వ్యాఖ్యలు ప్రజాస్వామ్య విలువలపై దాడి
ABN , Publish Date - Feb 02 , 2026 | 05:04 AM
సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం ఎంపీలు భగ్గుమన్నారు. అంబటి వ్యాఖ్యలు రాజకీయ విమర్శలు కాదని,
బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే: టీడీపీ ఎంపీలు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1(ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం ఎంపీలు భగ్గుమన్నారు. అంబటి వ్యాఖ్యలు రాజకీయ విమర్శలు కాదని, ప్రజాస్వామ్య విలువలపై జరిగిన దాడి అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విద్వేష రాజకీయాలను ఆంధ్ర ప్రజలు సహించరని పేర్కొన్నారు. ఆదివారం ఏపీ భవన్‌లో ఎంపీలు మీడియాతో మాట్లాడారు. రాజ్యసభ ఎంపీ సానా సతీశ్ మాట్లాడుతూ... ‘తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయింది. ఆ పాపం నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే వైసీపీ నేతలు ఇలాంటి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారు. గతంలో వైఎస్ జగన్ భార్యపై టీడీపీ కార్యకర్త ఒకరు అనుచిత వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు వెంటనే స్పందించి చర్యలు తీసుకున్నారు. అదీ మా సంస్కారం’ అని అన్నారు. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ, ‘వైసీపీ నేతలు రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించి, అలజడి సృష్టించాలని చూస్తున్నారు. గతంలో చంద్రబాబు కుటుంబ సభ్యులను కూడా ఇలాగే అసభ్యంగా దూషించారు. అంబటి వ్యాఖ్యలు సభ్య సమాజం సిగ్గుపడేలా ఉన్నాయి. ఆయన వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. ‘అంబటి రాంబాబు ఒక సీనియర్ నాయకుడిగా, లాయర్‌గా పూర్తిగా విఫలమయ్యారు. కేవలం అరిస్తేనో, బూతులు తిడితేనో నాయకులు అయిపోరు. ఆయన ప్రవర్తన చూసి సమాజం అసహ్యించుకుంటోంది’ అని ఎంపీ బైరెడ్డి శబరి అన్నారు.