Share News

ఎన్నిక లాంఛనమే!

ABN , Publish Date - Jun 09 , 2026 | 04:58 AM

ఏపీ నుంచి రాజ్యసభకు టీడీపీ తరఫున ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. సోమవారం ఉదయం అసెంబ్లీకి చేరుకున్న సానా సతీశ్‌, చింతకాయల విజయ్‌, భాష్యం రామకృష్ణ..

ఎన్నిక లాంఛనమే!

  • రాజ్యసభకు టీడీపీ అభ్యర్థుల నామినేషన్లు

  • దాఖలుచేసిన సతీశ్‌, విజయ్‌, భాష్యం రామకృష్ణ

  • ఇప్పటికే నామినేషన్‌ వేసిన జనసేన అభ్యర్థి లింగమనేని

  • నేడు నామినేషన్ల పరిశీలన..

  • ఉపసంహరణకు ఎల్లుండి వరకు సమయం

  • తర్వాత నలుగురూ ఏకగ్రీవంగా గెలిచినట్లు ప్రకటించే చాన్సు

అమరావతి, జూన్‌ 8(ఆంధ్రజ్యోతి): ఏపీ నుంచి రాజ్యసభకు టీడీపీ తరఫున ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. సోమవారం ఉదయం అసెంబ్లీకి చేరుకున్న సానా సతీశ్‌, చింతకాయల విజయ్‌, భాష్యం రామకృష్ణ.. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ఆర్‌.వనితారాణికి నామినేషన్‌ పత్రాలను అందజేశారు. ఒక్కో అభ్యర్థీ రెండేసి సెట్లు వేశారు. వారి పత్రాలపై మంత్రులు, కూటమి ఎమ్మెల్యేలు ప్రతిపాదకులుగా సంతకాలు చేశారు. సానా సతీశ్‌కు ఎమ్మెల్యేలు జీవీ ఆంజనేయులు, కన్నా లక్ష్మీనారాయణ, పంతం నానాజీ, తంగిరాల సౌమ్య.. భాష్యం రామకృష్ణకు మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యేలు బి.రామాంజనేయులు, బొలిశెట్టి శ్రీనివాస్‌, శ్రీరాం తాతయ్య.. చింతకాయల విజయ్‌కు మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్‌, సుందరపు విజయ్‌కుమార్‌, బోడే ప్రసాద్‌ సంతకాలు చేశారు. అసెంబ్లీకి చేరుకోవడానికి ముందు అభ్యర్థులు ముగ్గురూ వెంకటపాలెంలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. రాష్ట్రం నుంచి ఖాళీ అయిన 4 స్థానాలకు జనసేన నుంచి ఇప్పటికే లింగమనేని రమేశ్‌ నామినేషన్‌ వేసిన సంగతి తెలిసిందే. నామినేషన్ల దాఖలుకు సోమవారంతో గడువు ముగిసింది. మంగళవారం వాటిని పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 11 వరకు సమయం ఉంది. నలుగురే బరిలో ఉండడంతో.. వారు ఏకగ్రీవంగా గెలిచినట్లు ఆ తర్వాత ప్రకటిస్తారు. టీడీపీ అభ్యర్థుల నామినేషన్ల దాఖలు కార్యక్రమంలో.. స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణంరాజు, ఎంపీ కేశినేని చిన్ని, కూటమికి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కిలారు రాజేశ్‌, వంగవీటి రాధా కూడా పాల్గొన్నారు. కాగా, నామినేషన్లు వేసిన అనంతరం ముగ్గురు అభ్యర్థులు అసెంబ్లీ ప్రాంగణంలోని జనసేన, బీజేపీ శాసనసభాపక్ష కార్యాలయాలకు వెళ్లారు. వారికి బీజేపీ ఎమ్మెల్యేలు విష్ణుకుమార్‌రాజు, కామినేని శ్రీనివాస్‌, 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్‌ లంకా దినకర్‌ శుభాకాంక్షలు చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌ కూడా శుభాకాంక్షలు తెలిపారు.


రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తాం.. సతీశ్‌, విజయ్‌, రామకృష్ణ

నామినేషన్లు దాఖలు చేసిన అనంతరం ముగ్గురు అభ్యర్థులూ విలేకరులతో మాట్లాడారు. సానా సతీశ్‌ మాట్లాడుతూ.. చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తామన్నారు. అన్ని వర్గాలను పార్టీ సమానంగా చూస్తుందని చెప్పేందుకు తమ ఎంపికే నిదర్శనమని చెప్పారు. గొప్ప దార్శనికుడైన సీఎం చంద్రబాబు ఆశయసాధనలో భాగంగా సహచర రాజ్యసభ సభ్యుల సహకారంతో రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ఉమ్మడిగా కృషి చేస్తానని భాష్యం రామకృష్ణ తెలిపారు. తనకు ఈ అవకాశం కల్పించిన చంద్రబాబు, టీడీపీ జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి లోకేశ్‌లకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఎంపీలనందరినీ కలుపుకొనిపోతానని.. లోకేశ్‌ నిర్వర్తించే విద్యాశాఖకు కేంద్ర పథకాలను అనుసంధానించే అంశంలో కీలకంగా ఉంటానని చెప్పారు. విజయ్‌ మాట్లాడుతూ.. బీసీలకు పార్టీలో మొదటి నుంచీ సముచిత స్థానం లభిస్తోందని.. కార్యకర్తే అధినేత నినాదం కార్యరూపం దాలుస్తోందని చెప్పారు.


విజయ్‌ ఆస్తి కన్నా ఆయన భార్య ఆస్తే ఎక్కువ!

టీడీపీ రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేసిన చింతకాయల విజయ్‌, ఆయన భార్య పేరిట ఉన్న స్థిర చరాస్తుల విలువ రూ.31.58 కోట్లుగా పేర్కొన్నారు. విజయ్‌ పేరుతో సుమారు రూ.7.44 కోట్ల విలువైన స్థిరచరాస్తులు.. ఆయన సతీమణి పేరుతో రూ.24.14 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. విజయ్‌ వద్ద 250 గ్రాముల బంగారం ఉండగా.. ఆయన సతీమణి వద్ద 1.20 కేజీలు బంగారం ఉంది. ఇద్దరికీ కలిపి సుమారు 35 కేజీల వెండి ఉంది. విజయ్‌కు రూ.2.97 కోట్ల రుణాలు ఉండగా.. ఆయన సతీమణికి రూ.13.94 కోట్లు రుణాలు ఉన్నాయి. విజయ్‌పై మంగళగిరి, నర్సీపట్నం పోలీసుస్టేషన్లలో ఆరు కేసులు ఉన్నాయి.

సతీశ్‌ దంపతుల వద్ద 3.23 కేజీల బంగారం!

సతీశ్‌ ఆస్తుల విలువ రూ.23.48 కోట్లు కాగా.. ఆయన సతీమణి ఆస్తుల విలువ రూ.4.32 కోట్లుగా అఫిడవిట్‌లో పేర్కొన్నారు. సతీశ్‌ దంపతుల వద్ద 3.235 కిలోల బంగారం ఉంది. ఆయన భార్య సతీమణి వద్ద 14 క్యారెట్ల డైమండ్లు ఉన్నాయి. ఇద్దరి పేరు మీద సుమారు రూ.2.25 కోట్ల రుణాలు ఉన్నాయి.

రామకృష్ణ చరాస్తుల విలువే 109 కోట్లు

భాష్యం విద్యాసంస్థల అధినేత అయిన రామకృష్ణ చరాస్తుల విలువే రూ.109 కోట్లుగా చూపారు. ఆయన భార్య పేరుతో మరో రూ.28.72 కోట్ల చరాస్తులు ఉన్నాయి. ఈ దంపతుల స్థిరాస్తుల విలువ రూ.101.54 కోట్లుగా అఫిడవిట్‌లో పేర్కొన్నారు. వీరి వద్ద సుమారు 1.70 కిలోల బంగారం, 33 క్యారెట్ల డైమండ్లు, 6.9 కిలోల వెండి ఉన్నాయి. ఈ దంపతుల మొత్తం స్థిరచరాస్తుల విలువ రూ.239 కోట్లుగా ఉంది. రామకృష్ణ పేరుతో రూ.132.43 కోట్ల రుణాలు ఉండగా.. ఆయన సతీమణి పేరుతో రూ.18.41 కోట్ల రుణాలు ఉన్నాయి.

Updated Date - Jun 09 , 2026 | 04:59 AM