Share News

మండలిలో తొండి!

ABN , Publish Date - Feb 27 , 2026 | 02:38 AM

‘కల్తీ నెయ్యి’పై ప్రభుత్వం తరఫున దేవదాయ మంత్రి ప్రకటన చేయడమా? లేక... వైసీపీ వైపు నుంచి లఘు చర్చకు అనుమతించడమా? ఏది ముందు జరగాలి? దీనిపై గురువారం శాసన మండలిలో హోరాహోరీగా వాదనలు జరిగాయి.

మండలిలో తొండి!

  • చైర్మన్‌ వైఖరిపై టీడీపీ మండిపాటు

  • ఏకపక్షంగా చేశారని ఆరోపణ

  • కల్తీ నెయ్యిపై ‘చర్చ’లో రచ్చ రచ్చ

  • వైసీపీ ఇవ్వని నోటీసు ఇచ్చారనే ‘భావన’

  • లఘు చర్చ ప్రారంభించేందుకు అవకాశం

  • నోటీసు ఇవ్వలేదని అధికారుల ధ్రువీకరణ

  • ప్రభుత్వం వైపు ప్రకటనకు నిరాకరించిన చైర్మన్‌

  • లేఖ చూపించినా.. అది ‘రాంగ్‌’ అని తోసివేత

  • తనకు తెలియకుండా జారీ అయ్యిందని వెల్లడి

  • మండలిలో అధికార, విపక్షాల వాదోపవాదాలు

  • అరుపులు, కేకల హోరుతో దద్దరిల్లిన మండలి

  • ఎలాంటి చర్చా లేకుండానే నేటికి వాయిదా

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

‘కల్తీ నెయ్యి’పై ప్రభుత్వం తరఫున దేవదాయ మంత్రి ప్రకటన చేయడమా? లేక... వైసీపీ వైపు నుంచి లఘు చర్చకు అనుమతించడమా? ఏది ముందు జరగాలి? దీనిపై గురువారం శాసన మండలిలో హోరాహోరీగా వాదనలు జరిగాయి. మండలి చైర్మన్‌ మోషేన్‌ రాజు ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారని, సభా నియమాలను పక్కకు తోసేసి వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారని తెలుగుదేశం సభ్యులు మండిపడుతున్నారు. చైర్మన్‌ మోషేన్‌రాజు వైసీపీ సభ్యులు ఇవ్వని నోటీసును ఇచ్చినట్లుగా భావించడం... ప్రభుత్వం ప్రకటన చేసేందుకు అనుగుణంగా సభ్యులకు సమాచారం అందించాలని అసెంబ్లీ సెక్రటేరియట్‌ జారీ చేసిన పత్రాన్ని ‘నో... అది రాంగ్‌. నా అనుమతి లేదు’ అని కరాఖండీగా తేల్చేయడం వివాదాస్పదమైంది. గురువారం శాసన మండలిలో ‘కల్తీ నెయ్యి’ అంశంపై స్వల్పకాలిక చర్చకు చైర్మన్‌ మోషేన్‌ రాజు అనుమతించారు. వైసీపీ సభ్యుడు పి.చంద్రశేఖర్‌ రెడ్డి మాట్లాడేందుకు అవకాశమిచ్చారు. అయితే... స్వల్పకాలిక చర్చలో ఏ అంశంపై మాట్లాడాలన్నా ముందుగా నోటీసు ఇవ్వాలి. దీనిపై వైసీపీ నోటీసు ఇవ్వలేదని అసెంబ్లీ సెక్రటేరియట్‌ వర్గాలు తెలిపాయి. అయినప్పటికీ... వైసీపీ నోటీసు ఇచ్చినట్లుగానే భావించి, ఆ పార్టీ సభ్యుడికి మాట్లాడే అవకాశమివ్వడంపై టీడీపీ తీవ్రంగా స్పందించింది. ఇది అంతటితో ఆగలేదు. ఇక్కడ మరో నాటకీయ పరిణామమూ చోటు చేసుకుంది.


ఆ సమయంలో... ప్రభుత్వం తరఫున కల్తీ నెయ్యిపై స్టేట్‌మెంట్‌ ఇచ్చేందుకు దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అప్పటికే లేచి నిల్చున్నారు. ప్రభుత్వం ఏ అంశంపైన అయినా ప్రకటన చేసేందుకు ముందస్తు నోటీసు ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ... అందుకు సంబంధించిన అనుబంధ/సమాచార పత్రాలను సభ్యులకు అందుబాటులో ఉంచాలి. ఇందుకు అసెంబ్లీ సెక్రటేరియట్‌ అనుమతి పత్రం జారీ చేస్తుంది. గురువారం కల్తీ నెయ్యిపై ప్రభుత్వం తరఫున ప్రకటనకు సంబంధించి ఇలాంటి పత్రమే జారీ అయ్యింది. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి లేచి నిలుచుని ఉండగా... మండలి సిబ్బంది ఆ ప్రకటనకు సంబంధించిన పత్రాలను సభ్యులకు అందించే ప్రక్రియ కూడా ప్రారంభమైంది. అయినప్పటికీ... చైర్మన్‌ మోషేన్‌ రాజు వైసీపీ సభ్యుడు చంద్రశేఖర్‌ రెడ్డికి ‘లఘు చర్చ’ ప్రారంభించే అవకాశమివ్వడంపై టీడీపీ సభ్యులు విస్మయం వ్యక్తం చేశారు. ‘ఇది మీరు ఇచ్చిన సమాచారమే’ అని శాసనసభా వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్‌ పదేపదే చెప్పినప్పటికీ... ‘అది నా అనుమతి లేకుండా జారీ అయ్యింది’ అంటూ చైర్మన్‌ మోషేన్‌ రాజు తేల్చి చెప్పారు. దీంతో ఒక దశలో పయ్యావుల కేశవ్‌, మోషేన్‌ రాజు మధ్య తీవ్ర వాదనలు జరిగాయి. బుధవారం అసెంబ్లీలో జరిగిన పరిణామాలను కూడా అధికార పక్షం గుర్తు చేసింది. కల్తీ నెయ్యిపై శాసనసభలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రకటన చేశారు. దీనికి ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వలేదు. ఆ అవసరమూ లేదు.


నిబంధనల ప్రకారం... సంబంధిత పత్రాలను మాత్రం సభ ముందుంచారు. ఈ విషయాన్నే గురువారం మండలిలో పయ్యావుల గుర్తు చేశారు. అక్కడొక రూల్‌, ఇక్కడొక రూల్‌ ఏమిటన్నదే టీడీపీ సభ్యుల ప్రశ్న! కల్తీ నెయ్యిపై తొలుత ప్రభుత్వం తరఫున ప్రకటన చేసేందుకు అనుమతించాలని... ఆ తర్వాత దీనిపై ఎన్ని గంటలైనా చర్చకు సిద్ధంగా ఉన్నామని చెప్పినా చైర్మన్‌ మోషేన్‌ రాజు పట్టించుకోలేదు. వైసీపీ ఇవ్వని నోటీసును ఇచ్చినట్లుగా భావించి ‘లఘు చర్చ’కు అనుమతించడం, ప్రభుత్వం తరఫున ప్రకటనకు నిరాకరించడానికే పరిమితమయ్యారు. ‘‘స్వల్పకాలిక చర్చలో స్టేట్‌మెంట్‌ ఇచ్చే అవకాశం మంత్రికి ఉండదు. జవాబు మాత్రమే ఇవ్వాలి. మీరు వేరే ఫార్మాట్‌లో రండి’’ అని చెప్పారు. అలాంటప్పుడు స్టేట్‌మెంట్‌ కాపీలు సిద్ధం చేయాలని ఎందుకు లేఖ రాశారని పయ్యావుల ప్రశ్నించగా... ‘నా అనుమతి లేకుండా ఆ లేఖ సిద్ధం చేశారు’ అని చైర్మన్‌ పేర్కొన్నారు.


సంప్రదాయానికి భిన్నంగా...: సభావ్యవహారాల కమిటీ(బీఏసీ)లో నిర్ణయించిన ప్రకారమే కల్తీ నెయ్యిపై లఘు చర్చకు అనుమతించానంటూ చైర్మన్‌ చేస్తున్న వాదననూ టీడీపీ సభ్యులు తప్పు పడుతున్నారు. ‘‘లఘు చర్చపై బీఏసీలో నిర్ణయం తీసుకోవడం నిజమే. కానీ... గురువారం దీనిపై ఎవరూ నోటీసు ఇవ్వలేదు. ఒకవేళ ఇచ్చినా... సంబంధిత అంశంపై సభ్యుల అవగాహన కోసం మంత్రి ప్రకటన చేయడం, ఆ పత్రాలు సిద్ధం చేయాలని అసెంబ్లీ సెక్రటేరియట్‌ కోరడం సంప్రదాయం. శాసనసభలో, మండలిలో ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ. దీనికి అనుగుణంగానే మంత్రి రామనారాయణ రెడ్డి స్టేట్‌మెంట్‌ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఆ పత్రాలు సిద్ధం చేయాలని అసెంబ్లీ సెక్రటేరియట్‌ నుంచి లేఖ కూడా జారీ అయ్యింది. కానీ... అది తనకు తెలియదని చైర్మన్‌ చెప్పడం సరికాదు. మరోవైపు... గురువారం వైసీపీ సభ్యులు ఎలాంటి నోటీసు ఇవ్వకున్నా లఘు చర్చ ప్రారంభించేందుకు అవకాశమివ్వడం మరీ అన్యాయం’’ అని టీడీపీ సభ్యులు ఆక్రోశిస్తున్నారు. ఇక... మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అసెంబ్లీ కార్యదర్శిని బెదిరించి స్టేట్‌మెంట్‌ కాపీలను తయారు చేయించామని ఆరోపించడం సభావ్యవహారాలపై ఆయన అవగాహన లేమిని చాటుతోందని టీడీపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వాదోపవాదాలు, అధికార-విపక్ష సభ్యుల ఆందోళనలతో మండలిలో గందరగోళం నెలకొంది. దీంతో చర్చ ప్రారంభించకుండానే శుక్రవారానికి వాయిదా పడింది.


స్ట్రాటజీలతో సభను నడపలేం: చైర్మన్‌

అమరావతి, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): స్ట్రాటజీలతో సభను నడపడం కష్టమని మండలి చైర్మన్‌ మోషేన్‌రాజు వ్యాఖ్యానించారు. గురువారం ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్నలు, సమాధానాలు నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయకపోతే.. మిగిలిపోయిన ప్రశ్నలకు మంత్రుల జవాబు ప్రతులను సభ్యులకు అందజేస్తామని స్పష్టం చేశారు. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌పై ప్రశ్న సందర్భంగా అధికార, ప్రతిపక్ష సభ్యుల వాదనలతో సభను కొద్దిసేపు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభం కాగానే సీమ ఎత్తిపోతల విషయంలో టీ-సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు నిజమో కాదో ప్రభుత్వం సమాధానం చెప్పాలని బొత్స డిమాండ్‌ చేశారు. దీనిపై మంత్రులు, టీడీపీ సభ్యులు వాకౌట్‌ ప్లీజ్‌ అని ఎద్దేవా చేశారు. దీంతో అధికార, ప్రతిపక్ష సభ్యుల వాదనతో.. స్ర్టాటజీలతో సభను నడపడం కష్టమని చైర్మన్‌ వ్యాఖ్యానించారు.

Updated Date - Feb 27 , 2026 | 02:43 AM