మహానాడుకు 4 స్థలాల ఎంపిక
ABN , Publish Date - May 04 , 2026 | 04:28 AM
తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహణకు జిల్లాలో నాలుగు చోట్ల స్థలాలు ఎంపిక చేసి నాయకత్వానికి పంపామని దేవదాయ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు.
తుది నిర్ణయం రాష్ట్ర కమిటీదే: ఆనం
నెల్లూరు, మే 3 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహణకు జిల్లాలో నాలుగు చోట్ల స్థలాలు ఎంపిక చేసి నాయకత్వానికి పంపామని దేవదాయ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. రాష్ట్ర కమిటీ తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఆదివారం నెల్లూరులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో టీడీపీ ఆత్మకూరు నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా లోకేశ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత నిర్వహిస్తున్న తొలి మహానాడు కావడంతో గుర్తుండిపోయేలా నిర్వహిస్తామన్నారు. దీనికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తామని, కార్యక్రమం విజయవంతానికి గ్రామ గ్రామానా పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని పిలుపిచ్చారు. ఆత్మకూరు నియోజకవర్గాన్ని పసుపుమయం చేస్తామన్నారు. జిల్లాలో విస్తృతంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని.. రూ.3653 కోట్లతో బద్వేలు నుంచి నెల్లూరు వరకు 108.73 కిలోమీటర్ల రోడ్డు విస్తరణ జరుగుతోందని.. ఆత్మకూరు నియోజకవర్గంలోని మర్రిపాడు, అనంతసాగరం, కలువాయి, చేజెర్ల మండలాలతోపాటు మనుబోలు, పొదలకూరు, వెంకటాచలం మండలాల మీదుగా రోడ్డు విస్తరణ జరుగుతున్నట్లు తెలిపారు. సమావేశంలో టీడీపీ నేత గిరినాయుడు, మంత్రి కుమార్తె కైవల్య తదితరులు పాల్గొన్నారు.