జగన్ అక్రమాస్తుల కేసుల సంగతేంటి?
ABN , Publish Date - Aug 06 , 2026 | 04:45 AM
వైసీపీ అధినేత జగన్ అక్రమాస్తులపై సీబీఐ, ఈడీ కేసులు నమోదు చేసి 13 ఏళ్లు గడుస్తున్నా విచారణ ఎందుకు ముందుకు సాగడం లేదని టీడీపీ రాజ్యసభ సభ్యుడు చింతకాయల విజయ్ ప్రశ్నించారు.
13 ఏళ్లయినా కదలడం లేదు
జడ్జీలు బదిలీ అవుతున్నారు
ఇక, తుది తీర్పు ఎప్పటికి?
ఇది.. ఒక వ్యక్తి వ్యవహారం కాదు
ప్రజా విశ్వాసానికి సంబంధించినది
ప్రత్యేక సీబీఐ కోర్టులను బలోపేతం చేయాలి
న్యూఢిల్లీ, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత జగన్ అక్రమాస్తులపై సీబీఐ, ఈడీ కేసులు నమోదు చేసి 13 ఏళ్లు గడుస్తున్నా విచారణ ఎందుకు ముందుకు సాగడం లేదని టీడీపీ రాజ్యసభ సభ్యుడు చింతకాయల విజయ్ ప్రశ్నించారు. ఆయా కేసుల్లో జగన్ సహా ఇతర నిందితులు వేస్తున్న డిశ్చార్జ్ పిటిషన్లను ఇప్పటివరకు వేర్వేరు న్యాయమూర్తులు విచారించారని, కేసుల విచారణ తుది దశకు చేరకముందే వారు బదిలీ అవుతున్నారని తెలిపారు. బుధవారం రాజ్యసభలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పెంపు సవరణ బిల్లుపై జరిగిన చర్చలో విజయ్ మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ అక్రమాస్తుల కేసులను ప్రస్తావించారు. న్యాయవ్యవస్థపై ప్రజలకు పూర్తి భరోసా కలగాలంటే కోర్టులను బలోపేతం చేసి తీర్పులు వేగవంతం చేయాలన్నారు. జగన్‌పై నమోదైన 31 క్రిమినల్ కేసుల్లో డిశ్చార్జ్ పిటిషన్లపైనే 13 ఏళ్లు గడిచిపోతే ట్రయల్ ఎప్పుడు ప్రారంభమవుతుందని, ఆ తర్వాత తుది తీర్పు ఎప్పుడు వెలువడుతుందని ప్రశ్నించారు. ఇది ఒక్క వ్యక్తికి సంబంధించిన అంశమే కాదని.. చట్టపరిపాలనపై ప్రజల విశ్వాసానికి సంబంధించిన విషయమని పేర్కొన్నారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా సకాలంలో విచారణ జరగాలని, ఇలాంటి సుదీర్ఘ జాప్యాల వల్ల న్యాయవ్యవస్థపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతుందన్నారు. సత్వర న్యాయం అందించే దిశగా ఈ-కోర్టులు, ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీని, అమరావతిలో జ్యుడీషియల్ మౌలిక వసతుల కల్పనకు విశేష కృషి చేస్తున్న సీఎం చంద్రబాబు విజన్‌ను విజయ్ ప్రశంసించారు.