Share News

నేటి నుంచే పసుపు పండగ

ABN , Publish Date - May 27 , 2026 | 04:50 AM

తెలుగు తమ్ముళ్ల పసుపు పండుగ ‘మహానాడు’ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీనిని బుధ, గురువారాల్లో రెండ్రోజులపాటు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా 1851 క్లస్టర్లలో హైబ్రిడ్‌ విధానంలో నిర్వహించనున్నారు.

నేటి నుంచే పసుపు పండగ

  • 2 రోజులపాటు హైబ్రిడ్‌ విధానంలో.. వచ్చే ఎన్నికలకు రోడ్‌మ్యాప్‌

  • లోకేశ్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఇదే తొలి మహానాడు

  • స్త్రీశక్తిని చాటేలా నేతల ప్రసంగాలు

  • రాష్ట్రవ్యాప్తంగా 1851 క్లస్టర్లలో వేడుక

  • ప్రతి రోజూ ఆరేసి గంటలు చర్చలు

  • 20 తీర్మానాలను ఆమోదించే చాన్సు

  • ఇందులో 10 ఏపీవి, 4 తెలంగాణవి

  • ఇంకో 4 ఉమ్మడివి.. అండమాన్‌ నుంచీ 1

  • ప్రత్యేకంగా రాజకీయ తీర్మానం

  • క్లస్టర్లు, నియోజకవర్గాలు, మండల కేంద్రాల్లో భారీ ఎల్‌ఈడీ స్ర్కీన్లు

  • కేంద్ర కార్యాలయంతో ఇవన్నీ అనుసంధానం

అమరావతి, మే 26 (ఆంధ్రజ్యోతి): తెలుగు తమ్ముళ్ల పసుపు పండుగ ‘మహానాడు’ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీనిని బుధ, గురువారాల్లో రెండ్రోజులపాటు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా 1851 క్లస్టర్లలో హైబ్రిడ్‌ విధానంలో నిర్వహించనున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ మహానాడు వేదికగా.. వచ్చే ఎన్నికలకు రోడ్‌మ్యాప్‌ సిద్ధం చేసుకోవడంపై టీడీపీ నాయకత్వం దృష్టి పెట్టనుంది. దీంతోపాటు స్థానిక సంస్థల ఎన్నికలకు శ్రేణులను సమాయత్తం చేసేందుకు ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోనున్నారు. మంత్రి లోకేశ్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత జరుగుతున్న తొలి మహానాడు ఇదే. ఈ నేపథ్యంలో ఆయన ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాగా.. ఈ మహానాడులో మొత్తం 20 తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు. ఏపీ నుంచి 10, తెలంగాణ నుంచి 4, ఉమ్మడివి 4, అండమాన్‌ నుంచి 1, కీలకమైన రాజకీయ తీర్మానం ఉంటాయి. ఈ ఏడాది మహానాడును స్త్రీశక్తి థీమ్‌తో నిర్వహించనున్న నేపథ్యంలో ప్రసంగాలన్నీ మహిళా శక్తి కేంద్రీకృతంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. స్త్రీశక్తిలో భాగంగా.. మహిళా సంక్షేమం కోసం పార్టీ చేసిన కృషి, చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై చర్చించనున్నారు.


గతానికి భిన్నంగా..

ఈసారి మహానాడును గతంలో ఎన్నడూ నిర్వహించని రీతిలో హైబ్రిడ్‌ విధానంలో నిర్వహిస్తున్నారు. ఇటు భౌతికంగా.. అటు వర్చువల్‌గా ఈ కార్యక్రమం జరుగనుంది. గత మహానాడులకు ఏమాత్రం తగ్గకుండా శ్రేణుల్లో ఫుల్‌ జోష్‌ నింపడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. మండుటెండలను సైతం లెక్క చేయకుండా తెలుగుదేశం సత్తాను డిజిటల్‌ వేదికగా నిరూపించడానికి, ప్రపంచ రికార్డులను సాధించే దిశగా మహానాడు అడుగులు వేస్తోంది. కాక్రోచ్‌ జనతా పార్టీ లాంటి అంశాలపై కూడా చర్చించబోతోంది. ఆరోగ్యకరమైన సోషల్‌ మీడియా యాక్టివిటీని ప్రోత్సహించే విధంగా చర్చలు ఉండబోతున్నాయి. 65 మంది వక్తలు 2 రోజుల్లో ప్రసంగిస్తారు. వేదికపై పొలిట్‌బ్యూరో సభ్యులు మాత్రమే ఉంటారు, వేదిక దిగువన జాతీయ, రాష్ట్ర పార్టీ కమిటీల సభ్యులు ఉంటారు. వీరిలో 90 మందిని నియోజకవర్గాలకు అబ్జర్వర్లుగా పంపారు. రాష్ట్రవ్యాప్తంగా 1875 క్లస్టర్లు ఉండగా వాటిలో సౌకర్యంగా లేనివాటిని మినహాయించి 1851 క్లస్టర్లలో మహానాడు నిర్వహిస్తున్నారు.

దేశం కోసం.. డిజిటల్‌ అడుగులు..

పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల్లో దేశపౌరులు తమ ఖర్చులు తగ్గించుకోవాలన్న ప్రధాని మోదీ పిలుపును టీడీపీ అందిపుచ్చుకుంది. ఆయన ప్రకటనకు ముందు నెల్లూరు వేదికగా మహానాడును మూడ్రోజులపాటు భారీఎత్తున నిర్వహించుకునేందుకు ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుంది. అయితే ఆ తర్వాత దేశ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని మూడ్రోజుల కార్యక్రమాన్ని రద్దుచేసింది. రెండ్రోజులు డిజిటిల్‌ వేదికగా హైబ్రిడ్‌ విధానంలో నిర్వహించాలని నిర్ణయించింది. నేటి డిజిటల్‌ విప్లవంలో టీడీపీ నిర్వహించే హైబ్రిడ్‌ మహానాడు విప్లవాత్మకంగా నిలువబోతోంది. సుమారు 2వేల క్లస్టర్ల రీచ్‌తో ప్రాంతీయ పార్టీగా రికార్డు సాధించే దిశగా టీడీపీ ముందుకు వెళ్తోంది.


దేశమంతా ఔరా అనేలా: పల్లా శ్రీనివాస్‌

మహానాడు టీడీపీకి, కార్యకర్తలకు అత్యంత ప్రతిష్ఠాత్మక కార్యక్రమమని.. దీనిని దేశమంతా ఔరా అనేలా హైబ్రిడ్‌ విధానంలో నిర్వహించి డిజిటల్‌ విప్లవానికి నాంది పలుకబోతున్నామని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. ఎన్టీఆర్‌ జయంతిని పురస్కరించుకుని అత్యంత వైభవంగా మూడ్రోజులు కార్యక్రమాలు జరిపేవారిమని గుర్తుచేశారు. ఈసారి పశ్చిమాసియాలో సంక్షోభం దృష్ట్యా.. డిజిటల్‌ మహానాడును నిర్వహించాలని నిర్ణయించామన్నారు.

నేడు, రేపు కార్యక్రమాలివీ..

మహానాడు తొలిరోజు బుధవారం ఉదయం 9 గంటలకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు సీఎం చంద్రబాబు కేంద్ర కార్యాలయానికి వస్తారు. సభాప్రాంగణంలో పార్టీ జెండాను ఆవిష్కరించి ఎన్టీఆర్‌కు నివాళులర్పిస్తారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు పల్లా ప్రారంభోపన్యాసంతో కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత పార్టీ పద్దుల వివరాలు సమర్పిస్తారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగిస్తారు. స్త్రీశక్తి, కార్యకర్తే అధినేత, పేదల సేవలో వంటి అంశాలపై నేతల ప్రసంగాలు ఉంటాయి. వీటిలో భాగంగా వివిధ తీర్మానాలు ప్రవేశపెట్టి ఆమోదిస్తారు. సాయంత్రం 6 గంటలకు మొదటి రోజు కార్యక్రమాన్ని ముగిస్తారు. రెండో రోజు గురువారం(28న) ఎన్టీఆర్‌ జయంతిని పురస్కరించుకుని పార్టీ నాయకులందరూ నివాళులర్పిస్తారు. తెలుగుజాతి విశ్వఖ్యాతి, గతంలో పార్టీ చేసిన పోరాటాలు, అన్నదాతకు అండగా, రాష్ట్రానికి కేంద్రం అందించే సాయం, నా దేశం-నా బాధ్యత, ఆధ్యాత్మికాంధ్ర, మౌలిక సదుపాయాల కల్పన, శాంతిభద్రతలు, విధ్వంసం నుంచి వికాసం వైపు ప్రయాణం, సంపద సృష్టి వంటి అంశాలపై చర్చించి తీర్మానాలను ఆమోదిస్తారు. చివరిగా రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెడతారు. ఈ రెండ్రోజుల్లో ప్రతి రోజూ 6 గంటల పాటు పార్టీ తీర్మానాలు, రాష్ట్రాభివృద్ధిపై చర్చలు జరుగుతాయి. ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు డిజిటల్‌ మహానాడు జరుగుతుంది. తొలి రోజు మాత్రం 9 గంటలకు నేతలంతా కేంద్ర కార్యాలయానికి వస్తారు. రాష్ట్రవ్యాప్తంగా క్లస్టర్లలో ఏర్పాటు చేసిన భారీ ఎల్‌ఈడీ స్ర్కీన్లు, ఆన్‌లైన్‌ ద్వారా కేంద్ర కార్యాలయానికి అనుసంధానమై.. పార్టీ నాయకులు, కార్యకర్తలంతా వర్చువల్‌గా పాల్గొంటారు. చంద్రబాబు ముగింపు ప్రసంగంతో రెండ్రోజుల మహానాడు ముగుస్తుంది.


10 రోజులుగా కేంద్ర కార్యాలయం నుంచి పర్యవేక్షణ

1851 క్లస్టర్లలో నిర్వహిస్తున్న హైబ్రిడ్‌ మహానాడు ఏర్పాట్లను రాష్ట్ర అధ్యక్షుడు పల్లా పర్యవేక్షిస్తున్నారు. 10 రోజులుగా టీడీపీ కార్యాలయంలో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేసి.. క్లస్టర్ల నాయకులు, కార్యకర్తలను అప్రమత్తం చేస్తున్నారు.

క్లస్టర్‌లో కార్యకర్తలు.. కేంద్ర కార్యాలయంలో అగ్రనాయకులు

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పరిమిత సంఖ్యలో నేతలతో మహానాడు కార్యక్రమం నిర్వహిస్తారు. క్లస్టర్లు, నియోజకవర్గాలు, మండల కేంద్రాల్లో భారీ ఎల్‌ఈడీ స్ర్కీన్లు ఏర్పాటు చేసి దీనిని అనుసంధానిస్తారు. నేతలతోపాటు ఎంపిక చేసిన నియోజకవర్గాల నుంచి పార్టీ కార్యకర్తలతోనూ మాట్లాడిస్తారు. మహానాడును హైబ్రిడ్‌ విధానం ద్వారా చేపట్టడం ద్వారా ఆదా అయిన సొమ్మును పార్టీ అభివృద్ధి కోసం ఖర్చు చేస్తారు. లక్షలాది మందికి ఈసారి మహానాడు కనెక్టయ్యే అవకాశం ఉంది. నేరుగా పార్టీ సిద్ధాంతాలపై మరింత చర్చ జరిగేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. హైబ్రిడ్‌ మహానాడుపై టీడీపీ కంటే ఇతర పార్టీల్లోనే ఎక్కువ ఆసక్తి నెలకొనడం గమనార్హం.

Untitled-2 copy.jpg

Updated Date - May 27 , 2026 | 04:52 AM