Share News

‘మహానాడు’.. టీడీపీకి ఓ ఎమోషన్‌!

ABN , Publish Date - May 27 , 2026 | 04:54 AM

పసుపు పండుగ ‘మహానాడు’ అంటే టీడీపీకి ఒక ఎమోషన్‌ వంటిదని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు అన్నారు.

‘మహానాడు’.. టీడీపీకి ఓ ఎమోషన్‌!

  • మొదటిసారి వర్చువల్‌గా పెద్దఎత్తున నిర్వహణ

  • సరైన మార్గనిర్దేశంతో తెలుగుదేశాన్ని రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా నిలబెట్టుకుందాం

  • టీడీపీ నేతలు, కార్యకర్తలకు చంద్రబాబు పిలుపు

  • ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలతో టెలీకాన్ఫరెన్స్‌

  • 1851 క్లస్టర్లలో ఈసారి పసుపు పండుగ: సీఎం

అమరావతి, మే 26(ఆంధ్రజ్యోతి): పసుపు పండుగ ‘మహానాడు’ అంటే టీడీపీకి ఒక ఎమోషన్‌ వంటిదని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు అన్నారు. మంగళవారం సాయంతరం టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు, గ్రామస్థాయి కార్యకర్తలతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. మహానాడును మొదటిసారి వర్చువల్‌గా పెద్దఎత్తున నిర్వహించుకుంటున్నామని పేర్కొన్నారు. తెలుగువారంతా ఆసక్తిగా చూసే కార్యక్రమం మహానాడు అని, ఈ వేదిక నుంచి మనం ఏం సందేశం ఇస్తామోనని ప్రజలు ఎదురుచూస్తారని తెలిపారు. గతంలో కొవిడ్‌ సమయంలోనూ పరిస్థితులు అనుకూలించక ఈ కార్యక్రమాన్ని డిజిటల్‌ విధానంలో నిర్వహించామని, మళ్లీ ఇప్పుడు కొన్ని పరిస్థితుల దృష్ట్యా వర్చువల్‌గా చేస్తున్నామని తెలిపారు. 1851 క్లస్టర్ల పరిధిలో ఈసారి పసుపు పండుగ నిర్వహించుకుంటున్నామని, పార్టీ ఎదుగుదలకు, కార్యకర్తలు నాయకులుగా ఎదగడానికి ఈ క్లస్టర్‌ విధానం పనికొస్తుందన్నారు. ఈ సారి ‘స్త్రీశక్తి’ థీమ్‌తో మహానాడు జరుగుతుందని, క్లస్టర్ల వారీగా క్షేత్రస్థాయిలో నిర్వహించే మహానాడులో రాష్ట్రస్థాయి నాయకులు కూడా పాల్గొంటారని తెలిపారు. ‘మహానాడులో సరైన మార్గనిర్దేశం చేసుకుందాం. వాటిని అమలు చేసుకుందాం. రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా తెలుగుదేశం పార్టీని నిలబెట్టుకుందాం’ అని చంద్రబాబు పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. ప్రజాప్రతినిధులు, బాధ్యత గల పదవుల్లో ఉన్న ప్రతిఒక్కరిలో జవాబుదారీ తనం ఉండాలని, అప్పుడే ప్రజలు మనల్ని విశ్వసిస్తారని చెప్పారు. కార్యకర్తలు అన్నివిధాలా సాధికారత సాధించాలని ఆకాంక్షించారు. ఎన్టీఆర్‌కు ఘన నివాళులు అర్పించడంతో పాటు రాష్ట్రాభివృద్ధికి పునరంకితమయ్యేలా మహానాడును నిర్వహించుకుందామన్నారు.

Updated Date - May 27 , 2026 | 04:55 AM