మహానాడులో 19 తీర్మానాలు
ABN , Publish Date - May 20 , 2026 | 03:49 AM
పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సంక్షోభ ప్రభావం రాష్ట్రంపైనా పడే అవకాశం ఉందని టీడీపీ భావిస్తోంది.
ఏపీ నుంచి 15.. తెలంగాణ నుంచి 4
యుద్ధ ప్రభావంపై ప్రత్యేక తీర్మానం.. సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కొంటూనే.. ప్రజలను చైతన్యపరచాలని నిర్ణయం
వైసీపీ విధ్వంస విధానాలపైనా తీర్మానం.. రేపు పొలిట్‌బ్యూరో భేటీ
అమరావతి, మే 19(ఆంధ్రజ్యోతి): పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సంక్షోభ ప్రభావం రాష్ట్రంపైనా పడే అవకాశం ఉందని టీడీపీ భావిస్తోంది. దానిని ఎదుర్కొనేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తూనే ప్రజలనూ చైతన్యం చేయాలని, ఆ దిశగా మహానాడులో ప్రత్యేక తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. మంగళవారం ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మహానాడు తీర్మానాల కమిటీ సమావేశమైంది. యనమల రామకృష్ణుడు నేతృత్వంలో 17 మంది సభ్యులతో కూడిన ఈ కమిటీ పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించింది. ఈ నెల 27, 28 తేదీల్లో పార్టీ కేంద్ర కార్యాలయంలో హైబ్రిడ్ విధానంలో జరిగే 44వ మహానాడులో ఏపీ నుంచి సుమారు 15 తీర్మానాలు, తెలంగాణకు సంబంధించి 4 తీర్మానాలు ప్రవేశపెట్టాలని ప్రాథమికంగా నిశ్చయించారు. సంస్థాగత వ్యవహారాలతోపాటు సూపర్ సిక్స్ పథకాల అమలు, యువతకు ప్రోత్సాహం, రాష్ట్రానికి కేంద్రం మద్దతుపైన తీర్మానాలను ప్రవేశపెడతారు. యుద్ధ ప్రభావంపై రాష్ట్రం ఎదుర్కొనే ఆర్థికభారం, తదితర అంశాలను సవివరంగా పేర్కొంటూ ప్రత్యేక తీర్మానం ఉంటుంది. రాష్ట్రంలో వైసీపీ అభివృద్ధి నిరోధకంగా మారిందని, ఆ పార్టీ ధోరణిని ప్రజలకు సవివరంగా తెలియజెబుతూ మహానాడులో తీర్మానం చేయాలని టీడీపీ నేతలు నిర్ణయించారు. మహానాడు చివరి రోజైన 28న రాజకీయ తీర్మానం ప్రవేశపెడతారు. తీర్మానాల కమిటీ బుధవారం మరోసారి సమావేశమవుతుంది. తీర్మానాలపై మరోసారి చర్చించి వాటికి తుది రూపు ఇస్తుంది.
కమిటీ భేటీలో మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, నక్కా ఆనంద్‌బాబు, కూన రవికుమార్, ఎమ్మెల్సీ పంచుమర్తి అనూరాధ, టీడీపీ నాయకులు కృష్ణయ్య, నీలాయపాలెం విజయకుమార్, పర్చూరి అశోక్‌బాబు, గురజాల మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు. కాగా.. మహానాడుకు ముందు టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీ కావడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో పొలిట్‌బ్యూరో సమావేశం గురువారం జరగనుంది. జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగే ఈ భేటీలో మహానాడులో ప్రవేశపెట్టాల్సిన తీర్మానాలకు ఆమోదముద్ర వేస్తారు.