మహానాడు వేదికపై 2, 3 రోజుల్లో తుది నిర్ణయం
ABN , Publish Date - May 03 , 2026 | 05:17 AM
తెలుగుదేశం పార్టీ మహానాడును నెల్లూరులో ఎక్కడ నిర్వహించాలన్న విషయాన్ని రెండు, మూడు రోజుల్లో ఖరారు చేయనున్నట్లు మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు.
నెల్లూరు చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహిస్తాం: మంత్రి నారాయణ
రెండవ రోజూ కొనసాగిన స్థల పరిశీలన
నెల్లూరు, మే 2(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ మహానాడును నెల్లూరులో ఎక్కడ నిర్వహించాలన్న విషయాన్ని రెండు, మూడు రోజుల్లో ఖరారు చేయనున్నట్లు మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. సీఎం కార్యక్రమాల సమన్వయకర్త మంతెన సత్యనారాయణ రాజు, వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, ఎమ్మెల్సీ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తదితరులతో కలసి మంత్రి నారాయణ 2వ రోజు శనివారం స్థల పరిశీలనలో పాల్గొన్నారు. కొడవలూరు మండలం చెన్నై-విజయవాడ జాతీయ రహదారికి సమీపంలోని ఇఫ్కో కిసాన్ సెజ్, రేగడచెలిక ప్రాంతాలను పరిశీలించారు. నెల్లూరు నగరాన్ని ఆనుకొని ఉన్న చింతారెడ్డిపాళెం, బలిజపాళెం, వీపీఆర్ విల్లాస్ ప్రాంతాల్లో స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడారు. ‘మూడు రోజుల పసుపు పండుగను (ఈ నెల 27, 28, 29) చరిత్ర గుర్తించుకునే స్థాయిలో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం’ అని పేర్కొన్నారు. మహానాడు నిర్వహణపై నారాయణ ఆసుపత్రి ప్రాంగణంలో మంత్రులు ఫరూక్, ఆనం రామనారాయణరెడ్డి, నారాయణ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నేతలు సమావేశమయ్యారు.