MLA Somireddy Chandramohan: సీమకు జగన్ చరిత్రాత్మక ద్రోహం
ABN , Publish Date - Jan 14 , 2026 | 04:01 AM
రాయలసీమ ప్రాజెక్టుల విషయంలో గత వైసీపీ పాలనలో జగన్ అత్యంత దారుణమైన, చరిత్రాత్మకమైన ద్రోహం చేశారని మాజీ మంత్రి, టీడీపీ సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మండిపడ్డారు.
102 సీమ ప్రాజెక్టులు రద్దు చేశారు
అన్నమయ్య డ్యాం కొట్టుకుపోవడం ఆయన పాపమే
అనుమతుల్లేకుండా రాయలసీమ లిఫ్టు పనులు
990 కోట్ల ప్రజాధనం వృఽథా.. సోమిరెడ్డి ఆగ్రహం
‘కండలేరు’ను సందర్శించిన టీడీపీ బృందం
రాపూరు, జనవరి 13 (ఆంధ్రజ్యోతి) : రాయలసీమ ప్రాజెక్టుల విషయంలో గత వైసీపీ పాలనలో జగన్ అత్యంత దారుణమైన, చరిత్రాత్మకమైన ద్రోహం చేశారని మాజీ మంత్రి, టీడీపీ సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మండిపడ్డారు. మంగళవారం నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని కండలేరు జలాశయాన్ని వెంకటగిరి, గూడూరు, సూళ్లూరుపేట ఎమ్మెల్యేలు కురుగొండ్ల రామకృష్ణ, పాశిం సునీల్, నెలవల విజయశ్రీ, టీడీపీ నెల్లూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షులు బీద రవిచంద్ర, పనబాక లక్ష్మిలతో కలిసి సోమిరెడ్డి సందర్శించారు. అనంతరం విలేకరుల సమావేశంలో వైసీపీ వైఫల్యాలను ఎండగట్టారు. ‘జగన్ ముఖ్యమంత్రి కాగానే రాయలసీమలోని 102 సాగునీటి ప్రాజెక్టులను ‘ప్రీ-క్లోజర్’ పేరుతో ఆపేసి, సీమ గొంతు కోశారు. రాష్ట్రవ్యాప్తంగా రద్దు చేసిన 198 ప్రాజెక్టుల్లో సగానికిపైగా సీమలోనే ఉండడం ఆయనకు ఆ ప్రాంతంపై ఉన్న వివక్షకు నిదర్శనం. సీమ ప్రాజెక్టులకు 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం రూ.12,441 కోట్లు ఖర్చు చేస్తే.. 2019-24 మధ్య వైసీపీ హయాంలో రూ.2,011 కోట్లే వ్యయం చేసింది. అన్నిటికీ రివర్స్ టెండరింగ్ అని హోరెత్తించిన జగన్..రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను మాత్రం అధిక ధరలకు మాజీ మంత్రి పెద్దిరెడ్డి కంపెనీకి అప్పగించారు. ఆ పథకానికి అనుమతులు రాకముందే పనులు ప్రారంభించి, కోర్టులకు తప్పుడు అఫిడవిట్లు ఇవ్వడం వల్లే ఎన్‌జీటీ ఈ ప్రాజెక్టును అడ్డుకుంది. కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసమే హడావుడి చేసి రూ.990 కోట్ల ప్రజాధనాన్ని బూడిదలో పోశారు. అన్నమయ్య ప్రాజెక్టు నిర్వహణలో విఫలమై 42 మంది ప్రాణాలు కోల్పోవడానికి జగన్ కారణం కాదా? జగన్ కనీసం చూడడానికి రాలేదు’ అని దుయ్యబట్టారు.