Share News

ఆన్‌లైన్‌లో మహానాడు!

ABN , Publish Date - May 16 , 2026 | 03:45 AM

తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నేతలకు అతిపెద్ద పండుగ... ‘మహానాడు’! ఈ కార్యక్రమాన్ని ఈసారి వర్చువల్‌గా ఆన్‌లైన్‌లో నిర్వహించాలని నిర్ణయించారు.

ఆన్‌లైన్‌లో మహానాడు!

  • యుద్ధ పరిస్థితుల్లో పొదుపు మంత్రం

  • రూ.5 కోట్ల వరకు ఇంధనం ఆదా

  • 27, 28న హైబ్రిడ్‌ విధానంలో నిర్వహణ

  • పార్టీ కేంద్ర కార్యాలయంలో పొలిట్‌బ్యూరో, కేంద్ర, రాష్ట్ర కమిటీ సభ్యులు

  • నియోజకవర్గాల నుంచి ‘ఆన్‌లైన్‌’లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ఎంపీలు

  • 1848 క్లస్టర్ల పరిధిలోని నేతలూ వర్చువల్‌గానే!

  • ఇప్పటికే నెల్లూరులో మొదలైన ఏర్పాట్లు

  • ఈసారి భారీగా నిర్వహించాలని నిర్ణయం

  • పది వేలకుపైగా వాహనాలు వచ్చే అవకాశం

  • ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది సరికాదనే మార్పు

అమరావతి, మే 15 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నేతలకు అతిపెద్ద పండుగ... ‘మహానాడు’! ఈ కార్యక్రమాన్ని ఈసారి వర్చువల్‌గా ఆన్‌లైన్‌లో నిర్వహించాలని నిర్ణయించారు. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ‘ఇంధన పొదుపు’ పాటించేందుకు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం... ఈనెల 26, 27, 28 తేదీల్లో నెల్లూరు సమీపంలోని ఇఫ్కో సెజ్‌ భూముల్లో ‘మహానాడు’ నిర్వహించాల్సి ఉంది. ఎప్పట్లాగే దీనిని అంగరంగ వైభవంగా జరిపేందుకు ఇప్పటికే చర్యలు మొదలుపెట్టారు. కానీ... తాజా పరిస్థితుల నేపథ్యంలో ‘మహానాడు’పై శుక్రవారం సాయంత్రం పార్టీ సీనియర్‌ నేతలతో సీఎం చంద్రబాబు టెలీ కాన్ఫరెన్సు నిర్వహించారు. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నేపథ్యంలో దేశం మొత్తం పొదుపు చర్యలు చేపడుతోందని, అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా పొదుపు చర్యలకు శ్రీకారం చుట్టిందని గుర్తు చేశారు. పార్టీపరంగానూ పొదుపు చర్యలను అమలు చేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. అందులో భాగంగా ‘మహానాడు’ను వర్చువల్‌గా నిర్వహించాలని నిర్ణయించామని తెలిపారు. దీని ప్రకారం... ఈనెల 27, 28 తేదీల్లో మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో హైబ్రిడ్‌ విధానంలో మహానాడు జరుగుతుంది.


పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగే కార్యక్రమానికి ఆహ్వానితులుగా.. పార్టీ పొలిట్‌బ్యూరో, కేంద్ర, రాష్ట్ర కమిటీ సభ్యులు, అధికార ప్రతినిధులు హాజరవుతారని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. నియోజకవర్గాల నుంచి ఆన్‌లైన్‌ విధానంలో జరిగే మహానాడు కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ఎంపీలు, నియోజకవర్గ స్థాయి నేతలు పాల్గొంటారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1848 క్లస్టర్ల పరిధిలోని నాయకులు, కార్యకర్తలు ఆయా క్లస్టర్ల నుంచే ఆన్‌లైన్‌లో హాజరవుతారు. ప్రతి క్లస్టర్‌ వద్ద స్ర్కీన్లు ఏర్పాటు చేసి, 500 మంది కార్యకర్తలు వీక్షించేలా ఏర్పాట్లు చేస్తారు. తీర్మానాలు సహా ఇతర అన్ని అంశాల్లోనూ మహానాడు విధానాలనే పాటిస్తామని పల్లా వివరించారు. అలాగే.. ఈనెల 18, 19, 20 తేదీల్లో జరగాల్సిన మినీ మహానాడుతోపాటు 23, 24వ తేదీల్లో పార్లమెంటు నియోజకవర్గ స్థాయి మహానాడును కూడా రద్దు చేశారు.


రూ.10 కోట్ల వరకు ఆదా..

‘మహానాడు’ అంటే టీడీపీ కార్యకర్తలకు ఓ పెద్ద వేడుక. అంగరంగ వైభవంగా నిర్వహించే పార్టీ పండుగ. శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తలు పెద్దఎత్తున తరలి వస్తారు. తెలంగాణ నుంచి భారీగా ప్రాతినిధ్యం ఉంటుంది. తీర్మానాలు, చర్చలు, సభలు, సాంస్కృతిక కార్యక్రమాలు, విందుతో మూడు రోజులపాటు భారీ సందడి. ‘మహానాడు’ నిర్వహణ ఖర్చు కూడా అదే స్థాయిలో ఉంటుంది. ఇతరత్రా వ్యయాలు మినహాయిస్తే... ఇంధన వ్యయమే దాదాపు 5 కోట్లు ఉంటుందని అంచనా. శ్రీకాకుళం నుంచి నెల్లూరుకు సుమారు 740 కిలోమీటర్ల దూరం! అటు..కర్నూలు నుంచి సుమారు 320 కిలోమీటర్లు! కనీసం 10వేల వాహనాల్లో ‘మహానాడు’కు జనం తరలి వస్తారని అంచనా. ఈ వాహనాల రాకపోకల కోసం సుమారు రూ.5 కోట్ల వరకు ఇంధన ఖర్చే అవుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. మహానాడు మూడు రోజుల నిర్వహణకు మరో రూ.5 కోట్ల పైచిలుకు వరకు ఖర్చయ్యే అవకాశం ఉంది. ఈ లెక్కన మహానాడును ఆన్‌లైన్‌లో నిర్వహించడం ద్వారా సుమారు రూ.10 కోట్ల వరకు ఆదా అయినట్లేనని పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతోపాటు... ‘మన దేశం-మన బాధ్యత’ అని చంద్రబాబు ఇచ్చిన పిలుపులో భాగస్వాములై, ఇంధన పొదుపుతో జాతీయ స్థాయిలో సానుకూల సంకేతాలు పంపినట్లవుతుందని అభిప్రాయపడ్డాయి.


గతంలో 2సార్లు ఆన్‌లైన్‌లో..

గతంలోనూ రెండుసార్లు మహానాడును ఆన్‌లైన్‌లో నిర్వహించారు. పార్టీ చరిత్రలో తొలిసారిగా.. 2020లో కొవిడ్‌ కారణంగా ఆన్‌లైన్‌లో నిర్వహించారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో నేతలంతా తమ నివాసాల నుంచే ఆన్‌లైన్‌లో పాల్గొనగా.. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి చంద్రబాబు మహానాడును నడిపించారు. 2021లో కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ కారణంగా వరుసగా రెండో ఏడాది కూడా ఆన్‌లైన్‌లోనే మహానాడు నిర్వహించారు. ఇప్పుడు... ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా మూడోసారి ఆన్‌లైన్‌లో నిర్వహించాలని నిర్ణయించారు.

Updated Date - May 16 , 2026 | 03:49 AM