విద్యాహక్కు చట్టాన్ని సవరించండి
ABN , Publish Date - Apr 03 , 2026 | 05:46 AM
విద్యా హక్కు చట్టం అమల్లోకి రాకముందే ప్రభుత్వ ఉపాధ్యాయులుగా నియమితులైన వారికి టెట్ ఉత్తీర్ణత నుంచి మినహాయింపు ఇవ్వాలని టీడీపీ ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ విజ్ఞప్తి చేశారు.
లోక్‌సభలో టీడీపీ ఎంపీ లక్ష్మీనారాయణ విజ్ఞప్తి
న్యూఢిల్లీ, ఏప్రిల్ 2(ఆంధ్రజ్యోతి): విద్యా హక్కు చట్టం అమల్లోకి రాకముందే ప్రభుత్వ ఉపాధ్యాయులుగా నియమితులైన వారికి టెట్ ఉత్తీర్ణత నుంచి మినహాయింపు ఇవ్వాలని టీడీపీ ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు రెండేళ్లలో తప్పనిసరిగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్) ఉత్తీర్ణులు కావాలని ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని తెలిపారు. గురువారం లోక్‌సభలో ఆయన మాట్లాడుతూ.. దాదాపు 30 నుంచి 40 ఏళ్ల అనుభవం కలిగిన సీనియర్ ఉపాధ్యాయులు కూడా ఇప్పుడు టెట్ పరీక్ష రాయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించాలంటే 2009నాటి విద్యా హక్కు చట్టంలో తగిన సవరణలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.