చంద్రబాబుతో రాజకీయాలకు విజన్
ABN , Publish Date - May 29 , 2026 | 04:23 AM
రాజకీయాల్లో పెనుమార్పులు తెచ్చింది మన ఎన్టీఆర్. ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ టీడీపీ. రాజకీయాలకు విజన్ తోడు చేసింది చంద్రబాబు....
రాజకీయ తీర్మానంపై చర్చలో కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు
20 ఏళ్లు ఈ ప్రభుత్వం కొనసాగాలి: అనిత
అమరావతి, మే 28 (ఆంధ్రజ్యోతి): ‘రాజకీయాల్లో పెనుమార్పులు తెచ్చింది మన ఎన్టీఆర్. ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ టీడీపీ. రాజకీయాలకు విజన్ తోడు చేసింది చంద్రబాబు’ అని కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు అన్నారు. మహానాడులో రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన మాట్లాడారు. 1982లో రాజకీయ విప్లవంగా దేశస్థాయిలోనే ప్రకంపనలు సృష్టించిన పార్టీ టీడీపీ అని అన్నారు. ‘గత 44 సంవత్సరాలుగా అనేక సంక్షోభాలు ఎదుర్కొని దేశ స్థాయిలో ప్రత్యేకమైన గుర్తింపు సాధించిన పార్టీ తెలుగుదేశం పార్టీనే. ఈ సారి రాజకీయ తీర్మానంలో మనం గుర్తించాల్సిన విషయాలు సంకల్పం, కర్తవ్యం. రాష్ట్రానికి సుస్థిరమైన పరిపాలన అందించాల్సిన బాధ్యత టీడీపీకి ఉంది. ఎన్టీఆర్ పార్టీని మొదలు పెట్టినప్పుడు సమాజమే దేవాలయం-ప్రజలే దేవుళ్లు అన్న సిద్ధాంతాన్ని చంద్రబాబు నిజం చేస్తున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడూ లేనటువంటి విజన్ అనే పదాన్ని రాజకీయాలకు తోడు చేశారు. ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేస్తూ రెండు సంవత్సరాల్లోనే రూ.23 లక్షల కోట్లు మన రాష్ట్రానికి తీసుకొచ్చి కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టిన వ్యక్తి లోకేశ్. ఎన్టీఆర్‌ది ఆత్మగౌరవం నినాదం అయితే చంద్రబాబు ఆత్మవిశ్వాసం పెంచారు. లోకేశ్ మనోధైర్యాన్ని పెంచుతున్నారు’ అని అన్నారు.
తెలుగుజాతి గర్వపడే పార్టీ
‘ఒక మహానుభావుడి రూపకల్పన, మరో విజనరీ నాయకుడి కార్యదక్షత, ఇంకో నాయకుడి భవిష్యత్తు ప్రణాళిక.. వీళ్ల ముగ్గురిని నడిపించి, నడిపిస్తూ పార్టీ కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడ్డ కార్యకర్తలు.. ఇవన్నీ కలిపి తెలుగుజాతి గర్వపడే పార్టీ తెలుగుదేశం’ అని హోం మంత్రి అనిత అన్నారు. రాజకీయ తీర్మానంపై మాట్లాడుతూ.. ఎంతో మంది యువకుల గళంగా నిలబడిన లోకేశ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ‘రానున్న 15 ఏళ్లు కాదు.. 20 ఏళ్లు ఇదే ప్రభుత్వం కొనసాగితే 2047 నాటికి దేశంలోనే కాదు, ప్రపంచంలోనే మొట్టమొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలుస్తుందని, ఇది రాసిపెట్టుకోండి’ అని చెప్పారు.