కల్తీ నెయ్యి కాదు... అది విషం
ABN , Publish Date - Feb 04 , 2026 | 04:58 AM
‘టీటీడీ తయారు చేసిన లడ్డూల్లో వైసీపీ ప్రభుత్వం కలిపింది కల్తీ నెయ్యి అని ఇప్పటివరకు పొరపాటు పడ్డాం. కీలక నివేదికలు వచ్చాక దానిని కల్తీ అనే కంటే విషం అనడం సముచితమని అనిపిస్తుంది’ అని మంత్రి సత్యకుమార్ అన్నారు.
ఇంత దారుణానికి వైసీపీ పాల్పడింది: సత్యకుమార్, మనోహర్
తెనాలి, ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి): ‘టీటీడీ తయారు చేసిన లడ్డూల్లో వైసీపీ ప్రభుత్వం కలిపింది కల్తీ నెయ్యి అని ఇప్పటివరకు పొరపాటు పడ్డాం. కీలక నివేదికలు వచ్చాక దానిని కల్తీ అనే కంటే విషం అనడం సముచితమని అనిపిస్తుంది’ అని మంత్రి సత్యకుమార్ అన్నారు. జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లోని చిన్నారులకు ఉచిత కళ్లజోళ్ల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం గుంటూరు జిల్లా తెనాలిలో మంత్రి నాదెండ్ల మనోహర్‌తో కలసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సత్యకుమార్ మాట్లాడుతూ, ‘లడ్డూలో కలిపింది రసాయనాలతో కూడిన విష పదార్థమని తేలడంతో మేము కూడా అవాక్కయ్యం. వైసీపీవాళ్లు మహా పాపానికి ఒడిగట్టారు. కోట్లాది మంది వెంకన్న స్వామి భక్తులను, హిందువుల మనోభావాలను దెబ్బ తీశారు. ఇంకా నిస్సిగ్గుగా కల్తీనే లేదంటూ సీబీఐ కితాబు ఇచ్చిందని బొంకడం క్షమించరాని నేరమే అవుతుంది’ అని మండిపడ్డారు. లడ్డూ ప్రసాదంలో కల్తీ జరగలేదంటూ వైసీపీ నేతలు రోడ్డెక్కుతుంటే జనం దుమ్మెత్తి పోస్తున్న విషయాన్ని పట్టించుకోలేనంత అబద్ధ ప్రచారంలో వైసీపీ నేతలు మునిగిపోయారని మరో మంత్రి మనోహర్ విమర్శించారు. ఒక్కొక్క నివేదిక బయటకు వస్తుంటే నిశ్చేష్టులమవుతున్నామని, ఇంత దారుణానికి వైసీపీ ప్రభుత్వం పాల్పడుతుందని ఊహించనే లేదన్నారు.