నీతి ఆయోగ్ ఇచ్చిన ర్యాంకు వైసీపీ పాలనకే!
ABN , Publish Date - Jul 19 , 2026 | 03:25 AM
నీతి ఆయోగ్ విడుదల చేసిన కాంపిటిటివ్‌నెస్ అండ్ ఇన్వె్‌స్టమెంట్ ఫ్రెండ్లీ ఇండెక్స్ నివేదికపై వైసీపీ మీడియా ప్రచురించిన కథనం..
ఈజ్ ఆఫ్ డూయింగ్ కాన్సెప్ట్ రద్దయి 5 ఏళ్లు: నీలాయపాలెం
అమరావతి, జూలై 18(ఆంధ్రజ్యోతి): నీతి ఆయోగ్ విడుదల చేసిన కాంపిటిటివ్‌నెస్ అండ్ ఇన్వె్‌స్టమెంట్ ఫ్రెండ్లీ ఇండెక్స్ నివేదికపై వైసీపీ మీడియా ప్రచురించిన కథనం వారి అజ్ఞానానికి, రాజకీయ కక్ష సాధింపు ధోరణికి అద్దం పడుతోందని ఏపీ బయో డైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ కుమార్ విమర్శించారు. శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో నాడు నంబర్ 1, నేడు నంబర్ 8 శీర్షికతో ప్రజలను తప్పుదోవ పట్టించేలా కథనం ప్రచురించడం అత్యంత బాధ్యతారాహిత్యమని అన్నారు. నీతి ఆయోగ్ విడుదల చేసిన నివేదిక పాత ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్‌ది కాదని, పూర్తిగా కొత్త విధానంలో రూపొందించిన కాంపిటిటివ్‌నెస్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రెండ్లీ ఇండెక్స్ అని విజయకుమార్ వివరించారు. దీనిలో పెట్టుబడులు, పరిశ్రమలు, మౌలిక వసతులు, పాలన, విధానాల అమలు వంటి అనేక అంశాలను సమగ్రంగా పరిశీలించి రాష్ట్రాలకు ర్యాంకులు కేటాయించారని వివరించారు. ఒక నివేదికను మరో నివేదికతో పోల్చి ప్రజలను మభ్యపెట్టడం జగన్ మీడియా దిగజారుడుతనానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే కాన్సెప్ట్‌ను కేంద్రం రద్దు చేసి ఈ సెప్టెంబరు నాటికి ఐదేళ్లు పూర్తవుతుందని తెలిపారు. నీతి ఆయోగ్ ఇప్పుడు ఇచ్చిన ర్యాంకు 2019-24కు సంబంధించిందని విజయకుమార్ స్పష్టం చేశారు.