సర్‌లో లోపాలు సరిదిద్దండి.. సీఈవోకు టీడీపీ లేఖ
ABN , Publish Date - Jun 23 , 2026 | 05:46 AM
ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ (సర్) కింద జరుగుతున్న ఓటర్ల గణన, మ్యాపింగ్ ప్రక్రియలో పలు సాంకేతిక లోపాలు దొర్లుతున్నాయని తెలుగుదేశం పార్టీ తెలిపింది.
అమరావతి, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ (సర్) కింద జరుగుతున్న ఓటర్ల గణన, మ్యాపింగ్ ప్రక్రియలో పలు సాంకేతిక లోపాలు దొర్లుతున్నాయని తెలుగుదేశం పార్టీ తెలిపింది. వాటిని వెంటనే సవరించాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పర్చూరి అశోక్ బాబు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) వివేక్ యాదవ్‌కు సోమవారం లేఖ రాశారు. ఓటర్ల నమోదు, ఫారాల పంపిణీలో జరుగుతున్న ఇబ్బందులను అందులో ఆయన ప్రస్తావించారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం.. 2026 జూన్ 15 నుంచి బీఎల్‌వోలు పంపిణీ చేస్తున్న ముందస్తు ముద్రిత ఫారాల్లో ఓటరు వివరాలతోపాటు 2002 నాటి మ్యాపింగ్ డేటా కూడా ఉండాలని, అయితే ప్రస్తుతం ఇస్తున్న ఫారాల్లో ఆ పాత డేటా లేదని.. 2025/2026 నాటి సమాచారం మాత్రమే ఉందని తెలిపారు. అఖిల పక్ష సమావేశంలో హమీ ఇచ్చినట్లుగా మ్యాపింగ్ సమాచారాన్ని ఫారాల్లో ముద్రించలేదని, కనీసం ఓటర్లు అడిగినప్పుడు ఆ వివరాలు అందించడానికి బీఎల్‌వోల వద్ద కూడా ఎలాంటి డేటా అందుబాటులో లేదని పేర్కొన్నారు.