Share News

ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఎన్టీఆర్‌

ABN , Publish Date - May 29 , 2026 | 04:24 AM

ప్రజల గుండెల్లో ఎన్టీఆర్‌ చిరస్థాయిగా నిలిచిపోతారని టీడీపీ నేత, ఎమ్మెల్యే కూన రవికుమార్‌ అన్నారు. 44 ఏళ్ల టీడీపీ చరిత్ర సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయం, సాంకేతిక ప్రగతికి మారు పేరుగా నిలిచిందని పేర్కొన్నారు.

ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఎన్టీఆర్‌

  • చంద్రబాబు విజన్‌తో తెలుగువారి ఖ్యాతి విశ్వవ్యాప్తం

  • తెలుగుజాతి-విశ్వఖ్యాతిపై మహానాడులో తీర్మానం

అమరావతి, మే 28(ఆంధ్రజ్యోతి): ప్రజల గుండెల్లో ఎన్టీఆర్‌ చిరస్థాయిగా నిలిచిపోతారని టీడీపీ నేత, ఎమ్మెల్యే కూన రవికుమార్‌ అన్నారు. 44 ఏళ్ల టీడీపీ చరిత్ర సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయం, సాంకేతిక ప్రగతికి మారు పేరుగా నిలిచిందని పేర్కొన్నారు. మహానాడులో రెండో రోజు ‘‘తెలుగుజాతి- విశ్వఖ్యాతి’’ అనే అంశంపై సభలో ఆయన తీర్మానం ప్రవేశపెట్టగా పలువురు నేతలు మద్దతుగా ప్రసంగించారు. చంద్రబాబు స్థితప్రజ్ఞత, లోకేశ్‌ పోరాట పటిమతో ముందుకు సాగి స్వర్ణాంధ్ర విజన్‌ సాధిద్దామని పిలుపునిచ్చారు. 2029 ఎన్నికల్లో కూటమి గెలుపు కోసం త్యాగాలు చేస్తామని ఏకగ్రీవంగా తీర్మానం చేస్తున్నామన్నారు. చంద్రబాబు తన విజన్‌తో నేడు తెలుగువారి ఖ్యాతి విశ్వవ్యాప్తం చేస్తున్నారన్నారు. అమరావతి అంటే భవనాలు కాదని, అది తెలుగువారి ఆత్మగౌరవం, తెలుగుజాతి కల అని అన్నారు. చంద్రబాబు ఉన్న చోట అభివృద్ధి, అభివృద్ధి ఉన్న చోట పరిశ్రమలు, పరిశ్రమలు ఉన్నచోట ఉద్యోగాలు వస్తాయని అన్నారు.

గాండ్రించే తెలుగుబిడ్డ ఎన్టీఆర్‌

ఇది తెలుగు గడ్డ, గాండ్రించే తెలుగు బిడ్డ అని ఎన్టీఆర్‌ నాటిన ఆత్మగౌరవ స్పూర్తి నేటికీ ప్రతి తెలుగు హృదయంలో వెలుగొందుతోందని ఏపీ పౌరసరఫరాల డైరక్టర్‌ మోకా ఆనంద్‌సాగర్‌ అన్నారు. చంద్రబాబు పుట్టిన రోజును కూడా మహానాడు లాంటి ప్రజాపండుగగా జరుపుకోవాలనే ఆకాంక్ష టీడీపీ శ్రేణుల్లో, అభిమానుల్లో బలంగా కనిపిస్తోందన్నారు. భారతదేశం మొత్తం గర్వించేలా తెలుగుజాతి గౌరవాన్ని చాటిచెప్పిన ఘనత టీడీపీదని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. టీడీపీ జెండా పట్టుకుని ఒక బాధ్యత గల కార్యకర్తగా పనిచేసిన తనను ఈ రోజు ఎంపీగా నిలబెట్టిన ఘనత చంద్రబాబుదేనన్నారు. అమెరికాలో నేడు 1.3 మిలియన్‌ తెలుగువారు ఉండటమంటే అది చంద్రబాబు వల్లనేనని, ఆయన తీసుకొచ్చిన సంస్కరణల ద్వారానే తెలుగువారు అమెరికాలో ఉండగలుగుతున్నారని కోమటి జయరాం అన్నారు. అమెరికా నుంచి వర్చువల్‌గా పాల్గొన్న ఆయన ప్రసంగించారు. నేడు చంద్రబాబు నాయకత్వంలో, రేపు లోకేశ్‌ దిశానిర్దేశంలో టీడీపీ మరో 40 ఏళ్లు రాష్ట్రం కోసం పనిచేస్తుందన్నారు. తెలుగుజాతి అనగానే మొదట గుర్తుకొచ్చే వ్యక్తి ఎన్టీఆర్‌ అని, తెలుగింటి ఆడబిడ్డలకు ఆస్తిహక్కు ఇచ్చి, ఉచిత బస్సు ప్రయాణం కల్పించి వారికి ఆత్మగౌరవం ఇచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం అని కార్యకర్త ఓం ప్రకాష్‌ అన్నారు. యువతను గంజాయి మత్తులో ముంచి వారి భవిష్యత్తును నాశనం చేసింది జగనేన్నారు.

Updated Date - May 29 , 2026 | 04:24 AM