Share News

మహానాడుకు స్థలాల పరిశీలన

ABN , Publish Date - May 02 , 2026 | 04:27 AM

తెలుగుదేశం పార్టీ మహానాడును ఈ ఏడాది నెల్లూరు జిల్లాలో నిర్వహించాలని ఆ పార్టీ అధిష్ఠానం నిర్ణయించిన నేపథ్యంలో అందుకు అనువైన ప్రాంతం కోసం నేతలు పరిశీలన జరుపుతున్నారు.

మహానాడుకు స్థలాల పరిశీలన

  • కిసాన్‌ సెజ్‌, నెల్లూరులో పరిశీలించిన నేతలు

  • అనువైన ప్రదేశంలో ఏర్పాటుపై సమీక్ష

  • నేడు అధికారికంగా ప్రకటించే అవకాశం

నెల్లూరు, మే 1(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ మహానాడును ఈ ఏడాది నెల్లూరు జిల్లాలో నిర్వహించాలని ఆ పార్టీ అధిష్ఠానం నిర్ణయించిన నేపథ్యంలో అందుకు అనువైన ప్రాంతం కోసం నేతలు పరిశీలన జరుపుతున్నారు. ప్రధానంగా రెండు ప్రాంతాలను పరిగణనలోకి తీసుకొని శుక్రవారం పరిశీలించారు. కొడవలూరు మండలం ఇఫ్కో కిసాన్‌ సెజ్‌ ప్రాంగణం, నెల్లూరు రూరల్‌లోని కనుపర్తిపాడు జాతీయ రహదారి సమీపంలో స్థలాలను చూశారు. మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, పొంగూరు నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, సీఎం కార్యక్రమాల సమన్వయకర్త మంతెన సత్యనారాయణరాజు, పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, ఎమ్మెల్సీ రాంభూపాల్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, కాకర్ల సురేశ్‌, కావ్య కృష్ణారెడ్డి, వక్ఫ్‌బోర్డ్‌ చైర్మన్‌ అబ్దుల్‌ అజీజ్‌, నుడా చైర్మన్‌ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, నేతలు పెళ్లకూరు శ్రీనివాసులరెడ్డి, కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి, రూప్‌కుమార్‌ తదితరులు స్థలాలను పరిశీలించారు. ఈ రెండు ప్రాంతాలకు సంబంధించి న మ్యాప్‌లను పరిశీలించి ట్రాఫిక్‌, పార్కింగ్‌కు కలిగే ఇబ్బందులు, రవాణా సదుపాయాలపై చర్చించారు. ఇం దుకు సంబంధించి నివేదికలను టీడీపీ కేంద్ర కమిటీకి పంపారు. పార్టీ కేంద్ర బృందం శనివారం మరోసారి ఈ స్థలాలను పరిశీలించనుంది. అనంతరం సాయంత్రంలోపు మహానాడు ఎక్కడ నిర్వహించనున్నది అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

వైభవంగా మహానాడు: మంత్రి ఆనం

స్థలాల పరిశీలన సందర్భంగా మంత్రి ఆనం మీడియాతో మాట్లాడారు. ‘జిల్లా చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయేలా టీడీపీ మహానాడు కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తాం. మహానాడు నిర్వహణకు అనువైన ప్రదేశాలను కేంద్ర కమిటీకి నివేదించాం. ఈ బృందం మరోసారి పరిశీలించి వేదికను ఖరారు చేస్తుంది. తొలిసారిగా నెల్లూరు జిల్లాలో మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించాలని అధిష్ఠానం నిర్ణయించడం జిల్లా నేతలు, కార్యకర్తల అదృష్టంగా భావిస్తున్నారు. లక్షలాది మందికి సరిపడేలా భారీ బహిరంగ వేదిక, వేలాది వాహనాలకు పార్కింగ్‌ సౌకర్యం, మూడు రోజులపాటు కార్యకర్తలకు రుచికరమైన భోజనం, అతిథులకు తగిన నివాస ఏర్పాట్లు వంటి అన్ని అంశాల్లో ఎక్కడా లోటు లేకుండా సమగ్ర ప్రణాళికతో మహానాడు నిర్వహిస్తాం’ అని ఆనం వివరించారు.

Updated Date - May 02 , 2026 | 04:27 AM