఎస్‌ఐ దేవకుమార్‌లకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపి కేసు నమోదు చేస్తామని ఎస్‌ఐ తెలిపారు. హజారుద్దీన్‌ వెంట ఏఎంసీ చైర్మన్‌ చేకూరి సుబ్బారావు, టీడీపీ మండల అధ్యక్షుడు పోట్ల గోవింద్‌ తదితరులు ఉన్నారు. హజారుద్దీన్‌కు రక్షణ కల్పించాలని వారు సీఐని కోరారు.

Updated Date - Apr 10 , 2026 | 04:24 AM