Share News

నిన్నటి చిట్టడవి... నేడు మహా మైదానం

ABN , Publish Date - May 12 , 2026 | 05:44 AM

అడుగు తీసి అడుగు వేయ వీల్లేని దుర్భర ప్రాంతం. దట్టమైన చిట్టడివిని తలపించిన రెండు వేల ఎకరాలకుపైగా విస్తరించిన ఇఫ్కో సెజ్‌ ప్రాంగణంలో ఇప్పుడు ఆసాంతం మారిపోయింది.

నిన్నటి చిట్టడవి... నేడు మహా మైదానం

  • శరవేగంగా మహానాడు పనులు

  • వందల వాహనాల శబ్దాలతో హోరెత్తుతున్న ఇఫ్కో సెజ్‌

  • రేపు నెల్లూరులో ‘కమిటీల’ సమావేశం

నెల్లూరు, మే 11(ఆంధ్రజ్యోతి): అడుగు తీసి అడుగు వేయ వీల్లేని దుర్భర ప్రాంతం. దట్టమైన చిట్టడివిని తలపించిన రెండు వేల ఎకరాలకుపైగా విస్తరించిన ఇఫ్కో సెజ్‌ ప్రాంగణంలో ఇప్పుడు ఆసాంతం మారిపోయింది. టీడీపీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టే మహానాడు నిర్వహణకు ఇక్కడ భూమి పూజ జరిగిన రోజు నుంచీ ఈ ప్రదేశం రూపురేఖలు మారడం మొదలయింది. వందలాది వాహనాలు రేయింబవళ్లు పనిచేయడం మొదలు పెట్టాయి.

ఐదు రోజుల్లో రూపురేఖలు మార్పు

మహానాడు ప్రాంగణాన్ని సిద్ధం చేసే బాధ్యతను టీడీపీ జిల్లా కేడర్‌ భుజాన వేసుకుంది. 6న భూమి పూజ మొదలైన క్షణం నుంచి వీపీఆర్‌ కంపెనీకి చెందిన వందలాది భారీ యంత్రాలు మైదానాన్ని చదును చేసే పనిలో దిగాయి. ఫలితంగా కేవలం ఐదు రోజుల వ్యవధిలోనే చిట్టడవిలాంటి ఈ ప్రదేశం సువిశాల మైదానంగా మారిపోయింది. సోమవారం సాయంత్రానికి జంగిల్‌ క్లియరెన్స్‌, నేల చదును కార్యక్రమాలు దాదాపుగా పూర్తి అయ్యాయి. మహానాడు ప్రాంగణంలో అంతర్గత రోడ్ల నిర్మాణానికి మార్కింగ్‌ జరుగుతోంది. మంగళవారం నుంచి రోడ్లు నిర్మించే పనులు మొదలు కానున్నాయి. మహానాడు ప్రాంగణం కోవూరు నియోజకవర్గంలో ఉంది. ఇది వేమిరెడ్డి దంపతుల సొంత నియోజకవర్గం కావడంతో నిర్మాణ పనులు వీరి పర్యవేక్షణలో జరుగుతున్నాయి. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిలతోపాటు మంత్రులు పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నాయకులు ప్రతి రోజూ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

రేపు మహానాడు కమిటీల సమావేశం

మహానాడు నిర్వహణకు మొత్తం 19 కమిటీలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీల సభ్యులంతా బుధవారం, 13న నెల్లూరులో సమావేశం కానున్నారు. మహానాడు ప్రధాన వేదిక మొదలు, వంటశాల, డైనింగ్‌, చంద్రబాబు, లోకేశ్‌, ఇతర ముఖ్య నాయకులకు మహానాడు ప్రాంగణంలో ఏర్పాటు చేయనున్న విడిది, తదితర అంశాలపై చర్చించనున్నారు. 200 ఎకరాల్లో మహానాడు ప్రధాన సభా ప్రాంగణాన్ని నిర్మించాలని నిర్ణయించినట్లు ప్రాథమిక సమాచారం. ఏర్పాట్లపై సమగ్ర నిర్ణయం 13న జరిగే మహానాడు కమిటీల సమావేశంలో తీసుకోనున్నారు.

జాతీయ రహదారి పసుపుమయం

నలుదిక్కుల నుంచి మహానాడుకు తరలివచ్చే అతిరథ మహారథులు, కార్యకర్తలు, అభిమానులకు భారీస్థాయిలో స్వాగతం పలికేలా జాతీయ రహదారి మొత్తం పసుపుమయం చేయాలని మహానాడు ఆహ్వాన కమిటీ నిర్ణయించింది. దీనిపై ఆదివారం జరిగిన సమావేశంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు బీద రవిచంద్ర నాయకులకు దిశానిర్దేశం చేశారు. చెన్నై-విజయవాడ హైవేపై తడ నుంచి టంగుటూరు వరకు స్వాగత బ్యానర్లు, ఫ్లెక్సీలతో జాతీయ రహదారిని పసుపు మయం చేయాలని నిర్ణయించారు.

Updated Date - May 12 , 2026 | 05:44 AM