Share News

తినే ప్రతి మెతుకూ నెత్తుటి కూడే!

ABN , Publish Date - May 27 , 2026 | 04:15 AM

అధికారం కోసం హత్యలు చేయడం.. ఆధిపత్యం కోసం కుట్రలు పన్నడం.. ఇదే వైఎస్‌ కుటుంబ చరిత్రగా టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి చెప్పారు. జగన్‌ ఈ రోజు రాజభవనాల్లో ఉంటూ..

తినే ప్రతి మెతుకూ నెత్తుటి కూడే!

  • అధికారం కోసం హత్యలు.. ఆధిపత్యం కోసం కుట్రలు

  • ఇదే వైఎస్‌ కుటుంబ చరిత్ర.. అది దేశద్రోహ కుటుంబం

  • బ్రిటిష్‌ వారి తరఫున భారతీయులపై రాజారెడ్డి యుద్ధం

  • సాక్షులను చంపడం ఆయనతోనే మొదలు

  • వివేకా హత్య వరకు అదే కొనసాగింది

  • ఈ నిజాలన్నీ దాచి తామంతా మంచోళ్లమని జగన్‌ నమ్మించాలని చూస్తున్నారు

  • టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి ధ్వజం

అమరావతి, మే 26 (ఆంధ్రజ్యోతి): అధికారం కోసం హత్యలు చేయడం.. ఆధిపత్యం కోసం కుట్రలు పన్నడం.. ఇదే వైఎస్‌ కుటుంబ చరిత్రగా టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి చెప్పారు. జగన్‌ ఈ రోజు రాజభవనాల్లో ఉంటూ గోల్టెన్‌ స్పూన్‌తో తింటున్న ప్రతి మెతుకూ నెత్తుటి కూడేనని స్పష్టం చేశారు. ఆయన ఫ్యాక్షన్‌ బాధితుడు కాదని.. ఆయనే పెద్ద ఫ్యాక్షనిస్టు అని తేల్చిచెప్పారు. మంగళవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తన తాత దేశ స్వాతంత్య్రం కోసం పోరాడారని జగన్‌ చెప్పడం పచ్చి అబద్ధమని, అది చరిత్రను అవమానించడమేనని తెలిపారు. భవిష్యత్‌లో ఆయన తన అబద్ధాల మాయాజాలంతో 1947లో దేశానికి స్వాతంత్య్రం రావడానికి కారణం తన తాతలేనని చెప్పినా ఆశ్చర్యపోనక్కరలేదన్నారు. రాష్ట్ర ప్రజలకు వైఎస్‌ కుటుంబ నిజమైన చరిత్రను తెలియజేయాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పారు. ‘జగన్‌ తాత వైఎస్‌ రాజారెడ్డి తండ్రి పేరు వెంకట్‌రెడ్డి. ఆయనది సింహాద్రిపురం మండలంలోని బలపనూరు. 11 మంది సంతానంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆయన ఆర్థిక అవసరాలను తీర్చుకునేందుకు మతం మారారు. తర్వాత కడప వచ్చి స్థానిక సీఎస్ఐ హైస్కూల్‌ ఫాదర్‌ దగ్గర చిన్న ఉద్యోగంలో చేరారు. అనంతర కాలంలో బళ్లారి కంటోన్మెంట్‌లోని బ్రిటిష్‌ మిలిటరీ బలగాలకు ఎద్దు, ఆవు మాంసాన్ని సరఫరా చేసే కాంట్రాక్టర్‌గా అవతారమెత్తారు.


దేశభక్తులను ఉక్కుపాదంతో అణచివేస్తున్న బ్రిటిష్‌ సైన్యానికి ఆహారాన్ని అందిస్తూ దేశద్రోహానికి పాల్పడిన చరిత్ర వైఎస్‌ కుటుంబానిది. వెంకట్‌రెడ్డి కొడుకు రాజారెడ్డి తండ్రి ప్రోత్సాహంతో బ్రిటిష్‌ సైన్యంలో చేరారు. మద్రాస్‌ రెజిమెంట్‌లో సైనికుడిగా ఉంటూ బ్రిటిష్‌ వారి తరఫున భారతీయులపై యుద్ధం చేసిన చరిత్ర ఆయనది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ప్రాణభయంతో బ్రిటిష్‌ సైన్యం నుంచి పారిపోయి వచ్చిన పిరికిచరిత్ర రాజారెడ్డిది. పారిపోయి వచ్చినందుకు బ్రిటిష్‌ వాళ్లు ఎక్కడ అరెస్టు చేసి శిక్షిస్తారో అన్న భయంతో దేశానికి స్వాతంత్య్రం వచ్చే వరకు సొంత ఊరికి రాకుండా దేశాలు పట్టుకు తిరిగాడు’ అని వివరించారు.


ఆ కుటుంబం చేసిన దారుణాలు...

రైల్వే కోడూరు నియోజకవర్గంలోని మంగంపేట ముగ్గురాయి మైన్స్‌ వ్యవహారంలో వైఎస్‌ కుటుంబం చేసిన దారుణం అంతా ఇంతా కాదని భూమిరెడ్డి చెప్పారు. ‘బీసీ వర్గానికి చెందిన వెంకట నరసయ్య అనే మైన్స్‌ యజమాని తనకు రక్షణగా ఉంటాడని రాజారెడ్డిని పెట్టుబడి లేని భాగస్వామిగా పెట్టుకున్నారు. ఇబ్బడి ముబ్బడిగా డబ్బులు వస్తుండటంతో రాజారెడ్డి ఏకంగా వెంకట నరసయ్య మైన్స్‌ మొత్తాన్ని కబ్జా చేయాలనే దురాశతో 1975లో ఆయన్ను హత్య చేశారు. ఈ కేసుకు సంబంధించి రాజారెడ్డి, ఆయన పెద్ద కొడుకు జార్జిరెడ్డితోపాటు మరో ఆరుగురిపై కడప వన్‌టౌన్‌ పోలీసుస్టేషన్‌లో హత్య కేసు నమోదైంది. వెంకటనరసయ్య హత్యకు 99 శాతం కుట్ర వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిదే. హత్యకు మాట్లాడుకున్న సుపారిని కూడా ఎగ్గొట్టారు. సాక్ష్యా లు లేకుండా చేయడం కోసం ఆ తర్వాత ఆ హత్య చేసిన వ్యక్తిని కూడా చంపేశారు. వైఎస్‌ కుటుంబానికి తాము చేసే హత్యలకు సాక్ష్యాలు లేకుండా చేయడం నాటి నుంచే అలవాటైంది. వివేకా హత్య వరకూ అదే కొనసాగుతోంది’ అని తెలిపారు. వెంకటనరసయ్యకు వారసులు లేరని.. ఉన్న ఒక్కగానొక్క మేనల్లుడు మురళి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని శ్రీకాకుళానికి పారిపోయి టీచర్‌ ఉద్యోగం చేసుకుంటున్నారని.. తాను చెప్పే దాంట్లో ఒక్క అబద్ధమున్నా జగన్‌ స్పందించాలని డిమాండ్‌ చేశారు. ఆ తర్వాతి కాలంలో మురళి నక్సల్స్‌ను ఆశ్రయించడంతో వారు రాజశేఖర్‌రెడ్డిపై హైదరాబాద్‌లో తుపాకీతో కాల్పులు జరిపారని.. రాజశేఖర్‌రెడ్డి తప్పించుకోగా, సచివాలయ ఉద్యోగి ప్రసాద్‌ చనిపోయారని తెలిపారు. ఆ ఘటన జరిగే నాటికి టీడీపీ పుట్టనేలేదన్నారు.


ఈ ఘటన జరిగిన 8 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్‌ పార్టీ పెట్టారని తెలిపారు. ‘ఈ నిజాలన్నీ దాచిపెట్టి మా తాత మంచోడు.. మా నాన్న మంచోడు.. నేను అందరికన్నా మంచోడినని ఎవరిని నమ్మిస్తారు జగన్‌రెడ్డీ.. చేసిన పాపాలను దాచేసుకుని సంబంధం లేని చంద్రబాబుపై మీ నేరాలు,ఘోరాలను నెట్టేయాలని చూడటం మీ క్రిమినల్‌ నైజానికి నిదర్శనం’ అని దుయ్యబట్టారు. ‘కాంగ్రెస్‌ కార్యకర్తలు గజ్జల గంగిరెడ్డి, రామకృష్ణారెడ్డి పోలీసు కాల్పుల్లో మరణిస్తే వారిద్దరినీ నేను, ఈ రోజు మీ పక్కనున్న సతీశ్‌రెడ్డి హత్య చేసినట్లు మీరు తప్పుడు కేసులు బనాయించిన మాట వాస్తవం కాదా’ అని జగన్‌ను భూమిరెడ్డి ప్రశ్నించా రు. గజ్జల గంగిరెడ్డి స్పాట్‌లోనే చనిపోయినా ఆ శవాన్ని పులివెందుల తీసుకొచ్చి నాటి పులివెందుల మేజిస్ట్రేట్‌ కోర్టు న్యాయాధికారిని ప్రలోభపెట్టి తప్పుడు వాంగ్మూలం సృష్టించిన ఘనత జగన్‌రెడ్డిదని చెప్పారు. ఈ విషయాన్ని తాము సాక్షాలతోసహా నిరూపించినా 2012లో గాని ఆమెను సర్వీసు నుంచి తొలగింపజేయలేకపోయామని తెలిపారు’ అని జగన్‌పై భూమిరెడ్డి విరుచుకుపడ్డారు.


చిన్నప్పటి నుంచే హింసావాదం: వర్ల

వైసీపీ అధినేత జగన్‌ ఓ అరాచకవాదని, చిన్ననాటి నుంచే అరాచకాలకు.. హింసావాదానికి అలవాటు పడ్డారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. తన కుటుంబమంతా అహింసావాదులమంటూ అడ్డగోలు అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేసి జగన్‌ బొక్కబోర్లా పడ్డారని అన్నారు. ‘జగన్‌ ఇటీవల పెట్టిన విలేకరుల సమావేశంతో రాజకీయ భస్మాసుర హస్తం పెట్టుకున్నారు. సూది కోసం సోదికి పోతే అన్న సామెతలా ఆయన ఏదో చెప్పబోతే.. ఆయన కుటుంబ రక్తచరిత్ర సీరియల్‌ మాదిరి ఈ రాష్ట్ర ప్రజలకు తెలుస్తోంది. సొంత బాబాయినే కొట్టిన ఘనుడు జగన్‌’ అని ధ్వజమెత్తారు.

Updated Date - May 27 , 2026 | 04:16 AM