Share News

రాష్ట్రాభివృద్ధి, భవిష్యత్తు కార్యాచరణపైనే చర్చ

ABN , Publish Date - May 21 , 2026 | 04:40 AM

మహానాడులో 19 తీర్మానాలను ప్రవేశపెట్టనున్నట్లు టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి తెలిపారు. మహానాడులో ప్రవేశపెట్టే తీర్మానాలపై యనమల రామకృష్ణుడు ...

రాష్ట్రాభివృద్ధి, భవిష్యత్తు కార్యాచరణపైనే చర్చ

  • మహానాడులో 19 తీర్మానాలు.. ఏపీవి 13.. తెలంగాణవి 4

  • అండమాన్‌ నుంచి ఒకటి.. ఒక రాజకీయ తీర్మానం: సోమిరెడ్డి

అమరావతి, మే 20(ఆంధ్రజ్యోతి): మహానాడులో 19 తీర్మానాలను ప్రవేశపెట్టనున్నట్లు టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి తెలిపారు. మహానాడులో ప్రవేశపెట్టే తీర్మానాలపై యనమల రామకృష్ణుడు నేతృత్వంలోని తీర్మానాల కమిటీ రెండు రోజులపాటు చర్చించిందని, పొలిట్‌బ్యూరో సభ్యుల ఆమోదం తర్వాత మహానాడులో ప్రవేశపెడతామని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి, భవిష్యత్తు కార్యాచరణపై మహానాడులో మొత్తం 19 తీర్మానాలను ప్రవేశపెట్టబోతున్నామని సోమిరెడ్డి తెలిపారు. ఏపీకి సంబంధించి 13, తెలంగాణకు సంబంధించి 4, అండమాన్‌ అలయన్స్‌కు సంబంధించి ఒకటి, ఒక రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మహానాడును ఈ నెల 27,28 తేదీల్లో పార్టీ కేంద్ర కార్యాలయంలో హైబ్రిడ్‌ (వర్చువల్‌, ఫిజికల్‌) పద్ధతిలో నిర్వహించనున్నట్లు చెప్పారు. లోకేశ్‌ జాతీయ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరుగుతున్న తొలి మహానాడు ఇదే కావడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొందని, ఈ కార్యక్రమం మొత్తం ఆయన నేతృత్వంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. పార్టీ కార్యాలయంలో జరిగే మహానాడు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, జాతీయ, రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొంటారని తెలిపారు. క్షేత్రస్థాయిలో క్లస్టర్లలో స్ర్కీన్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ప్రతి క్లస్టర్‌లో పార్టీ ప్రెసిడెంట్లు, క్లస్టర్‌, గ్రామ పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు, మండల కమిటీ సభ్యులు కలిపి సుమారు 300 మంది ఒకేచోట కూర్చుని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగే మహానాడు కార్యక్రమాల్ని లైవ్‌లో చూడవచ్చన్నారు.

Updated Date - May 21 , 2026 | 04:40 AM